అంబేడ్కర్‌కు నివాళులరి్పస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో కవ్వంపల్లి సత్యనారాయణ, దానం నాగేందర్, మోత్కుపల్లి నర్సింహులు, అంజన్‌కుమార్ యాదవ్, అద్దంకి దయాకర్
లోక్‌సభ సీట్ల పెంపులో ఈ విధానాన్నే అనుసరించాలి
దామాషా ప్రకారం సీట్లు పెంచితే దక్షిణాదికి తీవ్ర అన్యాయం
దానివల్ల జనాభా విస్ఫోటనం ఉన్న ఉత్తరాది–మధ్యభారత రాష్ట్రాలకే లాభం
అందుకే 50% జనాభా లెక్కన, మరో 50% ఆర్థికాభివృద్ధి ప్రకారం సీట్లు పెంచాలి
ఈ అంశంపై చర్చలు, ఏకాభిప్రాయ సాధనకు అఖిలపక్ష భేటీ నిర్వహించాలి
ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ
నియోజకవర్గాల పునర్విభజన బిల్లును అడ్డుకోవాలని దక్షిణాది సీఎంలకూ లేఖలు
సాక్షి, హైదరాబాద్: ‘ప్రొరాటా (దామాషా) పద్ధతిలో లోక్‌సభ సీట్ల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుంచి 850కి పెంచితే జనాభా నియంత్రణను పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా తీవ్ర అన్యాయం జరుగుతుంది. కేంద్ర నిధుల కేటాయింపుల్లో ఇప్పటికే వివక్షకు గురవుతున్న దక్షిణాది రాష్ట్రాలకు ఇది మరో ఎదురుదెబ్బ అవుతుంది. దేశ ఆర్థిక వికాసానికి గణనీయంగా సహకారం అందించే దక్షిణాదికి ప్రాధాన్యం, ప్రాతినిధ్యం పార్లమెంటులో తగ్గిపోతుంది. జనాభా విస్ఫోటనం ఉన్న ఉత్తరాది–మధ్యభారత రాష్ట్రాలు లాభపడతాయి’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ప్రొరాటాకు బదులు హైబ్రిడ్ మోడల్‌లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.
అలాగే ఈ విషయంలో దక్షిణాదికి అన్యాయం జరగకుండా జాతీయ స్థాయిలో విస్తృత చర్చల కోసం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు, ఏకాభిప్రాయ సాధనతోనే ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుతోపాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లు–2026ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు. దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తుపై ప్రభావం కలిగించే అంశమైనందున బాధ్యతతో అత్యవసరంగా ఈ లేఖ రాసినట్లు పేర్కొన్నారు.
దక్షిణాది రాష్ట్రాలు బలహీనపడతాయి..
‘లోక్‌సభ స్థానాల పెంపుతో దక్షిణ రాష్ట్రాలపై పడే ప్రభావాన్ని కేంద్రం పూర్తిగా విశ్లేషించలేదు. తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, కేరళ దశాబ్దాలుగా జనాభా నియంత్రణ, ఆరోగ్యం, మానవ అభివృద్ధి రంగాల్లో కృషి చేశాయి. జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నాయి. ప్రొరాటా పద్ధతిలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలనే ప్రతిపాదనతో ఈ రాష్ట్రాలన్నీ నిర్మాణాత్మకంగా నష్టపోయి రాజకీయంగా బలహీనపడతాయి. ప్రొరాటా మోడల్ కేవలం గణాంకాల మార్పుగా కాకుండా రాజకీయ అసమతుల్యతకు దారితీస్తుంది.
ప్రొరాటా మోడల్‌ను దక్షిణాది రాష్ట్రాలు అంగీకరించవు. ఈ అంశంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉత్పన్నమవుతుంది. అందుకే అందరికీ న్యాయం జరిగేలా ఒక స్థిరమైన పరిష్కారం అవసరం. ఈ విషయంలో హైబ్రిడ్ మోడల్ ఒక ప్రత్యామ్నాయంగా ఉంటుంది. అందరి ప్రాతినిధ్యంతోపాటు అన్ని రాష్ట్రాల సహకారాన్ని ఈ మోడల్ సమతౌల్యం చేస్తుంది’ అని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సూచించిన 50 శాతం– 50 శాతం విధానాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు. హైబ్రిడ్ మోడల్ ప్రకారం కొత్తగా పెంచే సీట్లలో సగాన్ని ప్రొరాటా పద్ధతిలో... మిగతా సగం సీట్లను రాష్ట్రాల ఆర్థిక భాగస్వామ్యం (జీఎస్‌డీపీ), అభివృద్ధి ప్రమాణాల ఆధారంగా కేటాయించాలని సూచించారు.
ప్రస్తుత సీట్లలోనే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలి
మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఏఐసీసీ సంపూర్ణ మద్దతిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ సీట్లతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను యథాతథంగా వెంటనే అమలు చేయాలని ప్రధాని మోదీని సీఎం కోరారు. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి గతంలో సీట్ల సంఖ్య పెంచకుండా కేవలం నియోజకవర్గాల సరిహద్దులను మారుస్తూ డీలిమిటేషన్ నిర్వహించినట్లు గుర్తుచేశారు.
ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా అలాంటి ప్రక్రియను చేపట్టవచ్చని.. అందుకు పూర్తి మద్దతు ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. హైబ్రిడ్ మోడల్‌పై ద్వారా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు నష్టపోకుండా ఉండటంతోపాటు ప్రజాస్వామ్య ప్రాతినిధ్య సూత్రం అమలవుతుందన్నారు. ఈ అంశంపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపి అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీలతో కలిసి ఏకాభిప్రాయానికి రావాలని కోరారు. దేశ బలం భిన్నత్వంలో ఏకత్వమని.. ఇలాంటి కీలక నిర్ణయాలు ఆ ఐక్యతను చాటేలా ఉండాలని సూచించారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ అందరికీ న్యాయం చేసే పరిష్కారాన్ని కనుగొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దక్షిణాది రాష్ట్రాల సీఎంలకు రేవంత్ లేఖ
లోక్‌సభ సీట్లను ప్రొరాటా పద్ధతిలో పెంచే ప్రతిపాదనను దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్, ఏపీ సీఎం చంద్రబాబు, కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, పుదుచ్చేరి సీఎం ఎన్.రంగస్వామిలకు వేర్వేరుగా బహిరంగ లేఖలు రాశారు. లోక్‌సభ సీట్లను 850కి ప్రొరాటా పద్ధతిలో పెంచితే దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గిపోతుందని.. దేశాభివృద్ధిలో భాగం పంచుకుంటున్న రాష్ట్రాలు నష్టపోతూ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు లాభపడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే అన్ని రాష్ట్రాలకు న్యాయం జరిగేలా హైబ్రిడ్ మోడల్‌ను పరిశీలించాలని.. ఈ అంశంపై రాష్ట్రాలు ఐక్యంగా ముందుకు రావాలని రేవంత్ కోరారు.


