రజనీ పార్టీలో చేరతాను : లారెన్స్‌

I Will Join Rajinikanth Party Says Raghava Lawrence - Sakshi

చెన్నై : దక్షిణాది ప్రముఖ దర్శకుడు, నటుడు రాఘవా లారెన్స్‌ చేసిన ఓ ప్రకటన తమిళనాడు రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. మొదటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉండే లారెన్స్‌ తొలిసారి చేసిన ట్వీట్‌ తీవ్ర చర్చనీయాంశమవుతోంది. చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఎంతో మందికి సహాయం చేస్తున్నా అని, రాజకీయాల్లోకి వస్తే అంతే రెట్టింపుతో పనిచేస్తా అని శనివారం తన సోషల్‌ మీడియా ఖాతాలో పేర్కొన్నారు. అంతేకాకుండా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ పార్టీలో చేరతానంటూ సంచలన ప్రకటన చేశారు. వ్యక్తిగత దూషణకు నేనెప్పుడూ దూరంగా ఉంటానని, రజనీకాంత్‌ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటా అని అన్నారు.  రాజకీయాల ద్వారా ప్రజలకు నా వంతు సేవ చేస్తానని స్పష్టం చేశారు. (పార్టీ పెట్టిన పది రోజుల్లోనే..)

‘ఎన్నో ఏళ్లుగా అనేక రకాలుగా సమాజానికి సేవ చేస్తున్నా. తన సేవా కార్యక్రమాలు చేసి ఎంతో మంది అభిమానులు, సన్నిహితులు నన్ను రాజకీయాల్లోకి రావాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. వారందరికీ నేడు ఓ శుభ వార్తను చెబుతున్నా. నా గురువు గారు రజనీకాంత్‌ పార్టీ ప్రకటన అనంతరం ఆయన బాటలో నడుస్తాం. ఆయన పార్టీలో చేరతాను. నా సమాజ సేవకు మాజీ ముఖ్యమంత్రులు దివంగత జయలలిత, కరుణానిధితో పాటు స్టాలిన్, పళనిస్వామి ఎంతో సహాయం చేశారు. నేటి రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు చేయడం తప్పడంలేదు. కానీ రజనీకాంత్‌ మాత్రమే విపక్ష నాయకులపై విమర్శలు చేయకుండా రాజకీయాలు చేయగలరు. అందునే నేను ఆయన దారిలో నడవాలి అని నిర్ణయించుకున్నా. నాకు సహాయం చేసిన వారిని నేను విమర్శించలేను’ అని లారెన్స్‌ ట్వీట్‌ చేశారు. (రజనీ రాజకీయ ప్రవేశం ఉంటుందా..?)

కాగా తమిళనాట రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశంపై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. గత మూడేళ్లుగా ఆయన పార్టీ పెడతారంటూ పెద్ద ఎత్తున చర్చజరుగుతోంది. రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆయన పార్టీ ప్రకటిస్తారని రజనీ సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే లారెన్స్‌ ట్వీట్‌ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా ప్రకటనతో రజినీకాంత్‌ పార్టీపై తమిళనాడులో చర్చలు మళ్లీ మొదలైయ్యారు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top