పులివెందులను టచ్ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా?: జోగి రమేష్‌

Chandrababu Is Provoking TDP Activists Says Minister Jogi Ramesh - Sakshi

సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేతలు, కార్యకర్తలను యుద్ధం చేయాలంటూ  చంద్రబాబు రెచ్చగొడుతున్నారని ఏపీ గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్‌ మండిపడ్డారు. కుప్పం ప్రజల తిరుగుబాటుకు భయపడి పారిపోయిన వ్యక్తి చంద్రబాబు.. కార్యకర్తలను మాత్రం బలి చేయాలని చూస్తున్నాడని దుయ్యబట్టారు. సెప్టెంబర్‌ ఒకటో తేదీ అంటే అంతర్జాతీయ వెన్నుపోటు దినోత్సవంగా అందరూ గుర్తు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.

సెప్టెంబర్ రెండు అంటే తెలుగు ప్రజలంతా వైఎస్సార్‌ను గుర్తు చేసుకుంటారని మంత్రి జోగి రమేష్‌ తెలిపారు. రెండు లక్షల కోట్లు అవినీతికి పాల్పడినట్టు చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని.. వీటిపై చర్చకు రావాలని మంత్రి సవాల్‌ విసిరారు. ఎక్కడకు రావాలో చెప్తే అక్కడకే తామే వస్తామని స్పష్టం చేశారు. డీబీటి ద్వారా తాము లక్షా 70 వేల కోట్లు నేరుగా ప్రజలకు అందించామని పేర్కొన్నారు. అవినీతి కేసులు విచారణ జరగనీయకుండా స్టే తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు.. దమ్ముంటే వాటిపై విచారణ జరిపించుకోవాలన్నారు.

‘‘ఎన్ని జాకీలు పెట్టి లేపినా చంద్రబాబు, ఆయన కుమారుడు ఇక లేవలేరు. ఎల్లో మీడియా విష ప్రచారాన్ని జనం నమ్మే పరిస్థితి లేదు. సొంత పార్టీ నేతలే చంద్రబాబుని నమ్మటం లేదు. అందుకే గొడవలు చేయమని కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. పరిశ్రమలు రాకుండా అడ్డుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. పులివెందులని టచ్ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా? కుప్పంలోనే కుదేలైన ఆయన ఇక పులివెందులలో ఏం చేస్తాడు? వందేళ్ల దేశ అభివృద్ధిని ప్రధాని మోదీ అడిగినట్లు రామోజీరావు, రాధాకృష్ణ రాస్తున్నారు. మోదీ చంకలో కూర్చుని వారిద్దరూ విని రాస్తున్నారా? చంద్రబాబు పెద్ద మేధావి అని మోదీ అడిగారా? చెప్పుకోవటానికైనా సిగ్గుండాలి’ అని మంత్రి జోగి రమేష్‌ ధ్వజమెత్తారు.
చదవండి: దాష్టీకం.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను కారుతో ఢీకొట్టిన టీడీపీ నేతలు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top