గతం గతహా.. వాళ్లతో న‍న్ను పోల్చకండి.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

Dont Compare Me With Rahul Gandhi Congress Bharat Jodo Yatra - Sakshi

జైపూర్‌: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కీలక వ్యాఖ్యలు చేశారు. తనను మహానేతలతో పోల్చవద్దని పార్టీ కార్యకర్తలకు, మద్దతుదారులకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఒకప్పటి కాంగ్రెస్ నాయకులపై ఇప్పుడు ఆధారపడవద్దని, ప్రస్తత తరం పరిస్థితులు పూర్తిగా భిన్నమని పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం రాజస్థాన్‌లో కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో పార్టీ నాయకుడు ఒకరు రాహుల్‌ను మహాత్మా గాంధీతో పోల్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ..

'ఇలా పోల్చడం తప్పు. ఇప్పుడు పరిస్థితులు వేరు. అప్పటి నాయకులతో పోల్చడం సరికాదు. మహాత్మ గాంధీ గొప్ప వ్యక్తి. దేశ స్వేచ్ఛ కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశారు. 10-12 ఏళ్లు జైల్లో ఉన్నారు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. నన్ను ఆయనతో పోల్చవద్దు.' అని రాహుల్ అన్నారు. తన తండ్రి రాజీవ్ గాంధీ, నానమ్మ ఇందిరా గాంధీల గురించి కూడా ప్రస్తావించి భారమైన హృదయంతో సందేశం ఇచ్చారు.

'రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ దేశం కోసం ఎంతో చేసి అమరులయ్యారు. తమ వంతు కృషి చేశారు. కానీ కాంగ్రెస్ ప్రతి సమావేశంలో వాళ్ల గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, జవహర్‌లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ.. వాళ్లు చేయగలిగినంత చేశారు. కాంగ్రెస్ పార్టీలో వాళ్ల వంతు భూమిక పోషించారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామనే దానిపైనే దృష్టి సారించాలి. ప్రజల కోసం ఏం చేయాలని మాత్రమే ఆలోచించాలి' అని రాహుల్ పేర్కొన్నారు.

రాహుల్ భారత్ జోడో యాత్రలో ఇప్పటికే చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కూడా బుధవారం రాజస్థాన్‌లో రాహుల్‌తో పాటు కలిసి పాదయాత్ర చేశారు. శుక్రవారంతో 100 రోజులు పూర్తి చేసుకుంటున్న ఈ యాత్రతో తాము అనుకున్న లక్ష‍్యాలను చేరుకుంటున్నట్లు పార్టీ నాయకులు పేర్కొన్నారు.
చదవండి: వారసత్వ ముద్రను పనితీరుతో తొలగిస్తా: ఉదయనిధి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top