ఐదేళ్లలో కోటి మంది మహిళా కోటీశ్వరులు | CM Revanth Reddy Launches The Mahalakshmi Swashakti Scheme for Women | Sakshi
Sakshi News home page

ఐదేళ్లలో కోటి మంది మహిళా కోటీశ్వరులు

Mar 13 2024 5:48 AM | Updated on Mar 13 2024 10:03 AM

CM Revanth Reddy Launches The Mahalakshmi Swashakti Scheme for Women - Sakshi

మహిళా సంఘాలకు చెక్‌ అందజేస్తున్న సీఎం రేవంత్‌. చిత్రంలో స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం, సురేఖ, పొంగులేటి, ఉత్తమ్, దామోదర, తుమ్మల.  సభకు హాజరైన మహిళలు

తాను బాధ్యత తీసుకుంటున్నానన్న సీఎం రేవంత్‌

వడ్డీలేని రుణాల పథకాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు వెల్లడి

మహాలక్ష్మి స్వశక్తి మహిళా సదస్సులో ప్రసంగం

సాక్షి, హైదరాబాద్‌: ఐదేళ్లలో రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే బాధ్యత తాను తీసుకుంటున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రా ష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల్లో (ఎస్‌హెచ్‌ జీలు) ప్రస్తుతం ఉన్న 63 లక్షల మంది మహిళలను కోటికి పెంచడమే కాకుండా ప్రతి ఒక్కరిని కోటీశ్వ రులను చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. గతంలో దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మహిళల ను లక్షాధికారుల్ని చేసే లక్ష్యంతో పావలా వడ్డీ రుణాలను ప్రారంభించారని, ఇప్పుడు ప్రతి మహిళ ను కోటీశ్వరురాలిని చేసే లక్ష్యంతో గత ప్రభుత్వ హయాంలో నిలిచి పోయిన వడ్డీలేని రుణాల పథకాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తే తెలంగాణ బంగారు తెలంగాణ, ధనిక తెలంగాణ, అభివృద్ధి చెందిన తెలంగాణ అవుతుందని, మహిళలు తమ పిల్లలను డాక్టర్లు, ఐఏఎస్‌లను చేసుకోగలరని అన్నారు. సికింద్రాబాద్‌ పెరేడ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ‘మహాలక్ష్మి స్వశక్తి మహిళా సదస్సు’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే అధికారంలోకి..
‘పదేళ్ల పాలనలో కేసీఆర్‌ తెలంగాణలో ఆడబిడ్డల ను పట్టించుకోలేదు. పావలా వడ్డీ, సున్నా వడ్డీ ఇవ్వలేదు. అందుకే మా ఆడబిడ్డలు కంకణం కట్టుకుని ఎన్నికల్లో కేసీఆర్‌ను బండకేసి కొట్టారు. వంద మీటర్ల గొయ్యి తీసి పాతిపెట్టారు. ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. నేను సీఎం అయ్యా. అధికారంలోకి వచ్చిన వెంటనే గతేడాది సెప్టెంబర్‌ 17న సోనియాగాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు ప్రారంభించాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తే, ఇప్పటివరకు 23 కోట్ల మంది వినియోగించుకున్నారు.

కానీ కేసీఆర్, హరీశ్, కవిత, కేటీఆర్‌ కిరాయి ఇచ్చి ఆటో డ్రైవర్లతో ధర్నాలు చేయిస్తున్నారు. ఎవరు అడ్డు వచ్చినా సరే.. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కొనసాగిస్తాం. ఆనాడు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రారంభించిన రాజీవ్‌ ఆరోగ్యశ్రీని కేసీఆర్‌ ఎటుగాకుండా చేశారు. మహిళలను కట్టెల పొయ్యి కష్టాల నుంచి గట్టెక్కించేందుకు గతంలో దీపం పథకం ద్వారా సోనియాగాంధీ రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తే, ప్రధాని నరేంద్ర మోదీ,  కేసీఆర్‌ కలిసి దానిని రూ.1200కు పెంచి మళ్లీ కట్టెల పొయ్యికి మళ్లే పరిస్థితి కల్పించారు. అందుకే ఇప్పుడు రూ.500లకే మహిళలకు గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తున్నాం. గృహాలక్ష్మి పథకం ద్వారా పేదల ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నాం..’ అని రేవంత్‌ తెలిపారు.

టాటా, బిర్లాలతో పోటీ పడేలా చేస్తాం
‘ఎస్‌హెచ్‌జీల మహిళలు తయారు చేసే ఉత్పత్తుల కు మార్కెటింగ్‌ సౌకర్యం లేదనే విషయం నా దృష్టికి వచ్చింది. రాబోయే నెల రోజుల్లో శిల్పారామం పక్కన ఎస్‌హెచ్‌జీల మహిళలకు వంద స్టాళ్లు ఏర్పా టు చేస్తాం. మీరు తయారు చేసిన ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తాం. ఔటర్‌ రింగ్‌రోడ్డు చుట్టూ కూడా మహిళా ఉత్పత్తుల విక్రయానికి బజార్లు ఏర్పాటు చేస్తాం. టాటా, బిర్లాలు, అదానీ, అంబానీలతో పోటీ పడే విధంగా మహిళలు రాణించేలా కృషి చేస్తాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. 

డబుల్‌ బెడ్‌రూం ఆశ చూపి మోసం చేశారు
‘ఇందిరమ్మ ఇళ్లు ఎన్నికలు అయిపోయిన తరువాత ఇద్దామనుకున్నాం. కానీ మహిళల కోసం భద్రాద్రి రామచంద్ర స్వామి ఆశీస్సులతో ఈ పథకాన్ని ప్రారంభించుకున్నాం. కేసీఆర్‌ డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల ఆశ చూపి మహిళలను మోసం చేసిండు. మేం మొత్తం రూ.22,500 కోట్లతో ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించబోతున్నాం..’ అని రేవంత్‌ తెలిపారు. 

మోదీ, కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారు
‘మా ప్రభుత్వాన్ని పడగొడతామంటూ కొందరు చిందులు వేస్తున్నారు. కేసీఆర్, మోదీలు కుట్రలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కుర్చీలో దొరలే కూర్చో వాలా? రైతు బిడ్డ కూర్చోకూడదా? నేనేం పాపం చేశా? మీ అవినీతి సొమ్ములో షేర్‌ అడిగానా? నేనే మన్నా అయ్య పేరు చెప్పుకొని, విరాసత్‌ రాయించుకొని ముఖ్యమంత్రి అయ్యానా? ఎవరి కుర్చీనైనా గుంజుకున్నానా? రేవంత్‌ను, ప్రభుత్వాన్ని పడగొడ తామని ఎవరైనా వస్తే..  మా ఆడబిడ్డలు చీపురు కట్టలు మర్లేసి కొడతారు. కొద్దిరోజుల్లో 10 లక్షల మంది ఆడబిడ్డలతో కవాతు చేస్తాం. మా సైన్యం మీరే.. మా బలగం మీరే..’ అని సీఎం అన్నారు.

అధికారం పోతుందని తెలిసినా సోనియా తెలంగాణ ఇచ్చారు
‘కాంగ్రెస్‌ పార్టీ అంటేనే ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ. మేము ఒక మహిళ నాయకత్వంలో పని చేయడానికి గర్విస్తున్నాం. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో, కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారం కోల్పోతుందని తెలిసినా 2004లో కరీంనగర్‌లో ఇచ్చిన మాట కోసం సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు..’ అని రేవంత్‌ చెప్పారు.  

స్టాళ్ల సందర్శన.. మహిళలతో సంభాషణ
సదస్సుకు ముందు ముఖ్యమంత్రి ఎస్‌హెచ్‌జీల మహిళలు ఏర్పాటు చేసిన వివిధ ఉత్పత్తులతో కూడిన స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు తమ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలని సీఎంను కోరారు. 

విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరణ
‘మహిళా శక్తి మహిళా ఉన్నతి – తెలంగాణ ప్రగతి’ విజన్‌ డాక్యుమెంట్‌ను మంత్రివర్గ సహచరులతో కలిసి సీఎం ఆవిష్కరించారు. వచ్చే ఐదేళ్లలో బ్యాంకులు, స్త్రీ నిధి ద్వారా ఎస్‌హెచ్‌జీలకు సంబంధించిన రూ.లక్ష కోట్ల రుణాలను అనుసంధానించడం, వడ్డీ లేని రుణాలు పునరుద్ధరించడం, సంఘాల ఉత్పత్తులకు బ్రాండింగ్, మార్కెటింగ్‌ కల్పించడం, సంఘాలకు శిక్షణ, సంఘాల్లోని మహిళలకు రూ. పది లక్షల జీవిత బీమా, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సంఘాలతో నిర్వహణ లాంటి అంశాలు విజన్‌ డాక్యుమెంట్‌లో ఉన్నాయి. ఈ సదస్సు కు సీఎస్‌ శాంతికుమారి అధ్యక్షత వహించగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీత క్క, సురేఖ, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు ప్రసంగించారు. స్పీకర్‌ ప్రసాద్‌కుమార్, మంత్రులు జూప ల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, ఉత్తమ్‌కు మార్‌ రెడ్డి, రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement