కేబినెట్‌ మీటింగ్‌లోనైనా కళ్లు తెరవండి | BRS Working President KTR Letter To CM Revanth Over Procurement Crisis, More Details Inside | Sakshi
Sakshi News home page

కేబినెట్‌ మీటింగ్‌లోనైనా కళ్లు తెరవండి

May 22 2026 5:18 AM | Updated on May 22 2026 10:35 AM

BRS Working President KTR letter to CM Revanth

పంట కొనుగోలు సంక్షోభంపై సీఎం మొద్దునిద్ర

రోడ్డెక్కని రైతు లేడు.. రాస్తారోకో జరగని రహదారి లేదు 

సీఎం రేవంత్‌కు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో అరాచకత్వం పరాకాష్టకు చేరిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటను కొనే దిక్కులేక రెండు నెలలుగా రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఆర్తనాదాలు చేస్తున్నా సర్కారుకు చీమ కుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. ఈ నెల 23న జరిగే కేబినెట్‌ మీటింగ్‌లోనైనా పంట కొనుగోళ్లలో నెలకొన్న సంక్షోభంపై ముఖ్యమంత్రి మొద్దునిద్ర వీడి పరిష్కారం చూపాలన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌ రెడ్డికి కేటీఆర్‌ శుక్రవారం లేఖ రాశారు. ‘ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్‌ ప్రభుత్వ చేతకానితనంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు ప్రతీ రోజూ ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. పంట అమ్ముకుందామనే కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి పడిగాపులు పడుతున్న రైతులు గుండె పగిలి కుప్ప కూలుతున్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో దైర్యంతో బతికిన అన్నదాత కాంగ్రెస్‌ పాలనలో ఆత్మ విశ్వాసం కోల్పోయి రోడ్డున పడ్డాడు. రైతులకు రక్షణగా కేసీఆర్‌ అమలు చేసిన పథకాలను రేవంత్‌ ఒక్కొక్కటిగా పాతరేసి రైతుల వెన్ను విరించారు. రైతుభరోసా ఎగవేసినా, యూరియా కష్టాలు అధిగమించి రైతులు పండించిన పంటలను కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు’అని కేటీఆర్‌ మండిపడ్డారు. 

పంటలు తగులబెట్టుకుంటున్నారు 
‘పంట కొనుగోలు చేసే నాథుడు లేక రైతులు తమ పంటలను తగుల పెట్టుకుంటున్నారు. రెండు నెలలుగా నిరసనలో పాల్గొనని రైతు లేడు, రాస్తారోరో జరగని రహదారి లేదు. పగలూరాత్రి ప్రజాసంపదను దోచుకోవడంపై తప్ప పరిపాలనపై సీఎంకు పట్టులేకపోవడం అన్నదాతకు శాపంగా మారింది. రోడ్లపై జరుగుతున్న నిరసనల నుంచి తప్పించుకునేందుకు మంత్రులు హెలికాప్టర్‌లో షికార్లు కొడుతున్నారు. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లోనూ రైతులు రోడెక్కి నిరసన తెలపడం రాష్ట్రంలో నెలకొన్న సాగు సంక్షోభానికి అద్దం పడుతోంది. కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత, క్వింటాల్‌కు పది కిలోల తరుగు, గన్నీ బ్యాగులకు రూ.50 డిపాజిట్‌ వంటి సమస్యలను తీర్చేవారే లేరు. పంట కొనుగోలు కూడా చేయడం చేతకాకపోతే రాష్ట్రంలోని 60 లక్షల మంది రైతులకు సీఎం క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాయాలి. కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాల నుంచి రైతుల పంటను కాపాడుకునేందుకు చివరకు టార్పాలిన్లు కూడా సమకూర్చలేని స్థితిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంది. రెండు నెలలుగా కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్న రైతులు కాంగ్రెస్‌కు మరణ శాసనం రాసేందుకు సిద్ధంగా ఉన్నారు’అని ఆ లేఖలో కేటీఆర్‌ హెచ్చరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement