ఓ పొలిటికల్ డిజైన్ ఉంది.. ఆ నెలలో చెబుతా: జగ్గారెడ్డి | Congress Leader Jagga Reddy Comments On Rahul Gandhi | Sakshi
Sakshi News home page

ఓ పొలిటికల్ డిజైన్ ఉంది.. ఆ నెలలో చెబుతా: జగ్గారెడ్డి

Jul 29 2026 7:34 PM | Updated on Jul 29 2026 7:40 PM

Congress Leader Jagga Reddy Comments On Rahul Gandhi

సాక్షి, సంగారెడ్డి: ఆనాడు రాహుల్ గాంధీకి మాట ఇచ్చాను కాబట్టే.. ఈ ముడున్నరేళ్ల మా పార్టీ ప్రభుత్వ, రాజకీయ వ్యవహారాల గురించి మాట్లాడలేదని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ‘‘నేనేదైనా మాట్లాడాలనుకుంటే ఢిల్లీ ట్రైన్ ఎక్కి రాహుల్ గాంధీతో మాట్లాడిన తర్వాతే బయటికి వచ్చి మాట్లాడుతా. మనసులో ఒకటి పెట్టుకుని బయట మరొకటి మాట్లాడే వ్యక్తిని కాదు’’ అంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

‘‘మూడున్నరేళ్ల క్రితం మా పార్టీలో లోపాలు ఉంటే బయట మాట్లాడాను. కార్యకర్తల వ్యవహారం, పార్టీ అంశాలపై అంతర్గతంగా, బహిరంగంగాను చర్చించాను. ఈ మధ్య పీఏసీ మీటింగ్‌లో అంతర్గతంగా మాట్లాడే విషయాలు కూడా  బయటికి వస్తున్నాయని సమావేశానికి పోవడమే మానేశాను. పీఏసీ మీటింగ్‌కి వెళ్లి ఉంటే పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను ఏఐసీసీ ఇంచార్జ్‌, సీఎం దృష్టికి తీసుకెళ్లేవాణ్ని. మళ్ళీ నేను మాట్లాడిన అంశాలు బయటకి వచ్చేవి.. అందుకే పోలేదు. ఈ మూడున్నర ఏళ్లుగా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ, ప్రభుత్వ వ్యవహారాలను ఎక్కడ బహిరంగంగా, అంతర్గతంగా చర్చించలేదు’’ అని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.

‘‘ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ 40 మంది కాంగ్రెస్ నేతలను ఢిల్లీకి పిలిచారు. అందులో నాకు ఆహ్వానం అందింది. ఆ సమావేశంలో రాహుల్ గాంధీతో 15 నిమిషాలు మాట్లాడాను. నేను సంగారెడ్డి రాంనగర్‌లోని రాంమందిర్ నుంచి విద్యార్థి నేతగా నా రాజకీయ ప్రయాణం మొదలై.. నేడు ఢిల్లీలో మీ నివాసానికి వచ్చి మీ ముందు కూర్చునే వరకు సాగిందని చెప్పాను. మీ ముందు ఒక రోజు ఇలా కూర్చొని మాట్లాడాలని అనుకున్నా.. ఇప్పుడు మాట్లాడుతున్నా నేను అనుకున్నది సాధించాను అని చెప్పాను

..ఏ పార్టీ నుంచి ప్రధాన మంత్రి ఉన్నా అధికారంలో ఉన్నన్ని రోజులే గుర్తుపెట్టుకుంటారని చెప్పా. పదవులతో పని లేకుండా గుర్తు పెట్టుకునే వారిలో మీ కుటుంబమే ఉంటుందని చెప్పా. కానీ రాహుల్ గాంధీ కుటుంబాన్ని దేశ ప్రజలు చిరకాలం గుర్తి పెట్టుకుంటారని కూడా చెప్పాను. రాహుల్ గాంధీ నన్ను పక్కకి పిలిచి ఓ మాట చెబుతాను వింటావా అని అడిగారు. మీకు ఎవరిపై అయిన కోపం ఉంటే మీడియా ముందు మాట్లాడకండి. ఢిల్లీకి వచ్చి నాతో మాట్లాడండి అన్నారు. ఆనాడు రాహుల్ గాంధీకి మాట ఇచ్చాను కాబట్టే.. ఈ ముడున్నరేళ్ళ మా పార్టీ ప్రభుత్వ, రాజకీయ వ్యవహారాల గురించి మాట్లాడలేదు

..రాజకీయంగా నాకు మనసులో ఓ కోరిక ఉంది. నాకు ఓ పొలిటికల్ డిజైన్ ఉంది. అది నవంబర్‌లో చెబుతా. ఈ మూడు నెలల కాలంలో రాజకీయంగా నాకు ఓ క్లారిటీ వస్తుంది. నాకు ఫ్యామిలీ కంటే పబ్లిక్, పాలిటిక్సే ముఖ్యం. నేను 24 గంటల పాటు పబ్లిక్, పాలిటిక్స్ గురించే ఆలోచిస్తా’’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement