సాక్షి, హైదరాబాద్: ప్రజలు సంక్షేమానికి పట్టం కట్టారని.. ఈ గెలుపు రెండేళ కాంగ్రెస్ పాలనకు రెఫరెండం అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపుపై ఆయన స్పందిస్తూ.. జూబ్లీహిల్స్‌లో విజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు మా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.
‘‘ఈ గెలుపు నా బాధ్యతను మరింతగా పెంచింది. హైదరాబాద్ ప్రజలు మాకు అండగా నిలిచారు. బాధ్యతతో ముందుకు వెళ్ళమని మమల్ని ప్రజలు ఆశీర్వదించారు. గెలుపులో భాగమైన అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు. గెలుపులో అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు. ఎన్నికల్లో నెగ్గితే ఉప్పొంగిపోవడం, ఓడిపోతే కుంగిపోవడం మాకు తెలియదు. ప్రతిపక్షంలో ఉంటే ప్రజల కోసం పోరాటంలో భాగం అవుతాం. అధికారంలో ఉంటే ప్రజల సమస్యలను పరిష్కరిస్తాం. దశాబ్ద కాలంగా ప్రజల మధ్య కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధిస్తోంది.
..పాలైన ఓట్లలో 51 శాతం కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. ప్రజాబలం కాంగ్రెస్ పార్టీకి చెందింది. 2 సంవత్సరాలు ప్రజలు గమనించి మాకు ఈ తీర్పు ఇచ్చారు. 60 నుండి 65 శాతం ఆదాయం జంట నగరాల నుండే వస్తోంది. రాష్ట్ర అభివృద్ధికి కిషన్ రెడ్డి సహాయనిరాకరణ చేస్తున్నారు. కిషన్ రెడ్డికి వచ్చిన ఓట్లలో 25 శాతం మాత్రమే ఇప్పుడు వచ్చాయి. ఇది భూకంపం వచ్చే ముందు వచ్చే చిన్న ప్రకంపన లాంటిది. ఇప్పుడు అలర్ట్ కాకపోతే కిషన్ రెడ్డి భూ స్థాపితం అవుతారు. ఇప్పటికైనా కిషన్ రెడ్డి తన పద్దతి మార్చుకోవాలి. ఎవరి పాత్ర ఏంటో, ఎవరి బాధ్యత ఏంటో ప్రజలు స్పష్టంగా చెప్పారు
..హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం. నగరంలో చెత్త ప్రధాన సమస్యగా మారింది. చెరువులు, నాలాలు, కుంటాల కబ్జాలపై దృష్టి పెట్టాం. అసహ్యకరమైన భాషతో అబద్ధాలను బీఆర్ఎస్ ప్రచారం చేసింది. గంజాయి, డ్రగ్స్ లను రూపుమాపడానికి ఈగల్ ఫోర్స్ తీసుకువచ్చాం. కబ్జాలను అడ్డుకోవడానికి హైడ్రా తీసుకువచ్చాం. నగర అభివృద్ధికి బీఆర్ఎస్ సహకరించకపోగా, అడ్డుపడుతోంది. మేం ఎన్నికలప్పుడే రాజకీయ విమర్శలు చేస్తాం. కిషన్ రెడ్డి సచివాలయానికి రండి. కేంద్రంలో పెండింగ్ ఉన్న రాష్ట్ర అంశాలను చర్చిద్దాం’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించి నివేదిక సిద్ధం చేయాలని భట్టి విక్రమార్కకి రేవంత్‌రెడ్డి సూచించారు.
..కేటీఆర్ తన అహంకారాన్ని తగ్గించుకోవాలి. హరీష్ తన అసూయను తగ్గించుకోవాలి. కేసీఆర్ కాలికి బలపం కట్టుకొని తిరిగినా మాకు 65 సీట్లు ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో మా ఓటు శాతం పెరిగింది. మేం పార్లమెంట్ ఎన్నికల్లో రెండవ లిట్మస్ టెస్ట్ లో పాస్ అయ్యాం. బీఆర్ఎస్, బీజేపీ కలిసినా మా ఓటు శాతాన్ని చేరుకోలేకపోయారు. హరీష్ చూపులకు శక్తి ఉంటే ఎదుటివాళ్ళు కాలిపోయే ప్రమాదముంది. అధికారం పోయినా కేటీఆర్ కి అహంకారం పోలేదు. చివరి సంవత్సరంలో రాజకీయం చేద్దాం
..రెండు సంవత్సరాలు ప్రజల కోసం పనిచేయడానికి సహకరించండి. ఫేక్ న్యూస్ నువ్వే రాయించి, నువ్వే చదివి నిజమనుకుంటే ఎలా?. ఫేక్ సర్వేల వెనుక ఎవరున్నారో నాకు తెలుసు. పక్క రాష్ట్రాల లాగా మీడియాపై దురుసుగా ప్రవర్తించకూడదు అని అనుకుంటున్నాం. మీడియా విశ్వసనీయత పోగొట్టుకోకండి’’ అంటూ రేవంత్‌రెడ్డి హితవు పలికారు.


