delemitation
-
ప్రొరాటా వద్దు.. హైబ్రిడే కావాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘ప్రొరాటా (దామాషా) పద్ధతిలో లోక్‌సభ సీట్ల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుంచి 850కి పెంచితే జనాభా నియంత్రణను పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా తీవ్ర అన్యాయం జరుగుతుంది. కేంద్ర నిధుల కేటాయింపుల్లో ఇప్పటికే వివక్షకు గురవుతున్న దక్షిణాది రాష్ట్రాలకు ఇది మరో ఎదురుదెబ్బ అవుతుంది. దేశ ఆర్థిక వికాసానికి గణనీయంగా సహకారం అందించే దక్షిణాదికి ప్రాధాన్యం, ప్రాతినిధ్యం పార్లమెంటులో తగ్గిపోతుంది. జనాభా విస్ఫోటనం ఉన్న ఉత్తరాది–మధ్యభారత రాష్ట్రాలు లాభపడతాయి’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ప్రొరాటాకు బదులు హైబ్రిడ్ మోడల్లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ విషయంలో దక్షిణాదికి అన్యాయం జరగకుండా జాతీయ స్థాయిలో విస్తృత చర్చల కోసం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు, ఏకాభిప్రాయ సాధనతోనే ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుతోపాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లు–2026ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు. దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తుపై ప్రభావం కలిగించే అంశమైనందున బాధ్యతతో అత్యవసరంగా ఈ లేఖ రాసినట్లు పేర్కొన్నారు.దక్షిణాది రాష్ట్రాలు బలహీనపడతాయి..‘లోక్‌సభ స్థానాల పెంపుతో దక్షిణ రాష్ట్రాలపై పడే ప్రభావాన్ని కేంద్రం పూర్తిగా విశ్లేషించలేదు. తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, కేరళ దశాబ్దాలుగా జనాభా నియంత్రణ, ఆరోగ్యం, మానవ అభివృద్ధి రంగాల్లో కృషి చేశాయి. జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నాయి. ప్రొరాటా పద్ధతిలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలనే ప్రతిపాదనతో ఈ రాష్ట్రాలన్నీ నిర్మాణాత్మకంగా నష్టపోయి రాజకీయంగా బలహీనపడతాయి. ప్రొరాటా మోడల్ కేవలం గణాంకాల మార్పుగా కాకుండా రాజకీయ అసమతుల్యతకు దారితీస్తుంది. ప్రొరాటా మోడల్‌ను దక్షిణాది రాష్ట్రాలు అంగీకరించవు. ఈ అంశంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉత్పన్నమవుతుంది. అందుకే అందరికీ న్యాయం జరిగేలా ఒక స్థిరమైన పరిష్కారం అవసరం. ఈ విషయంలో హైబ్రిడ్ మోడల్ ఒక ప్రత్యామ్నాయంగా ఉంటుంది. అందరి ప్రాతినిధ్యంతోపాటు అన్ని రాష్ట్రాల సహకారాన్ని ఈ మోడల్ సమతౌల్యం చేస్తుంది’ అని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సూచించిన 50 శాతం– 50 శాతం విధానాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు. హైబ్రిడ్ మోడల్ ప్రకారం కొత్తగా పెంచే సీట్లలో సగాన్ని ప్రొరాటా పద్ధతిలో... మిగతా సగం సీట్లను రాష్ట్రాల ఆర్థిక భాగస్వామ్యం (జీఎస్డీపీ), అభివృద్ధి ప్రమాణాల ఆధారంగా కేటాయించాలని సూచించారు.ప్రస్తుత సీట్లలోనే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలిమహిళా రిజర్వేషన్ బిల్లుకు ఏఐసీసీ సంపూర్ణ మద్దతిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ సీట్లతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను యథాతథంగా వెంటనే అమలు చేయాలని ప్రధాని మోదీని సీఎం కోరారు. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి గతంలో సీట్ల సంఖ్య పెంచకుండా కేవలం నియోజకవర్గాల సరిహద్దులను మారుస్తూ డీలిమిటేషన్ నిర్వహించినట్లు గుర్తుచేశారు. ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా అలాంటి ప్రక్రియను చేపట్టవచ్చని.. అందుకు పూర్తి మద్దతు ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. హైబ్రిడ్ మోడల్‌పై ద్వారా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు నష్టపోకుండా ఉండటంతోపాటు ప్రజాస్వామ్య ప్రాతినిధ్య సూత్రం అమలవుతుందన్నారు. ఈ అంశంపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపి అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీలతో కలిసి ఏకాభిప్రాయానికి రావాలని కోరారు. దేశ బలం భిన్నత్వంలో ఏకత్వమని.. ఇలాంటి కీలక నిర్ణయాలు ఆ ఐక్యతను చాటేలా ఉండాలని సూచించారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ అందరికీ న్యాయం చేసే పరిష్కారాన్ని కనుగొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.దక్షిణాది రాష్ట్రాల సీఎంలకు రేవంత్ లేఖలోక్సభ సీట్లను ప్రొరాటా పద్ధతిలో పెంచే ప్రతిపాదనను దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్, ఏపీ సీఎం చంద్రబాబు, కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, పుదుచ్చేరి సీఎం ఎన్.రంగస్వామిలకు వేర్వేరుగా బహిరంగ లేఖలు రాశారు. లోక్‌సభ సీట్లను 850కి ప్రొరాటా పద్ధతిలో పెంచితే దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గిపోతుందని.. దేశాభివృద్ధిలో భాగం పంచుకుంటున్న రాష్ట్రాలు నష్టపోతూ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు లాభపడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే అన్ని రాష్ట్రాలకు న్యాయం జరిగేలా హైబ్రిడ్ మోడల్‌ను పరిశీలించాలని.. ఈ అంశంపై రాష్ట్రాలు ఐక్యంగా ముందుకు రావాలని రేవంత్ కోరారు. -
డీలిమిటేషన్ కొలిక్కి
-
డీలిమిటేషన్ కొలిక్కి
జీహెచ్ఎంసీలో వార్డుల సంఖ్య యథాతథం * ముసాయిదా జాబితా విడుదల * జనాభా ప్రాతిపదికన డివిజన్లలో మార్పులు * అభ్యంతరాలు, సూచనలకు వారం గడువు * ఫిబ్రవరిలో గ్రేటర్ ఎన్నికలకు అవకాశం! సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీలో డీలిమిటేషన్ ప్రక్రియ ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ముసాయిదా జాబితా విడుదలైంది. ప్రస్తుతం ఉన్న 150 డివిజన్ల (వార్డుల) సంఖ్యలో ఎలాంటి మార్పు లేనప్పటికీ జనాభా ప్రాతిపదికన భౌగోళిక సరిహద్దుల ఆధారంగా కొత్త డివిజన్లను ఏర్పాటు చేస్తూ బుధవారం రాత్రి ముసాయిదాను జారీ చేశారు. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికలకు తెర లేచినట్లయింది. డీలిమిటేషన్ తర్వాత డివిజన్ల రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. అందుకు బీసీ జనగణన చేపట్టాల్సి ఉంది. అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మున్సిపల్ శాఖ మార్గదర్శకాలు, జనగణన డెరైక్టరేట్ ద్వారా అందిన జనాభా లెక్కల ప్రకారం డివిజన్ల విభజన చేపట్టినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. కొత్తగా వచ్చిన డివిజన్లలో సులేమాన్‌నగర్, శాస్త్రిపురం, ఈస్ట్ ఆనంద్‌బాగ్, వెంకటాపురం, నేరేడ్మెట్, వినాయకనగర్, వెంకటేశ్వరకాలనీ, మోండా మార్కెట్, లింగోజీగూడ, నాగోల్, బీఎన్‌రెడ్డి నగర్, రంగారెడ్డినగర్, సుభాష్‌నగర్, అల్లాపూర్, భారతినగర్, ఏఎస్‌రావునగర్, మీర్‌పేట, చిలుకానగర్ హస్తినాపురం, చైతన్యపురి, గోల్కొండ, ఆబిడ్స్, కొండాపూర్, మాదాపూర్, మియాపూర్, బాలానగర్, ఆల్విన్‌కాలనీ ఉన్నాయి. ఇక కనుమరుగైన వాటిలో శివరాంపల్లి, శ్రీనగర్‌కాలనీ, గన్‌ఫౌండ్రి, సుల్తాన్‌బజార్, పద్మారావునగర్, బల్కంపేట తదితర డివిజన్లు ఉన్నాయి. పూర్తి వివరాలను జీహెచ్ఎంసీ వెబ్సైట్www.ghmc. gov.in లో అందుబాటులో ఉంచినట్లు కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. ముసాయిదా జాబితాను జీహెచ్ఎంసీలోని అన్ని సర్కిల్ కార్యాలయాలు, జోనల్ కార్యాలయాల్లోని నోటీసు బోర్డులపై ప్రదర్శించనున్నట్లు వివరించారు. ఈ ప్రాథమిక నోటిఫికేషన్లో పేర్కొన్న 150 ఎన్నికల వార్డులకు సంబంధించి అభ్యంతరాలు, సూచనలను వారం రోజుల్లోగా తెలియజేయాలని సూచించారు. జనవరి రెండో వారం కల్లా ఓటర్ల జాబితా ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ, ఇతర కార్యక్రమాలు పూర్తి చేసేందుకు దాదాపు నెల రోజులు పట్టనుంది. నెల రోజుల్లో డీలిమిటేషన్ పూర్తయ్యాక వార్డులను బీసీ జనాభాను సర్వే చేయాల్సి ఉంది. ఎస్సీ, ఎస్టీ వివరాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. బీసీ గణన పూర్తయితే వార్డుల్ని ఆయా వర్గాల వారికి రిజర్వ్ చేస్తారు. ఈ సర్వే డిసెంబర్ మూడో వారంలోగా పూర్తి చేయవచ్చని అంచనా. ఓటర్ల జాబితా జనవరి రెండో వారంకల్లా పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఈ లెక్కన వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.


