సిద్దూ వర్సెస్ అమరీందర్, రాజీనామా బాటలో సీఎం?

Cant Continue With Such Humiliation Punjab CM Amarinder Singh Offers To Resign - Sakshi

పంజాబ్‌లో  మరింత  ముదురుతున్న  వివాదం

ఇక కొనసాగలేనంటూ సోనియాకు లేఖ రాసిన అమరీందర్ సింగ్ 

సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్ వివాదం మరింత ముదిరినట్టు కనిపిస్తోంది. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌ నవజోత్‌ సింగ్ సిద్ధూతో విభేదాలు, తాజా పరిణామాల నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు తాను అధికారంలో కొనసాగలేనంటూ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసినట్టు సమాచారం. సోనియా మాట ప్రకారం, ఇన్నాళ్లూ అన్ని రాజకీయ మార్పులను అంగీకరించానని, కానీ ఇకపై పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు.  ఈ  అవమానాలు చాలని , ఇలా జరగడం ఇది మూడోసారని సింగ్‌ ఆవేదన వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.  

పీసీసీ చీఫ్‌ నవజ్యోత్ సిద్ధూ శనివారం సాయంత్రం సీఎల్‌పీ సమావేశానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా నాయకత్వ మార్పుపై ఎమ్మెల్యేల సమావేశంలో చర్చించనున్నారని తీవ్ర ఊహాగానాలు చెలరేగాయి. గత కొన్ని నెలలుగా కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై ఒక వర్గం ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు. కొత్త నాయకత్వాన్ని డిమాండ్ చేశారు. దీనికి తోడు పలు సర్వేల అనంతరం 2022, ఫిబ్రవరిలో జరగనున్న రాష్ట్ర ఎన్నికలకు ముందు పంజాబ్‌లో సీఎంను  మార్చాలని హైకమాండ్ ఇప్పటికే నిర్ణయించిందని అంచనా.

మరోవైపు సునీల్ జాఖర్, పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ ప్రతాప్ సింగ్ బజ్వా, బియాంత్ సింగ్ మనవడు ఎంపీ రవనీత్ సింగ్ బిట్టూలలో ఒకర్ని కొత్త సీఎంగా నియమించ నున్నారనే అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. కాగా పంజాబ్ పీసీసీ పగ్గాలను ఎమ్మెల్యే సిద్దూకు అప్పగించే విషయమై పార్టీలో దుమారం రేగింది. ఆయనకు అధ్యక్ష బాధ్యతలను అప్పజెప్పేందుకు అమరీందర్ ససేమిరా అన్నారు. అయినా సిద్దూనే పీసీసీ అధ్యక్షుడు అంటూ కాంగ్రెస్‌ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top