ధాన్యంపై టీఆర్‌ఎస్, బీజేపీ డ్రామా

Congress Party Manickam Tagore Criticized TRS And BJP Party Over Paddy Procurement - Sakshi

కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌      

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశంపై టీఆర్‌ఎస్, బీజేపీలు కలసి డ్రామా ఆడుతున్నాయని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ విమర్శించారు. రాష్ట్రంలో ధాన్యం సేకరించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ ఢిల్లీలో దీక్ష పేరుతో రాజకీయ డ్రామా చేయాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు.

రైతులు పండించిన ధాన్యాన్ని కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది, కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. శనివారం ఏఐసీసీ కార్యాలయంలో మాణిక్యం ఠాగూర్‌ మీడియాతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుపై ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లు రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడం, డ్రామాలు చేయడంలో కేసీఆర్‌ మహాదిట్ట అని దుయ్యబట్టారు.

పబ్లిసిటీ స్టంట్లకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే రాష్ట్ర ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు కోసం రూ.10 వేల కోట్లు ఎందుకు ఖర్చు చేయడంలేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రైతులకు అండగా నిలబడుతుందని, ఈ అంశంపై మద్దతు ఇచ్చేందుకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణలో పర్యటించనున్నట్లు వెల్లడించారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top