
కోస్గి సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి మహబూబ్‌నగర్: ‘‘రాష్ట్ర నలుమూలలా ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకా మన యుద్ధం అయిపోలేదు. ఇది విరామం మాత్రమే. కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని కార్యకర్తలు విశ్రాంతి తీసుకుందామనుకోవద్దు. 17 ఎంపీ సీట్లలో 14 సీట్లు గెలిచినప్పుడే పార్లమెంట్‌లో పట్టుసాధిస్తాం. అప్పుడే రాష్ట్రంలో కాంగ్రెస్ యుద్ధం గెలిచినట్లు. అప్పుడే తెలంగాణ కాంగ్రెస్‌కు గొప్పదనం. కొడంగల్‌కు గౌరవం దక్కుతాయి..’’అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
బుధవారం ఆయన కొడంగల్ నియోజకవర్గ పరిధిలో రూ.4,369.14 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు కోస్గి పట్టణం వేదికగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మహిళా సంఘాలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం కోస్గి పట్టణ శివార్లలోని కొడంగల్ రహదారిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ కలసి కుట్ర చేశాయి. బీఆర్‌ఎస్ గెలుపు కోసం బీజేపీ ఓడినా ఫర్వాలేదని చూశాయి. కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్‌ను గెలిపించడంతో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇప్పుడు ఒకరు పొత్తు అంటారు.. ఇంకొకరు చెప్పుతో కొడతా అంటారు. వాళ్ల మాటలు నమ్మొద్దు. వాళ్లు కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని కుట్రపన్నుతున్నారు.
కేసీఆర్ క్షమాపణ చెప్పాలి
గతంలో కరీంనగర్‌లో ఓడిపోతాననే కేసీఆర్ మహబూబ్‌నగర్ జిల్లాకు వలస వచ్చారు. పాలమూరు నుంచి ఎంపీగా గెలిపించినందుకే తెలంగాణ సాధించి సీఎం అయ్యే అవకాశం దక్కిందని కేసీఆర్ అన్నారు. మరి పదేళ్లు సీఎంగా ఉండి పాలమూరుకు ఏం చేశారు? పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు కాంట్రాక్టర్లకు కట్టబెట్టి కమీషన్లు తీసుకున్నారే తప్ప ఏం ఒరగబెట్టారు? ఇక్కడి ప్రజలకు క్షమాపణలు చెప్పాకే కేసీఆర్ పాలమూరులో ఓట్లు అడగాలి.
తెలంగాణను దోచుకున్నారు
చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు చిన్నారెడ్డి ప్రారంభించిన ఉద్యమంలో కేసీఆర్ దూరి తెలంగాణను దోచుకున్నారు. ఇప్పుడు ప్రజలు ఛీకొట్టి ఇంట్లో కూర్చోబెడితే.. అల్లుడు నల్లగొండ నుంచి, కొడుకు మహబూబ్‌నగర్ నుంచి పాదయాత్ర చేపడతారట. మళ్లీ పాలమూరు జిల్లాకు ఎందుకు వస్తారు? నెట్టెŠంపాడు, భీమా, కోయిల్‌సాగర్, దేవాదుల, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ, ప్రాణహిత పూర్తిచేయలేదేం?
బీఆర్‌ఎస్–బీజేపీలది చీకటి ఒప్పందం
బీజేపీ, బీఆర్‌ఎస్‌లది చీకటి ఒప్పందం. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో పాలమూరు గడ్డ వేదికగా ‘పాలమూరు–రంగారెడ్డి’ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని మోదీ చెప్పారు. ఇప్పుడు కిషన్‌రెడ్డి, డీకే అరుణ, జితేందర్‌రెడ్డిలను అడుగుతున్నా.. జాతీయ హోదా ఎందుకివ్వలేదు? వికారాబాద్–కృష్ణా రైల్వేలైన్‌ను కాంగ్రెస్ హయాంలో మంజూరు చేస్తే.. గత పదేళ్లలో తట్టెడు మట్టి తీయలేదు. కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి, మరో ముగ్గురు బీజేపీ ఎంపీలు ఉన్నారు కదా.. రాష్ట్రానికి నలుగురు కలిసి నాలుగు రూపాయలైనా తెచ్చారా?’’ అని రేవంత్ మండిపడ్డారు.
కొడంగల్ ప్రజలు ఆశీర్వదించడంతోనే తాను సీఎంగా నిలబడి మాట్లాడుతున్నానని చెప్పారు. సమావేశంలో చివరిలో ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్‌రెడ్డిని ఆశీర్వదించాలని.. కొడంగల్ నుంచి 50వేలకుపైగా మెజార్టీ అందించాలని రేవంత్ పిలుపునిచ్చారు. దీంతో పరీక్షంగా మహబూబ్‌నగర్ లోక్‌సభ అభ్యర్థి వంశీ పేరును ప్రకటించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఏపీ సీఎం నీళ్లు తీసుకెళ్తుంటే సహకరించారు..
నాడు ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర సీఎంలకు తెలంగాణ అంటే భయం ఉండేది. నిధులు, జల దోపిడీకి పాల్పడాలంటే.. తెలంగాణ నాయకులు ప్రశి్నస్తారనే భయం ఉండేది. కానీ తెలంగాణ సీఎంగా కేసీఆర్ బరితెగించారు. ఏపీ సీఎం పోతిరెడ్డిపాడు, రాయలసీమ లిప్టు, మల్యాల ద్వారా రోజుకు 12 టీఎంసీల నీటిని రాయలసీమకు తరలించుకుపోతుంటే సహకరించారు. పైగా ఏపీ సీఎంను ప్రగతిభవన్‌కు పిలిపించి పంచభక్ష్య పరమాన్నాలు తినిపించారు. 203 జీఓ ద్వారా రాయలసీమను రత్నాలసీమ చేస్తాననీ చెప్పారు. కానీ పార్లమెంట్‌కు పంపించిన పాలమూరు ప్రజల కోసం ఇక్కడి ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలి?
వారంలో మరో రెండు గ్యారంటీలు అమల్లోకి..
అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.10 లక్షలకు పెంపును అమల్లోకి తెచ్చాం. దేశంలో మోదీ, రాష్ట్రంలో కేడీ కలసి రూ.400 ఉన్న సిలిండర్‌ను రూ.1,200కు పెంచారు. మేం వారం రోజుల్లో రూ.500కే సిలిండర్ అందజేయనున్నాం. అలాగే 200 యూనిట్లలోపు వినియోగించే పేదలకు ఉచిత విద్యుత్‌ను అమల్లోకి తెస్తాం. పెండింగ్‌లో ఉన్న రైతుబంధు డబ్బులను వచ్చే నెల 15లోగా వేస్తాం. త్వరలోనే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం.
రెండేళ్లలో నారాయణపేట లిఫ్టు పూర్తి: ఉత్తమ్
బీఆర్‌ఎస్ సర్కారు నిర్లక్ష్యం వల్లే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎంతో గోస పడిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. 1.30 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేలా రూ.2,945 కోట్లతో నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టామని చెప్పారు. రెండేళ్లలోనే దీనిని పూర్తిచేస్తామన్నారు.
► పదేళ్ల కేసీఆర్ పాలనలో పాలమూరు, నల్లగొండ అత్యంత వివక్షకు గురయ్యాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు.
► కేసీఆర్ కుటుంబపాలనలో తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారిందని ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ఈ సభలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రి దామోదర రాజనర్సింహ, సీనియర్ నేత మల్లు రవి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, పరి్ణకారెడ్డి, వాకిటి శ్రీహరి, మనోహర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, శంకర్, కసిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డి తదితరులు పాల్గొన్నారు.