
సాక్షి, తాడేపల్లి: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu) వల్ల వెంకటేశ్వర స్వామి ఖ్యాతి తగ్గుతోందని.. ఆయన నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదంగా మారాయంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్(Vellampalli Srinivas) మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడలోనూ దుర్గమ్మ పేరుతో టీడీపీ నేతలు దోపిడీకి దిగారంటూ ధ్వజమెత్తారు.
‘‘నవరాత్రి ఉత్సవాలను పక్కన పెట్టి విజయవాడ ఉత్సవ్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇళయరాజా మ్యూజిక్ షోకి టిక్కెట్ రూ.59 వేలకు విక్రయిస్తారా?. ఇంత దారుణమైన దోపిడీ చేస్తారా?. ఆ దోపిడీ సొమ్మంతా నారా లోకేష్(Nara Lokesh) జేబులోకి వెళ్తున్నాయి. వెంకటేశ్వరస్వామి, దుర్గమ్మ భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారు. మెడికల్ కాలేజీల వివాదాన్ని డైవర్షన్ చేయటానికి టీటీడీ(TTD)ని తెర మీదకు తెచ్చారు. బీఆర్ నాయుడు ఛైర్మన్ అయ్యాక వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దిగజారింది. చంద్రబాబు సీఎం అయి ఉండి లడ్డూని వివాదాస్పదం చేశారు’’ అంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు సరిగా చేయనందునే తొక్కిసలాటలో ఏడుగురు చనిపోయారు. మా హయాంలో శ్రీవాణి టిక్కెట్లపై అనవసర వివాదం చేశారు. మేము ఆనాడు వెయ్యి టికెట్లు అమ్మితే ఇప్పుడు రెండు వేల టిక్కెట్లు ఎలా అమ్ముతున్నారు?. శ్రీవాణి టిక్కెట్లు ఆపేస్తామన్న బీఆర్ నాయుడు ఇప్పుడు అంతకంటే అధికంగా ఎలా విక్రయిస్తున్నారు?. వీఐపీ టిక్కెట్లను భారీగా పెంచి సామాన్యులకు స్వామి దర్శనాన్ని తగ్గించారు. పరకామణి భవనాన్ని సైతం జగన్ హయాంలోనే నిర్మించి ప్రారంభించారు.
..సీసీ కెమెరాలతో సహా అన్ని సౌకర్యాలు కల్పించాం కాబట్టే రవికుమార్ లాంటి దొంగలు దొరికారు. చంద్రబాబు హయాంలో దొంగను పట్టుకోలేక పోయారు. మా హయాంలో దొంగను పట్టుకుని వారి ఆస్తులను టీటీడీకి స్వాధీనపరిచాం. ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే దీనిపై సీబిఐతో విచారణ జరిపించండి. అంతేగానీ వెంకటేశ్వరస్వామి ఖ్యాతిని తగ్గించవద్దు. తప్పు చేసినవారిని ఎవరినీ వెంకటేశ్వర స్వామి క్షమించరు.. తప్పకుండా తగిన శిక్ష వేస్తారు. దుర్గమ్మ పేరుతో టీడీపీ నేతలు దోపిడీకి తెర తీశారు. ఉత్సవాలకు వచ్చే భక్తులను ఇబ్బంది పెట్టవద్దు’’ అంటూ వెల్లంపల్లి హితవు పలికారు.
ఇదీ చదవండి: అప్పులపై బాబు, పవన్ డ్రామా బట్టబయలు
అధికారుల మధ్య సమన్వయం లేకపోవటం వలన సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నవరాత్రి ఉత్సవాలపై కనీసం ఒక్క సమీక్షనైనా ఎంపీ, ఎమ్మెల్యే పెట్టారా?. విజయవాడ ఉత్సవ్ మీద ఉన్న ప్రేమ నవరాత్రి ఉత్సవాల మీద ఎందుకు లేదు?. స్టాల్స్ ఏర్పాటు పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇళయరాజా షో కోసం టిక్కెట్ రూ.59 వేలకు విక్రయిస్తారా?. ఇది దోపిడీ కాక మరేమిటి?. ఈ దోపిడీలను ఆపకపోతే మేము న్యాయ పోరాటం చేస్తాం’’ అని వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు.