పైకి మాత్రం నవ్వుల పువ్వులు.. కడపులో కత్తులు పెట్టుకొని మరీ.. | Sakshi
Sakshi News home page

పైకి మాత్రం నవ్వుల పువ్వులు.. కడపులో కత్తులు పెట్టుకొని మరీ..

Published Sun, Jan 8 2023 4:28 PM

Internal conflicts in Guntur TDP politics P Pullarao Vs GV Anjaneyulu - Sakshi

ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం నేతల మధ్య ఆధిపత్యపోరు పరాకాష్టకు చేరింది. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకునే పరిస్థితి కొనసాగుతోంది. పైకి మాత్రం అందరూ నవ్వుల పువ్వులు పూయిస్తున్నారు. కడుపులో కత్తులు పెట్టుకుని బయటకు మాత్రం నవ్వుతూ పలకరించుకుంటున్నారు. జిల్లాలో ప్రధానంగా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, పార్టీ సీనియర్ నేత జీవీ ఆంజనేయులు మధ్య ఇప్పుడు వార్ నడుస్తోంది. ఉమ్మడి జిల్లాకు మూడుసార్లు ప్రత్తిపాటి పుల్లారావు టీడీపీ అధ్యక్షుడిగా చేశారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు మంత్రి పదవి అప్పగించాక.. పుల్లారావు స్థానంలో పార్టీ అధ్యక్ష పదవిని అధిష్టానం జీవీ ఆంజనేయులకు కట్టబెట్టింది. జీవీ కూడా రెండుసార్లు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా జీవీ వ్యవహరిస్తున్నారు.

సొంతింటి నుంచే వెన్నుపోటు
ప్రత్తిపాటి పుల్లారావు మంత్రిగా ఉన్న సమయంలో కొంతమంది ఎంపిక చేసిన జర్నలిస్టులకు ప్రత్యేక లబ్ది చేకూర్చారు. తద్వారా గుంటూరు జిల్లా మీడియాలో ఆయన మనుషులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మీడియా ప్రతినిధులు చేతిలో ఉన్నందువల్లే పుల్లారావుకు ఎవరిమీద అయినా కోపం ఉంటే పథకం ప్రకారం వారిపై నెగిటివ్ కథనాలు రాయించి డామేజ్ చేస్తుంటారని పార్టీలోనే ఆయన ప్రత్యర్థులు చెబుతారు. కొన్నాళ్లుగా మాజీ మంత్రి పుల్లారావు, జీవీ ఆంజనేయులుకు మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో పుల్లారావు తన పలుకుబడిని ఉపయోగించి జీవీపై మీడియాలో నెగిటివ్ కథనాలు రాయిస్తూ.. వీటిని పార్టీ కార్యాలయానికి కూడా పంపుతున్నారు. ఈ నెగిటివ్ కథనాల వెనుక ఎవరున్నారనేది కొన్నాళ్లపాటు జీవీకి అర్దంకాలేదు. తర్వాత అసలు విషయం తెలుసుకుని జీవీకి మైండ్ బ్లాకయ్యిందట. తనకు టికెట్ రాకుండా చెయ్యడానికి పుల్లారావు కుట్ర పన్నారని జీవీ ఆంజనేయులు అందరి వద్ద చెప్పుకుంటున్నారట. అప్పటినుంచి పుల్లారావును జీవీ టార్గెట్ చేశారు.

చదవండి: (Pawan-Chandrababu Meet: రెచ్చిపోయిన చంద్రబాబు)

రాజకీయం కాదు రియల్ బిజినెస్
గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రత్తిపాటి పుల్లారావు పూర్తిగా హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. అక్కడే రియల్ వ్యాపారం చేసుకుంటున్నారు. ఏపీలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో సైతం పాల్గొనడం లేదు. కనీసం కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండడంలేదు. వీటన్నింటినీ పరిశీలించిన జీవీ.. పుల్లారావు ఎక్కడెక్కడ, ఏం చేస్తున్నాడో వివరిస్తూ పార్టీ నాయకత్వానికి పెద్ద లిస్ట్ పంపించారట. ఐదేళ్లు మంత్రి పదవిలో ఉండి అడ్డ దిడ్డంగా సంపాదించి కష్టకాలంలో పార్టీని, కార్యకర్తలను గాలికొదిలేశారంటూ ఒక రిపోర్ట్ ను కూడా అధిష్టానానికి పంపారట. ఇలా అవకాశం వచ్చినప్పుడల్లా పుల్లారావుకు పొగపెడుతూనే ఉన్నారు. పుల్లారావు కూడా మీడియాను అడ్డం పెట్టుకుని జీవిపై కథనాలు రాయించడం కొనసాగిస్తూనే ఉన్నారట.

జీవీ మార్కు రాజకీయం
కొంతకాలంగా పుల్లారావు అప్పుడప్పుడు నియోజకవర్గంలో కనిపిస్తున్నారంటే అందుకు కారణం జీవీ ఆంజనేయులేనని పార్టీలో ప్రచారం సాగుతోంది. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోతే పుల్లారావుపై అధిష్టానానికి ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తూ..ఆయనకు చెక్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారట. అంతేకాదు చిలకలూరిపేటలో పుల్లారావు వ్యతిరేకులందరినీ కలుపుకుని వారితో జట్టుకడుతున్నారట ఆంజనేయులు.  ప్రత్తిపాటి కూడా వినుకొండలో జీవీ వ్యతిరేకవర్గాన్ని కూడగట్టి జీవీకి చెక్ పెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఇలా ఇద్దరు నేతలు ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు పార్టీలో పెద్ద చర్చకు దారితీసింది.

- పొలిటికల్‌ ఎడిటర్‌, సాక్షి డిజిటల్‌
feedback@sakshi.com

Advertisement
Advertisement