చార్మినార్ వద్ద హైటెన్షన్‌.. సంజయ్‌ సవాల్‌

GHMC Elections 2020:Bandi Sanjay Challenge To CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గ్రేటర్‌లో రాజకీయం వేడెక్కింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. వరదసాయంగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పదివేల ఆర్థిక సాయం ఆపాలంటూ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పేరు మీద ఎన్నికల సంఘానికి రాసిన లేఖ తీవ్ర వివాదాన్ని రేపుతోంది. వరదసాయం ఆగిపోవడానికి బీజేపీ నేతలే కారణమంటూ టీఆర్‌ఎస్‌ నేతలు విమర్శలకు దిగగా.. ఆ లేఖతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ సంజయ్‌ చెబుతున్నారు. తమను దొంగదెబ్బ తీయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆడిన నాటకంలో భాగమే ఈసీకి లేఖ అని ఎదురుదాడికి దిగారు. తన పేరు మీద సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న లేఖ తాను రాయలేదని, సీసీఎస్‌లో బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. నకిలీ లేఖపై నిజాలు తేల్చుకుందామంటూ సీఎం కేసీఆర్‌కు సంజయ్‌ సవాలు విసిరారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆల‌యం వ‌ద్ద‌కు రావాలంటూ సవాల్‌ చేశారు. లేఖను తాను రాలేదని ఆమ్మవారిపై ప్రమాణం చేస్తానని తేల్చి చెప్పారు. (టికెట్‌ దక్కలేదని ఆత్మహత్యాయత్నం)

దీనిలో భాగంగానే బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి చార్మినార్ వరకు శుక్రవారం బైక్‌ ర్యాలీకి కాషాయదళం సిద్ధమైంది. ర్యాలీగా భాగ్యల‌క్ష్మి అమ్మవారి ఆల‌యం వ‌ద్దకు బండి సంజ‌య్ చేరుకోనున్నారు. ఇప్పటికే బీజేపి కార్యాలయానికి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. మరోవైపు సంజయ్‌ ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవని మొదట చెప్పిన పోలీసులు.. ఆ తరువాత అనుమతిని ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే శుక్రవారం కావ‌డంతో చార్మినార్ వీధుల్లో టెన్షన్‌ నెలకొంది. ఇప్పటికే బీజేపీ కార్యాలయం ముందు,చార్మినార్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు చోటుచేసుకోకుండార్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని సీపీ అంజనీకుమార్‌ హెచ్చరించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top