నైరాశ్యంలో విపక్షాలు

Dejected parties taking refuge in vote bank, divisive politics - Sakshi

అందుకే విభజన రాజకీయాలు

బీజేపీ అధ్యక్షుడు నడ్డా ధ్వజం

న్యూఢిల్లీ: ప్రజలు తమను ఆదరించడం లేదన్న నిరాశతో విపక్షాలు విభజన రాజకీయాలకు తెర తీశాయని బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా మండిపడ్డారు. మోదీ పాలనలో దేశంలో మతోన్మాదం పెరుగుతోందంటూ 13 విపక్ష పార్టీలు చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు దేశవాసులనుద్దేశించి సోమవారం ఆయన లేఖ రాశారు. ‘‘ఓటుబ్యాంకు, విభజన రాజకీయాలకు పాల్పడి కూడా వరుస ఎన్నికల్లో విపక్షాలు ఘోర ఓటమినే మూటగట్టుకుంటున్నాయి.

మోదీ నాయకత్వంలో దేశ ప్రజలకు సాధికారత లభిస్తుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. అభివృద్ధిని అడ్డుకోజూస్తున్నాయి. బీజేపీ వ్యతిరేకతే ఏకైక ఎజెండాగా ఒక్కటై విభజన రాజకీయాలకు తెర తీస్తున్నాయి’’ అంటూ మండిపడ్డారు. దశాబ్దాలపాటు దేశాన్ని పాలించిన వాళ్లు ఇప్పుడు సోదిలో కూడా లేకుండా పోతుండటంపై ఆత్మవిమర్శ చేసుకోవాలంటూ కాంగ్రెస్‌కు చురకలు వేశారు. కాంగ్రెస్, ఇతర విపక్షాలు అధికారంలో ఉన్న రాజస్తాన్, పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో జరుగుతున్న మత ఘర్షణలు, రాజకీయ హింసపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

మత హింసకు కారకులు మీరే
విపక్షాల అసలు రంగు ప్రజల ముందు క్రమంగా బయట పడుతోందని నడ్డా అన్నారు. దాంతో వాటికి ఎటూ పాలుపోవడం లేదని ఎద్దేవా చేశారు.  ‘‘1966లో గో వధను నిషేధించాలంటూ పార్లమెంటు బయట శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సాధువులపై నాటి ప్రధాని ఇందిరాగాంధీ కాల్పులు జరిపించలేదా? ఆమె హత్యానంతరం సిక్కులపై భారీ హత్యాకాండ జరిగితే, పెద్ద చెట్టు కూలినప్పుడు ఆ మాత్రం ప్రకంపనలుంటాయని కుమారుడు రాజీవ్‌గాంధీ బాధ్యాతారహితంగా మాట్లాడలేదా? 1969లో గుజరాత్‌లో, 1980లో మొరాదాబాద్, 1984లో భివాండీ, 1989లో భాగల్పూర్‌ తదితర చోట్ల మత ఘర్షణలకు కారకులెవరు? దారుణమైన మత హింస బిల్లు తెచ్చిందే కాంగ్రెస్‌ సారథ్యంలోని యూపీఏ సర్కారు కాదా?’’ అని నడ్డా ప్రశ్నించారు. ఇప్పటికైనా విభజనవాదం వదిలి అభివృద్ధి రాజకీయాలను అందిపుచ్చుకోవాలని హితవు పలికారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top