‘సీఎం’ గొడవ అయిపోయింది.. ఇప్పుడు ‘డిప్యూటీ సీఎం’ కోసం.. | Dalit community wants Dy CM post for Muniyappa | Sakshi
Sakshi News home page

‘సీఎం’ గొడవ అయిపోయింది.. ఇప్పుడు ‘డిప్యూటీ సీఎం’ కోసం..

May 30 2026 4:25 PM | Updated on May 30 2026 4:53 PM

Dalit community wants Dy CM post for Muniyappa

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్ధరామయ్య తప్పుకోవడంతో డీకే శివకుమార్‌ త్వరలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి కోసం కొందరు నేతలు పోటీ పడుతున్నారు.

ఉప ముఖ్యమంత్రిగా మాజీ మంత్రి కేహెచ్ మునియప్పను నియమించాలని కోరుతూ దళిత వర్గ నేతలు శనివారం కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద నిరసన చేపట్టారు. మడార మహాసభ, పలు దళిత సంఘాల నేతలు పోస్టర్లు ప్రదర్శిస్తూ మునియప్పకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరారు. రాష్ట్రానికి చేరుకుంటున్న ఏఐసీసీ కర్ణాటక ఇన్‌చార్జ్‌ రణదీప్ సింగ్ సుర్జేవాలాకు వినతిపత్రం అందించేందుకు నిరసనకారులు అక్కడికి వెళ్లారు.

విమానాశ్రయంలోని టెర్మినల్ 1 వద్ద ఈ నిరసన కొన్ని గంటల పాటు కొనసాగింది. మడిగ వర్గానికి ఇప్పటివరకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు వంటి కీలక పదవులు దక్కలేదని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సారి ఉప ముఖ్యమంత్రి పదవి ద్వారా తమ వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం తప్పదని హెచ్చరించారు. తమ వర్గాన్ని పట్టించుకోకపోతే పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాలా నగరంలోని షాంగ్రి లా హోటల్‌కు చేరుకున్నారు. 

కర్ణాటక కాంగ్రెస్ శాసనసభ పక్షం (సీఎల్‌పీ) సమావేశంపై మునియప్ప మాట్లాడుతూ.. "కొంతమంది ప్రతిపాదిస్తున్నారు, మరికొందరు బలపరుస్తున్నారు. ఇదే విధానం. దీని కంటే ఎక్కువగా ఇప్పుడేమీ చెప్పలేం. అయితే ఈ ప్రక్రియ ఈ సాయంత్రానికే పూర్తవుతుంది" అని తెలిపారు.

కాంగ్రెస్ నాయకత్వంపై ఒత్తిడి లింగాయత్ వర్గం నుంచి కూడా వచ్చింది. సీనియర్ నేత ఈశ్వర్ ఖండ్రేకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని గురు బసవ పట్టదేవరు, ఆయన అనుచరులు డిమాండ్ చేశారు.

గురు బసవ మీడియాతో మాట్లాడుతూ.. "ఈశ్వర్ ఖండ్రేకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే వచ్చే శాసనసభ ఎన్నికల్లో లింగాయత్ వర్గం కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెబుతుంది" అని అన్నారు. కాగా, కర్ణాటకలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement