దుష్యంత్ చౌతాలాకు షాక్‌.. ఖట్టర్‌ను కలిసిన నలుగురు జేజేపీ ఎమ్మెల్యేలు | Sakshi
Sakshi News home page

దుష్యంత్ చౌతాలాకు షాక్‌.. ఖట్టర్‌ను కలిసిన నలుగురు జేజేపీ ఎమ్మెల్యేలు

Published Thu, May 9 2024 7:57 PM

Dushyant Chautala Faces Split In Party 4 MLAs Meet Manoharlal Khattar

బీజేపీ పాలిత ర్యానాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రంలో సీఎం నయాబ్ సింగ్ సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అసెంబ్లీలో బలపరీక్ష డిమాండ్‌ చేసిన దుష్యంత్ చౌతాలాకు సొంత పార్టీ ఎమ్మెల్యేలే షాక్‌ ఇచ్చారు. జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు గురువారం మధ్యాహ్నం బీజేపీ మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిశారు. 

పానిపట్‌లోని మంత్రి మహిపాల్ దండా నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఖట్టర్‌, మహిపాల్‌తో సుమారు అరగంటపాటు జేజేపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. అరగంటపాటు సాగిన ఈ సమావేశంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో నెలకొన్న తాజా సంక్షోభంపై చర్చించినట్లు సమాచారం.

కాగా ఇటీవల ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు (సోంబీర్ సంగ్వాన్, రణధీర్ సింగ్ గొల్లెన్, ధరంపాల్ గోండర్)  బీజేపీ ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకున్నారు. దీంతో నయాబ్‌ సింగ్‌ సైనీ సర్కార్‌ సంక్షోభంలో పడింది. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని కోరుతూ జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) చీఫ్‌ దుష్యంత్ చౌతాలా గురువారం హర్యానా గవర్నర్‌కు లేఖ రాశారు.  ఒకవేళ ప్రభుత్వానికి మెజారిటీ రాకపోతే రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు.

కాగా హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చడం కోసం కాంగ్రెస్‌కు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ మాజీ మిత్రపక్షమైన దుష్యంత్ చౌతాలా స్పష్టం చేశారు.  అసెంబ్లీలో అవిశ్వాసం పెడితే తాము బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా ఓటేస్తామని తెలిపారు. వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎంచుకుంటే కాంగ్రెస్‌కు బయటి మద్దతు ఇస్తానని ప్రకటించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement