
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ ఆధ్వర్యంలో 2019-24 వరకు జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికే రోల్ మోడల్‌గా నిలిచాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకరరావు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఏపీతో ఇతర రాష్ట్రలను పోల్చి చూశాయని జూపూడి తెలిపారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ కంటే ఎక్కువ పథకాలను అందిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా.. హామీల అమల్లో విఫలమైందని మండిపడ్డారు.
ప్రజల్లో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోందని.. వైఎస్సార్‌సీపీ ప్రజలతో కలిసి కూటమి హామీల అమలు కోసం ప్రశ్నిస్తుంటే దాన్ని భరించలేక చంద్రబాబు తనకలవాటైన డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీశారని జూపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే లేని లిక్కర్ స్కామ్‌లను బయటకు తీసి వైఎస్సార్సీపీ నేతలను అక్రమ అరెస్టులు చేస్తున్నారని తేల్చి చెప్పారు. ఎన్ని కుట్రలు చేసినా.. వైఎస్సార్‌సీపీ ప్రజల పక్షానా నిలబడుతుందన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..
హామీల కోసం నిలదీస్తే కూటమికి ఊపిరాడడం లేదు:
వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో రెండేళ్ల పాటు కరోనా మహమ్మారి బాధిస్తున్నా.. ముఖ్యమంత్రిగా ప్రజల ప్రాణాలను కాపాడడంలో ఆయన తీసుకున్న చర్యలు దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచాయి. రూ.2.75 లక్షల కోట్లను పార్టీలు, కులాలు, మతాలకతీతంగా లబ్ధిదారులకు మధ్యవర్తులు లేకుండా.. డీబీటీ రూపంలో సంక్షేమం అందించారు. దేశంలోనే ఈ విధానం ఒక సందేశంగా మిగిలింది. ఇప్పుడు కూటమి పాలన అధికారంలోకి వచ్చి దాదాపు 14 నెలలు అయిన తర్వాత తాము ఎక్కడ, ఎందుకు, ఎలా మోసపోయామన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారు.
ఈ నేపథ్యంలో ప్రజలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే.. ఎన్ని నిర్భంధాలున్నా ప్రజల తరపున ప్రజల్లోకి వైఎస్ జగన్ మాత్రమే వెళ్తున్నారు. ఆయన ప్రజల కోసం వెళ్లిన ప్రతిసారి లక్షలాదిగా ప్రజలు తరలివస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఆయన పర్యటనలపై ఆంక్షలు విధిస్తూ వస్తోంది. అయితే కూటమి పార్టీ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలేంటి.. వాటిని ఎందుకు అమలు చేయడం లేదని ప్రజల తరపున వైఎస్ జగన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది.
ఇందులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యూఆర్ కోడ్‌తో ఉన్న ఒక ప్రణాళిక ఇచ్చి.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చంద్రబాబు ఇచ్చిన హామీలు వస్తాయి.. వాటి అమలు కోసం ప్రజలు నిలదీయండి అని చెప్పింది. దీంతో ప్రజలు టీడీపీని, కూటమి పార్టీలని నిలదీస్తుంటే... చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు ఊపిరి ఆడటం లేదు. ఈ సందర్భంలో తాను పరిపాలన చేయలేనని.. అవసరమైతే ధర్నాలు చేస్తానంటూ కూటమి భాగస్వామి పవన్ కళ్యాణ్ చేతులెత్తేశాడు. ఆయన ప్రభుత్వంలో ఎక్కడున్నాడో ఆయనకే తెలియదు.
సమాధానం లేక డైవర్షన్ పాలిటిక్స్:
ఈ నేపథ్యంలో ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కూటమి పార్టీలు పారిపోతున్నాయి. ఈ తరుణంలో చంద్రబాబు పక్కా ప్రణాళిక ప్రకారం 'డైవర్షన్ పాలిటిక్స్' మార్గాన్ని ఎంచుకున్నారు. ఇందులో భాగంగానే లేని లిక్కర్ స్కామ్‌ని తెరపైకి తీసుకొచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోని లిక్కర్ పాలసీ వల్ల ఖజానాకి రూ.3,500 కోట్లు నష్టం వచ్చిందని చెబుతున్నారు.
కానీ వాస్తవానికి ఖజానాకి గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ అమ్మకాల వల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. కూటమి 14 నెలల పాలనలో లిక్కర్ పాలసీలో అంతా దోపిడీ మయంగా మారింది. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి పెద్ద సంఖ్యలో యూట్యూబ్ చానెల్స్ ఓపెన్ చేశారు. డబ్బులిచ్చి ప్రపంచంలో వివిధ దేశాల నుంచి యూట్యూబ్ ఛానెల్స్ ప్రారంభించి.. తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
ఒక వైపు మద్యం కేసు పేరుతో వరుస అరెస్టులు చేస్తున్నారు. ఇంకో వైపు పెయిడ్ ఆర్టిస్టులతో వైఎస్ జగన్ హయాంలో మద్యం తాగి 30,000 మంది చనిపోయారని ప్రచారం చేస్తున్నారు. గతంలో వాళ్ల హయాంలో మద్యపానం వల్ల ఒక్కరూ చనిపోలేదని విచిత్రమైన వాదన తెరపైకి తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్ష నేతగా, ప్రజలతో గొంతు కలిపి వారేం అడుగుతున్నారో వాటిపై వైఎస్ జగన్ ప్రశ్నిస్తుంటే... వాటికి ఈ 35 మార్కులు బ్యాచ్ సమాధానం చెప్పలేకపోతుంది.

పరిపాలన నాకు చేతగాదు అని చెప్పే భాగస్వామితో కలిసి అధికారంలో ఉన్న కూటమి కాబట్టి.. 35 మార్కులు బ్యాచ్ అయింది. పరిపాలన చేతకాకపోతే ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు. మీకెందుకు రాజకీయాలు. ఒకవైపు పరిపాలన చేతగాదు అని చెబుతూనే మరోవైపు వైఎస్ జగన్‌ను విమర్శించడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను అన్న సంకేతం పంపుతున్నారు.
వందలాది యూట్యుబ్ ఛానెళ్లతో అబద్దపు ప్రచారం:
నిజం గడప దాటేలోపే అబద్దం ప్రపంచాన్ని చుట్టి వచ్చేస్తుందన్న సామెత తరహాలో.. 14 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వ పాలనలో తమకేం మేలు జరగలేదని తెలుసుకునేలోపు ఐదేళ్ల గత ప్రభుత్వ పాలనపై పెద్ద సంఖ్యలో యూట్యూబ్ ఛానెళ్లలో విషం చిమ్మడం ప్రారంభించారు. ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో అంతా విధ్వంసమే జరిగిందని లక్షలాది పాంప్లెట్స్ తో ప్రచారం చేస్తున్నారు. విధ్వంసం జరిగితే రూ.2.75 లక్షల కోట్లు డీబీటీ ఎవరి అకౌంట్లలోకి వెళ్లింది. వైఎస్ జగన్ పాలనలో విధ్వంసమే జరిగితే ఆయన ప్రజాసమస్యల మీద బయటకు వెళ్తున్న ప్రతిసారి గతంలో పథకాలు తీసుకున్న లబ్ధిదారులే మీ పాలన మరలా కావాలని వెంటపడుతున్నారు.
గత ఎన్నికల్లో మేం పొరపాటు పడ్డామని చెబుతున్నారు. కూటమి పార్టీల అబద్దపు ప్రచారాలని నమ్మి మోసపోయామని చెబుతున్నారు. దీంతో వందలాది యూట్యూబ్ ఛానెళ్లతో అబద్దాలు ప్రసారం చేస్తున్నారు. 2017 లో కేంద్ర హోంశాఖ నివేదిక ప్రకారం అప్పటి టీడీపీ ప్రభుత్వంలో 183 మంది కల్తీ లిక్కర్‌తో చనిపోగా... 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాం నాటికి మరణాల సంఖ్య గతం కన్నా 27 తగ్గగా... 2020 నాటికి మరో 18 తగ్గింది. ముప్పై వేల మంది చనిపోయారని చెబుతున్నవారు వారి దగ్గర ఆధారాలుంటే బయటపెట్టాలి. తలో లెక్కతో కూటమి అనుకూల ఛానెల్స్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
వైఎస్ జగన్ హయాంలో జరిగింది ముమ్మూటికీ అభివృద్ధి, పాలనలో అద్భుతాలు చేసి చూపించిన ప్రభుత్వం వైఎస్సార్సీ కాంగ్రెస్ పార్టీ. విద్యారంగంలో ఇంగ్లిషు మీడియం, నాడు నేడుతో సహా అనేక అద్భుతాలు చేసి చూపించారు. ఆరోగ్యశ్రీ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో వైద్య రంగంలోనూ సమూల మార్పులు చేశారు. ఇవాళ కూటమి ప్రభుత్వ విద్య, వైద్య విధానాలేంటో కూడా తెలియడం లేదు. ఆ రోజు వైఎస్ జగన్ ఇంగ్లిషు మీడియం ప్రవేశపెడితే కోర్టులకెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేసారు. బాబా సాహెబ్ అంబేద్కర్‌తో సహా భారత రాజ్యాంగ సృష్టికర్తలు ఏదైతే ఆశించారో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ అది చేసి చూపించారు.
ఏం నాటుతున్నారో అదే వస్తుంది:
ఇవాళ రెడ్ బుక్ అనే ఇడియటిక్ బుక్ తీసుకొచ్చి దాన్ని అమలు చేస్తున్నామని చెబుతున్నారు. గుర్తుంచుకొండి ఇవాళ ఏం మీరు నాటుతున్నారో అదే కాస్తుంది. వ్యవస్థలను నాశనం చేయాలనుకునే మీ ఫాసిస్టు దోరణిని ప్రజలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. మహిళా సాధికారత పేరుతో వైఎస్ జగన్ ప్రభుత్వంలో మునుపెన్నడూ లేని అభివృద్ధి జరిగింది. 30 లక్షల ఇళ్ల నిర్మాణం మహిళల పేరుతో చేపట్టారు. అంతే కాదు రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే.. డెమొగ్రాఫిక్ ఇంబేలన్స్ వస్తుందని కోర్టులో సిగ్గులేకుండా చెప్పారు. సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారు అభివృద్ధి చెందాలని కోరుకున్నది వైఎస్ జగన్‌మోహన్ రెడ్డా.? మీరా.?
పీ-4 ఓ మూర్ఖ పథకం:
ఆ రోజు వైఎస్ జగన్ పేదరిక నిర్మూలన కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు పార్టీలకతీతంగా చేశారు. మీరు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ కొత్త కొత్త పేర్లతో పథకాలు పెడతారు. పీ-4 పేరుతో ప్రతి గ్రామంలో సర్వే చేస్తారు. ఇందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానికి పేదరికం పోదు. టీడీపీకి ఓటేసి వారికి మాత్రమే మీరు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. ఇది కూడా ఓ ఇడియటిక్ ప్రోగ్రాం. ఇక మీరు అడబిడ్డ నిధి పథకం కింద ఇస్తామన్న రూ.1500 ఏమయ్యాయి. దానికి సమాధానం చెప్పాలి.
దానికి సమాధానం చెప్పలేక నీ అనుకూల యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా 30 వేల మంది బిడ్డలు తండ్రులను కోల్పోయారని.. అనాధలయ్యారని తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు. మీకు చేతనమైతే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనతో పోటీ పడండి. ఆయన మానవతా విలువలతో వైద్యం, విద్యా రంగాల్లో ఆయన చేసిన కృషితో పోటీపడండి.
నిజమైన మరో రెడ్ బుక్ ఉంది. 2024-27 మధ్యలో కరోనా లాంటి సాంక్రమిక వ్యాధులు ప్రజల్లో ప్రబలకుండా ఉండేందుకు వైద్యులు తయారు చేసిన పుస్తకం పేరు రెడ్ బుక్. మీరు తయారు చేసింది మీకు నచ్చని వాడి పేరు తీసుకుని వారిని జైల్లో వేయడం మీరు చేస్తున్న పని. ఆధారాలు లేని కేసుల్లో మీరు అరెస్టు చేసిన వారందరూ త్వరలోనే బయటకు వస్తారు.. కచ్చితంగా మీ అందరికీ తగిన శాస్తి జరుగుతుంది.
అలా కాకుండా గాలి వార్తలు పోగు చేస్తూ ప్రజలను ఎల్లకాలం మోసం చేయలేరు. ప్రపంచంలో జరిగిన ఏ విప్లవాన్ని తీసుకున్నా.. మీకు అర్ధం అవుతుంది. జనాలు నిజాలు తెలుసుకున్నారు. కూటమి పార్టీలను ఇక ఎవరూ కాపాడలేరు. గ్రామాల్లోకి వెళితే మీకు, మీ ప్రజాప్రతినిధులకు వాస్తవాలు ప్రజలే చూపిస్తారు.
ఆడబిడ్డ నిధి కోసం ఆంధ్రప్రదేశ్ ని అమ్మాలని చెబుతున్న మంత్రులున్న ప్రభుత్వమిది. ఇప్పటికే రాష్ట్రంలో ఖనిజ సంపద, మెడికల్ కాలేజీలతో సహా అన్నింటినీ మీరు ఇప్పటికే అమ్మకం పెట్టారు. వైఎస్ జగన్ ఒక వ్యక్తి కాదు.. ఆయన వెనుక ప్రజా సైన్యం ఉందన్న విషయం గుర్తుపెట్టుకొండి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అభాసుపాలు చేయడానికి మీరు చేస్తున్న కుయుక్తులు ఏవీ ఫలించవన్న విషయం గుర్తుపెట్టుకొండి. ప్రజల ఆమోదం ఉన్నంతవరకు వైఎస్సార్‌సీపీని, వైఎస్ జగన్‌ని మీరేం చేయలేరని జూపూడి తేల్చి చెప్పారు.