కేజ్రీవాల్ అవినీతి పరుడైతే.. ప్రపంచంలో ఒక్క నిజాయితీపరుడు ఉండడు.. సీబీఐ విచారణకు ముందు ఢిల్లీ సీఎం వీడియో..

Delhi CM Arvind Kejriwal Releases Video Before Going To CBI Office - Sakshi

న్యూఢిల్లీ:  డిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి సీబీఐ కార్యాలయంలో ఆదివారం విచారణకు హాజరయ్యే ముందు వీడియో రిలీజ్ చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. సీబీఐ అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తానని స్పష్టం చేశారు. తనను అరెస్టు చేస్తామంటూ బీజేపీ ప్రచారం చేస్తోందని, ఆ పార్టీ అధికార అహంకారంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

'మా మాట వినాలి లేదంటే జైల్లో పెడతాం అనే విధంగా బీజేపీ వ్యవహరిస్తోంది. దేశాన్ని ప్రేమిస్తా దేశం కోసం ప్రాణాన్ని సైతం ఇస్తా. రాజకీయాల్లోకి ఎన్నో ప్రశ్నల మధ్య పదేళ్ళ క్రితం అడుగులు వేశా. ఎన్నో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేశా. జైల్లో పెడతామని చెప్పి పదేపదే బెదిరిస్తున్నారు. ఎనిమిదేళ్లలో ఢిల్లీని అభివృద్ధి చేసి చూపెట్టా.  30 ఏళ్లలో గుజరాత్‌లో ఏం అభివృద్ధి చేశారు. నా జీవిత లక్ష్యం భారత్‌ను ప్రపంచంలో నెంబర్ వన్‌  చేయడం.

నేను షుగర్ వ్యాధిగ్రస్తుణ్ణి. ప్రతిరోజు 50 యూనిట్ల కంటే ఎక్కువ ఇన్సులిన్ తీసుకుంటున్నా.  అయినా అవినీతికి వ్యతిరేకంగా ఒకసారి పది రోజులు ఇంకోసారి 15 రోజులు నిరాహార దీక్ష చేశా. సీబీఐ 100 సార్లు పిలిచినా వెళ్లి సమాధానం చెప్తా. దేశం కోసం పుట్టాను దేశం కోసం చస్తాను.' అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.

అలాగే ఆదాయపు పన్ను శాఖలో ఒకప్పుడు కమిషనర్‌గా పనిచేసిన విషయాన్ని కేజ్రీవాల్ గుర్తు చేశారు. బీజేపీ తాను అవినీతిపరుడ్ని అని ప్రచారం చేస్తోందని, అలాంటి వాడినైతే అప్పుడే రూ.కోట్లు సంపాదించేవాడినని పేర్కొన్నారు. ఒకవేళ అరవింద్ కేజ్రీవాలే అవినీతి పరుడైతే.. ప్రపంచంలో ఒక్కరు కూడా నిజాయితీ పరుడు ఉండడని అన్నారు.
చదవండి: రూ.1,000 కోట్లు ఇచ్చానని చెబితే మోదీని అరెస్టు చేస్తారా?: కేజ్రీవాల్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top