కాంగ్రెస్‌ పార్టీ బ్యాంక్‌ అకౌంట్లు ఫ్రీజ్‌.. పునరుద్ధరణ

Congress Claims Bank Accounts Frozen News Updates - Sakshi

సాక్షి, ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన బ్యాంకు అకౌంట్లు అన్ని ఫ్రీజ్‌ అయ్యాయి. పన్ను చెల్లించలేదన్న కారణంగానే అకౌంట్లను ఫ్రీజ్‌ చేశారని, ఇందులో రాజకీయ దురేద్దేశం కనిపిస్తోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. అయితే  కాంగ్రెస్‌ ఈ విషయాన్ని మీడియా దృష్టికి తెచ్చిన గంటలోపే.. ఆ పార్టీకి ఉపశమనం లభించింది. అకౌంట్లను పునరుద్ధరించినట్లు తెలుస్తోంది.  

కాంగ్రెస్‌ అకౌంట్లు ఫ్రీజ్‌ అయిన విషయాన్ని కాంగ్రెస్‌  నేత, పార్టీ కోశాధికారి అజయ్‌ మాకెన్‌ శుక్రవారం మీడియా ద్వారా తెలియజేశారు. ఈ చర్యను రాజకీయ కుట్రగా అభివర్ణించిన ఆయన.. న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని కలవరపరిచే అంశం ఇది. రూ.210 కోట్లు ట్యాక్స్‌ కట్టలేదని ఆదాయ పన్ను శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇది ముమ్మాటికీ రాజకీయ ప్రేరేపిత చర్య.. పార్టీ ఎన్నికల సంసిద్ధతను దెబ్బ తీసేందుకే’ అని మాకెన్‌ ఆరోపించారు. 2018-19  ఎన్నికల ఏడాదికి సంబంధించి 45 రోజులు ఆలస్యంగా పార్టీ తమ అకౌంట్లను సమర్పించిందని.. ఆ మాత్రం దానికే అకౌంట్లను స్తంభింపజేయడం ఏంటని? మాకెన్‌ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో అనుమానాలు కలుగుతున్నాయని అన్నారాయన. 

.. ఇది ఉద్దేశపూర్వక చర్య అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.  ప్రస్తుతం మా నాలుగు అకౌంట్లు ఒకే పాన్‌ నెంబర్‌ మీద లింక్‌ అయ్యి ఉన్నాయి.  అకౌంట్ల ఫ్రీజ్‌తో అన్నీ ఆగపోతాయి. సిబ్బందికి జీతాలు ఇవ్వలేం. కరెంట్‌ బిల్లులు కూడా చెల్లించలేని స్థితికి చేరాం. ఆఖరికి న్యాయ్‌ యాత్రపై కూడా ప్రభావం పడుతుందని చెప్పారాయన. 

.. దేశంలో ప్రజాస్వామ్యం ఉనికి లేకుండా చేస్తున్నారు. ఏక పాలన పార్టీ.. ప్రధాన ప్రతిపక్షం లొంగదీసుకునే యత్నం చేస్తోంది. కానీ, మేం తలొగ్గం. న్యాయవ్యవస్థ, మీడియా,  ప్రజల నుండి న్యాయం కోరుతున్నాం అని మాకెన్‌ చెప్పారు. ఈ చర్యపై న్యాయపరంగా పోరాడతామని అజయ్‌ మాకెన్‌ వెల్లడించారు. ఇప్పటికే ఢిల్లీలోని ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ను (ITAT) ఆశ్రయించామని తెలిపారు.   

మరోవైపు ఈ పరిణామంపై కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం స్పందించారు. ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బగా అభివర్ణించారాయన.  ఎక్స్‌ ఖాతాలో ఆయన.. ‘‘ ఎన్నికల కోసం బీజేపీ రాజ్యాంగేతర పద్ధతిలో సేకరించిన సొమ్మును ఖర్చు చేస్తోంది. కానీ, మేం ప్రజల నుంచి సేకరించుకున్న డబ్బును సీజ్‌ చేసింది. అందుకే బీజేపీ మళ్లీ నెగ్గితే భవిష్యత్తులో ఎన్నికలనేవే ఉండవని.. ప్రజాస్వామ్యం పోయి నియంతృత్వం వస్తుందని మేం చెబుతున్నాం. ఈ విషయంలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుని.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. ఈ విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లి నియంతృత్వ పాలన తీరును ఎండగడతాం’’ అని సందేశం ఉంచారు.

ఖాతాలు స్తంభించాయనే విషయం గురువారం తమ దృష్టికి వచ్చిందని పార్టీ న్యాయవాది వివేక్‌ తన్ఖా తెలిపారు.  కాంగ్రెస్‌ పార్టీ పేరు మీద జారీ చేసే చెక్‌లను అంగీకరించకూడదని బ్యాంకులకు ఐటీ విభాగం సూచనలు జారీ చేసిందనే విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అయితే అజయ్‌ మాకెన్‌ మీడియా సమావేశం నిర్వహించిన గంటలోపే.. ఆ ఖాతాలు పని చేయడం ప్రారంభించాయి.

whatsapp channel

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top