
న్యూఢిల్లీ: బీహార్ (Bihar Assembly Election) అసెంబ్లీ ఎన్నికలకు గాను కాంగ్రెస్ (Congress Party) శుక్రవారం 48 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్ రామ్ కుటుంబా స్థానం నుంచి... కాంగ్రెస్ శాసనసభా పక్షం నేత షకీల్ అహ్మద్ ఖాన్‌కు కద్వా నుంచి బరిలోకి దిగనున్నారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ చీఫ్ ప్రకాశ్ గరీబ్ దాస్‌కు బెచ్వాడా సీటు కేటాయించారు.
బగాహాలో జయేశ్ మంగళ్ సింగ్, నౌతన్‌లో అమిత్ గిరి, చన్‌పటియాలో అభిషేక్ రంజన్, బెట్టియాలో వాసి అహ్మద్, రక్జౌల్‌లో శ్యామ్ బిహారీ ప్రసాద్ పోటీ చేయనున్నారు. గోవింద్‌గన్ స్థానం నుంచి శశి భూషణ్ రాయ్ అలియాస్ గప్పు రాయ్, రిగా నుంచి అమిత్ కుమార్ సింగ్ పోటీకి దిగనున్నారు. కాగా, ఆర్‌జేడీ సహా మహా ఘఠ్‌బంధన్ పక్షాల మధ్య సీట్ల పంపకాలు ఓ కొలిక్కి రాకమునుపే కాంగ్రెస్ ఈ జాబితాను ప్రకటించడం గమనార్హం. ప్రస్తుతం ఈ కూటమి పక్షాల మధ్య సీట్ల పంపిణీ చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మొదటి దశ పోలింగ్ నామినేషన్ల దాఖలుకు ఈ నెల 17వ తేదీ ఆఖరు. రెండో దశ పోలింగ్‌కు నామినేషన్లకు ఈ నెల 20వ తేదీతో గడువు ముగియనుంది.
101 స్థానాలకూ అభ్యర్థుల్ని ప్రకటించిన జేడీయూ
మరోవైపు.. బీహార్‌లో అధికార ఎన్‌డీఏ (NDA) కూటమిలో కీలక భాగస్వామ్య పార్టీ జనతాదళ్(యునైటెడ్) తాము పోటీచేయబోయే మొత్తం 101 స్థానాల్లోనూ అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే 57 మందితో తొలిజాబితా విడుదలచేయగా గురువారం మిగతా 44 మంది అభ్యర్థులతో చివరి జాబితాను వెల్లడించింది. చాలా మంది అభ్యర్థులు వెనువెంటనే తమ నామినేషన్లు దాఖలుచేస్తూ బిజీగా కనిపించారు. మొత్తం 101లో ఓబీసీలకు 37, ఈబీసీలకు 22, అగ్రవర్ణాలకు 22 చోట్ల అవకాశం కల్పించింది. జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ తన రాష్ట్ర కేబినెట్ మంత్రుల్లో చాలా మందికి మళ్లీ టికెట్ ఇచ్చారు. విజయ్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్, జామా ఖాన్, షీలా మండల్, లేశీ సింగ్, సుమిత్ సింగ్, విభా దేవి, చేతన్ ఆనంద్, శ్వేతా గుప్తా ఈసారి బరిలో దిగనున్నారు.