జడ్చర్ల: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం జడ్చర్లలో ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి మాట్లాడే నైతిక హక్కు, అర్హత పవన్ కల్యాణ్‌కు లేదని, ఆయనపై విమర్శలు చేయడం తగదన్నారు. నాగేశ్వర్ రాజకీయ, సామాజిక విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ అని.. ఆయన గోటికి కూడా పవన్ సరిపోరని పేర్కొన్నారు.
పవన్ ఒక ప్యాకేజీ స్టార్.. చంద్రబాబు ప్యాకేజీ ఇచ్చారు కాబట్టి ఆయనతో ఉన్నారని, అదేవిధంగా అమిత్‌షా దగ్గరకు వెళ్లి ప్యాకేజీ మాట్లాడుకున్నారేమో అన్నారు. పవర్ కోసం ఆయన ఏ పార్టీతోనా పొత్తు పెట్టుకుంటారని ఎద్దేవా చేశారు. నాగేశ్వర్‌ను అరెస్ట్ చేయడానికి వస్తే తానే ఆయన ఇంటి ఎదుట నిలబడతానని, మొదట తనను అరెస్ట్ చేసిన తరువాతే ప్రొఫెసర్‌ను అరెస్టు చేయాల్సి ఉంటుందన్నారు. ఏపీ రాజధాని అమరావతికి అంత బడ్జెట్ ఎందుకుని ప్రశ్నించారు. ఏపీ పాలకులంతా హైదరాబాద్‌లోనే ఉన్నారని, వారికి ఇక్కడే రాజధాని కోసం 5 వేల ఎకరాల భూమి కేటాయిస్తామని.. వారు ఇక్కడి నుంచే పాలన సాగించుకోవచ్చని సూచించారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సిట్ తమకు నోటీసులు పంపిందని, తనతో పాటు మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సోమవారం విచారణకు హాజరవుతామని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, తన ఫోన్‌తో పాటు తన కుటుంబసభ్యుల ఫోన్లను, తన అనుచరుల ఫోన్లను ట్యాప్ చేయించారని ఆరోపించారు. విచారణ అనంతరం సీఎలీ్పలో జరిగే మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్ బాగోతాలను ఎండగడుతామన్నారు.


