టీఎంసీ పతనం ఆరంభం: సువేందుకు స్వాగతం

End of TMC has begun, Suvendu most welcome to join us: BJP - Sakshi

టీఎంసీ నేతలకు బీజేపీ గాలం

మంత్రి సువెందు  అధికారి రాజీనామాతో ఊపందుకున్న బీజేపీ ప్రయత్నాలు

బీజేపీ  తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే మిహిర్ గోస్వామి

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో జరిగే అవకాశం ఉందన్న అంచనాల మధ్య రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. అటు అధికారాన్నికాపాడుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్‌ (టీఎంసీ) శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పార్టీలో  రగులుతున్న అసమ్మతి సెగలు, రాజీనామాలతో టీఎంసీ కష్టాల్లో కూరుకుపోతోంది. మరోవైపు తిరుగుబాటు నాయకులను బుజ్జగించి కాషాయ దళంలో చేర్చుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది.   తాజా పరిణామాలపై మాజీ టీఎంసీ నేత,  బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్‌ రాయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర  రవాణా మంత్రి, సీనియర్ నాయకుడు సువేందు అధికారి రాజీనామాను స్వాగతించిన ఆయన టీఎంసీ ముగింపు ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. ఆయన బీజేపీలో చేరితే పార్టీకి, ఆయనకు ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. సువెందు మంత్రి పదవికి రాజీనామా చేసిన కొద్ది గంటలకే ఆయన ఈ మేరకు స్పందించారు. (క్లిష్ట సమయంలో మమతకు భారీ షాక్‌)

మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  దిలీప్ ఘోష్ స్పందిస్తూ సువేందు అధికారికి బీజేపీ ద్వారాలు తెరిచే ఉన్నాయని పేర్కొన్నారు. అధికార పార్టీ తీరు పట్ల  మరికొంతమంది నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనీ, వారికి కూడా బీజేపీలోకి ఆహ్వానం పలుకుతున్నామన్నారు. సువెంద్‌ రాజీనామా టీఎంసీ పతనానికి సంకేతమనీ, ఇక ఆ పార్టీ  తెరమరుగవ్వడం ఖాయమన్నారు. అంతేకాదు "ఈ రోజు పెద్ద వికెట్ పడిపోయింది" ఇక ఆత్మగౌరవమున్న నాయకులంతా టీఎంసీకి గుడ్‌బై చెబుతారని ఘోష్ జోస్యం చెప్పారు. అదొక మునిగిపోతున్న ఓడ, అందులో  కెప్టెన్ మినహా ఎవరూ ఎవ్వరూ ఉండరన్నారు. 2019 (లోక్సభ ఎన్నికలు) బీజేపీకి సెమీ ఫైనల్. తామిపుడు  202 (అసెంబ్లీ ఎన్నికలు) లో ప్రధాన లక్ష్యానికి ముందుకుపోతున్నాం.. సువెందు అధికారి తమ పార్టీలోచేరితే ఇది మరింత ఊపందుకుంటుదన్నారు. 

కాగా టీఎంసీ  సీనియర్‌ నేత  రవాణ శాఖ మంత్రి సువేందు అధికారి ఈరోజు  రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనికి ముందు గురువారం ఆయన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని హుగ్లీ రివర్ బ్రిడ్జి కమిషనర్స్ చైర్మన్ పదవికి కూడా గుడ్‌బై చెప్పారు. మరోవైపు కూచ్‌బెహార్‌కు చెందిన టీఎంసీ మాజీ ఎమ్మెల్యే మిహిర్ గోస్వామి శుక్రవారం సాయంత్రం  బీజేపీ తీర్థం పుచ్చుకన్నారు. దీంతో 294 మంది సభ్యుల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ  ఎన్నికల పోరు రసవత్తరంగా మారనుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top