ప్రజా జీవనంపై మోదీ అప్రకటిత నిషేధం | CM Revanth slams PM Modi for chanting saving mantra | Sakshi
Sakshi News home page

ప్రజా జీవనంపై మోదీ అప్రకటిత నిషేధం

May 12 2026 1:23 AM | Updated on May 12 2026 1:23 AM

CM Revanth slams PM Modi for chanting saving mantra

పొదుపు మంత్రం జపించిన ప్రధానిపై సీఎం రేవంత్‌ ధ్వజం

అసమర్థ పాలన, విదేశాంగ విధానంలో వైఫల్యాలు కప్పి పుచ్చుకునేందుకే 10 సూత్రాలు 

గాలి తిని, గాల్లో బతకమని చెప్పి వెళ్లారు.. కేంద్రానికి దశ దిశ లేదు..

అనుభవ రాహిత్యం, అహంకారంతో దేశాన్ని సంక్షోభంలోకి నెడుతున్నారు 

తమను వ్యతిరేకించే వారిని ఖతం చేయడమే బీజేపీ విధానం 

మావోయిస్టులు, ముస్లింలు, కమ్యూనిస్టులు ఈ దేశ పౌరులు కాదా? 

అధికారిక కార్యక్రమంలో ప్రధాని మాట్లాడిన దానికి రాజకీయాలతో సంబంధం లేదు 

మీడియాతో ముఖ్యమంత్రి సుదీర్ఘ చిట్‌చాట్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని మోదీ తన అసమర్థ పాలన, విదేశాంగ విధానంలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజల జీవనంపై అప్రకటిత నిషేధం ప్రకటించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ‘బంగారం కొనొద్దు.. వెకేషన్‌కు వెళ్లొద్దు.. నూనె తినడం తగ్గించాలంటూ ప్రధాని ప్రజలకు పిలుపునివ్వడం బాధ్యతా రాహిత్యం. మోదీ ప్రభుత్వ వైఫల్యం, అసమర్థ విధానాలే ఇందుకు కారణం. విదే శాంగ విధానంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి, వారి సూచనలు సలహాలు తీసు కోకుండా ఏకపక్ష నిర్ణయాలు సరికాదు. దేశంలో సంక్షోభం తలెత్తే అంశాలపై రాహుల్‌గాంధీ ఆరు నెలల నుంచే చెబుతున్నా అంతా సవ్యంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. కేంద్రానికి ఓ స్పష్టమైన విధానం లేదు. దశ, దిశ లేదు. అనుభవ రాహిత్యం, అహంకారంతో దేశాన్ని సంక్షోభంలోకి నెడుతున్నారు. గాలి తిని, గాల్లో బతకమని చెప్పి మోదీ వెళ్లిపోయారు. పశ్చిమాసియా యుద్ధంలో మనమేమీ ప్రత్యక్షంగా పాల్గొనడం లేదు..’ అంటూ సీఎం విమర్శించారు. సోమవారం తన నివాసంలో ఆయన మీడియాతో సుదీర్ఘంగా చిట్‌చాట్‌ చేశారు.  

మావోయిస్టులను చంపడమే బీజేపీ ఎజెండా 
‘బీజేపీ విధానాలను వ్యతిరేకించే వారిని ఖతం చేయడమే ఆ పార్టీ విధానం. ముస్లింలు, మావోయిస్టులు, కమ్యూనిస్టులు ఈ దేశ పౌరులు కారా? వారికి తమ సిద్ధాంతాలను చెప్పుకునే స్వేచ్ఛ లేదా? మావోయిస్టులను చంపడమే బీజేపీ ప్రభుత్వం ఎజెండాగా పెట్టుకుంది. మేము ప్రాణాలు తీయడానికి వ్యతిరేకం. మా సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన వాళ్లను కూడా ఒప్పించి జనజీవన స్రవంతిలోకి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తాం. మనుషుల ప్రాణాలకు మా ప్రభుత్వం విలువ ఇస్తుంది. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన పార్టీ మాది. మనషులను చంపడం పరిష్కారం కాదు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు అత్యధికంగా తెలంగాణలోనే లొంగిపోయారు. 818 మంది మావోయిస్టులు రాష్ట్రంలో సరెండర్‌ అయ్యారు. వందలాది ఆధునాతన ఆయుధాలను అప్పగించారు. అందుకోసం మేం ప్రత్యేక చొరవ తీసుకున్నాం. 

మేం బుల్లెట్‌ కాదు బ్యాలెట్‌ అన్నాం.. 
లొంగిపోయిన వారికి రక్షణ, వైద్యం, ఆర్థికపరమైన సాయం ప్రభుత్వం అందిస్తుంది. మావోయిస్టుల విధానాలనే కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తోంది. భూ పంపణీ, ఉపాధి హామీ పథకాల అమలుతో వారి ఉద్యమాలు తగ్గాయి. గణపతి కూడా జనజీవన స్రవంతిలో కలవాలి. ప్రధానమంత్రి రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను అభినందించకపోగా విమర్శించడం దురదృష్టకరం. బుల్లెట్‌ కాదు బ్యాలెట్‌ అని మేం అన్నాం. చివరకు మావోయిస్టులు మా లైన్‌కు వచ్చారు. ముస్లింలను వేరే చేసి చూపించడం మంచిది కాదు. కలిసి ఉండాలని ప్రధాని మాట్లాడాలి కానీ విడగొట్టాలని మాట్లాడం దురదృష్టకరం. బీజేపీ బ్రిటిష్‌ జనతా పార్టీ.. విభజించు, పాలించు అన్నదే వాళ్ల సిద్ధాంతం..’ అని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు.  

నేను అడిగిన అంశాలకు మోదీ అంగీకరించారు.. 
‘ఆదివారం అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా నేను అడిగిన అంశాలకు ప్రధాని అంగీకరించారు. అందులో ఎలాంటి రాజకీయాలు లేవు. మన్మోహన్‌సింగ్‌ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్‌కు సాయం చేసిన విధంగానే తెలంగాణకు కూడా మీరు సహకరించాలని కోరా. అందుకు ప్రధాని స్పందిస్తూ.. ‘నీవొక్కడివే చేస్తే అనుకున్న లక్ష్యాలను (3 ట్రిలియన్‌ ఎకానమీ) సాధించలేవు. నీ కలలు నిజం అవ్వాలంటే మాతో కలిసి వస్తే.. అది సాధ్యం అవుతుంది’ అనే విధంగా అన్నారు. అయితే ఆయన మాటలను ఎవరికి తోచిన విధంగా వారు అర్థం చేసుకుంటున్నారు. నేను బీజేపీని ఓడించే ముఖ్యమంత్రి అయ్యా. నన్ను కాదు..రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తానని మోదీ అన్నారు.  

ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదు.. 
రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ సమన్వయంపై మేం చర్చించాం.. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాల్సిందే..అది హక్కు. వాటిని సాధించుకుంటాం. కేంద్రంతో సత్సంబంధాలు లేకుండా నిధులు అడగకుండా ఉంటే రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుంది? కానీ కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించడం లేదు. కొన్ని అంశాల్లో సహకరిస్తున్నా.. మంత్రులను కలిసి ఎన్నిసార్లు అడిగినా అనుమతులు రావడం లేదు.  రాష్ట్రాల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు ప్రధాని కార్యాలయంలో సింగిల్‌విండో ఏర్పాటు చేయాలి..’ అని రేవంత్‌ విజ్ఞప్తి చేశారు.   

కేంద్రం విధానంపైనే అభ్యంతరాలు 
‘చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గాల పునర్విభజన, జమిలి ఎన్నికలకు ఎలాంటి అడ్డంకి లేదు. నియోజకవర్గాల పెంపునకు సంబంధించి కేంద్రం అనుసరించే విధానంపైనే ప్రతిపక్ష పార్టీలన్నింటికీ అభ్యంతరాలు ఉన్నాయి. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు, నియోజకవర్గాల పెంపునకు ముడిపెట్టడంతోనే బిల్లు వీగిపోయింది. 50 శాతం సీట్ల పెంపునకు ఎలాంటి ఫార్ములా లేదు. 2029లో జమిలి ఎన్నికలు, మహిళా రిజర్వేషన్లు అమలు కావొచ్చు. అయితే బీజేపీ ఎన్నికల విధానం అంతా జెమినీ సర్కస్‌లా ఉంటుంది. తెలంగాణలో అధికారంలోకి వస్తామని ప్రధాని అన్నారు. వారిష్టం.. అనందపడనివ్వండి. రెండు సీట్లతో ప్రస్థానం ప్రారంభించిన బీజేపీ భవిష్యత్తులో మళ్లీ ఆదే రెండు సీట్లకు పరిమితం అవుతుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా మాకు ఒక రాష్ట్రం వస్తే.. వారికి ఒక రాష్ట్రం అదనంగా వచ్చింది అంతే. కేరళలో 3 సీట్లు ,తమిళనాడులో 2 సీట్లు మాత్రమే బీజేపీ గెలుచుకుంది..’ అని సీఎం వ్యాఖ్యానించారు. 

పాఠశాలల్లో యాంటీ డ్రగ్‌ ప్రమాణం 
‘రాష్ట్రంలో పాఠశాలల ప్రారంభోత్సవం రోజున పిల్లలతో యాంటీ డ్రగ్‌ ప్రమాణం చేయించనున్నాం. అందుకోసం రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాను ఆహ్వానిస్తున్నాం. నిపుణులు, విద్యావంతులతో పూర్తిస్థాయిలో చర్చించిన తర్వాతే పాఠశాల విద్యాశాఖలో ఇంటర్‌ విలీనంపై ఒక నిర్ణయం తీసుకుంటాం. తుమ్మిడిహెట్టిపైన ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశాం. ఇంకా స్పందన రాలేదు. రెండు రాష్ట్రాల మధ్య సమస్య వచ్చినప్పుడు ప్రధానమంత్రి పెద్దరికం వహిస్తే బావుంటుంది. 

ధాన్యం సేకరణలో సమస్యలు 
ధాన్యం సేకరణలో కొన్ని సమస్యలు వస్తున్నాయి. ధాన్యం దిగుబడి విపరీతంగా వచ్చింది. ప్రకృతి కారణంగా కూడా సమస్యలు ఉన్నాయి. అన్నింటినీ పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం.   

గత ఎక్సెస్‌ టెండర్లపై సీబీఐ విచారణకు సిద్ధమా? 
హామ్‌ రోడ్ల టెండర్లలో అన్నీ ఎక్సెస్‌ అని హరీశ్‌రావు వ్యాఖ్యానిస్తున్నారు. 26 శాతం లెస్‌కు వచ్చిన విధంగానే అందరికీ ఇవ్వాలని అంటే.. గతంలో వారు ఎక్సెస్‌కు ఇచ్చిన టెండర్లన్నింటిపై సీబీఐ విచారణకు సిద్ధమా? నాకు ఎవరిపైనా కక్ష లేదు. తప్పు చేసిన వారిని న్యాయస్థానాలు శిక్షిస్తాయి..’ అని సీఎం వ్యాఖ్యానించారు. మీ విషయంలో అలా జరగలేదు కదా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. అడవికి రాజునని, వేటాడి చంపే మృగం బలం ఉన్నప్పుడు అలా వ్యవహరించినా.. శక్తి లేనప్పుడు పొదల మాటున, రాళ్ల మాటున దాగి మరణిస్తుందని అంటూ ఇది ఎవరినీ ఉద్దేశించి తాను వ్యాఖ్యానించడం లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement