తప్పుడు చార్జిషీటుతో అక్రమ కేసు | BRS Leader KTR: Illegal case with false chargesheet | Sakshi
Sakshi News home page

తప్పుడు చార్జిషీటుతో అక్రమ కేసు

Mar 25 2026 4:19 AM | Updated on Mar 25 2026 4:19 AM

BRS Leader KTR: Illegal case with false chargesheet

ఫార్ములా–ఈ రేస్‌ కేసు ముమ్మాటికీ లొట్టపీసు కేసే.. 

పునర్విభజన చట్టం ప్రకారం పునర్విభజన జరగాలి 

టీడీఆర్‌ కొనుగోలుతో రేవంత్‌ కుటుంబం భారీ స్కామ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్‌పై అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ తెస్తున్న ప్రైవేటు మెంబర్‌ బిల్లు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చార్జిషీటు పేరిట మళ్లీ తెరపైకి ఫార్ములా–ఈ తెచ్చారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించేందుకు ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి చేసిన తొలి సంతకానికి సంబంధించిన ఫైలు దొరకడం లేదనే విషయాన్ని బీఆర్‌ఎస్‌ బయటపెట్టడంతో సర్కారు ఇరకాటంలో పడిందన్నారు. 

గతంలో తాను చెప్పినట్టు ఫార్ములా–ఈ కేసు ముమ్మాటికీ లొట్టపీసు కేసు అని చెప్పారు. శాసనసభ లాబీల్లోని ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ చాంబర్‌లో మంగళవారం కేటీఆర్‌ మీడియాతో  ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘ఫార్ములా–ఈ అంశాన్ని గోరంతను కొండంతగా చూపే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తోంది. ఇక్కడి నుంచి పంపిన నిధులు రూ.45 కోట్లు అయితే రూ.600 కోట్లకు పైగా ఉన్నాయని తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోంది. తెలంగాణ నుంచి పంపిన రూ.45 కోట్లు ఫార్ములా–ఈ బ్యాంకు ఖాతాలో భద్రంగా ఉన్నాయి. 

ఆ నిధులను ప్రభుత్వం ఎందుకు వెనక్కి రప్పించడం లేదు. ఈ కేసులో అనుచిత లబ్ధి జరిగిందని చెబుతున్న వారి పేరు చార్జిషీటులో లేదు’అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ‘అందాల పోటీల వల్ల తెలంగాణకు పైసా ప్రయోజనం లేకపోగా తనను లైంగికంగా వేధించారని మిస్‌ యూకే చేసిన ఆరోపణలతో రాష్ట్రం అంతర్జాతీయంగా అప్రతిష్టపాలైంది. ఇంత దారుణం జరిగినా ఒక్క కాంగ్రెస్‌ నాయకుడిపైనా కేసు నమోదు కాలేదు. సీఎం సరదా కోసం రూ.100 కోట్లతో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ నిర్వహించి సింగరేణి సొమ్మును దుర్వినియోగం చేసినా కేసు నమోదు కాలేదు. ఫార్ములా–ఈ కేసు న్యాయస్థానాల్లో నిలబడదు. ప్రభుత్వం ఎన్ని విధాలుగా దృష్టి మళ్లించే ప్రయత్నాలు చేసినా ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్‌ను వదిలిపెట్టేది లేదు’అని కేటీఆర్‌ చెప్పారు.  

మూసీపై ప్రణాళిక లేకుండానే.. 
‘రాష్ట్ర ప్రభుత్వం వద్ద రూపాయి లేకున్నా ఏడీబీ అప్పు ఇస్తుందనే ఉద్దేశంతో డీపీఆర్‌ లేకుండానే మూసీ అభివృద్ధి ప్రణాళిక చేపడుతోంది. మూసీ ప్రాజెక్టుపై ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో కాకుండా మూసీ బాధితులతో చర్చించాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతోపాటు మేధా పాట్కర్‌ వంటి మేధావులు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు’అని కేటీఆర్‌ అన్నారు. 

పునర్విభజన చట్టం ప్రకారం డీలిమిటేషన్‌ 
‘2014 నాటి రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) జరిగితే స్వాగతిస్తాం. జనాభా ప్రాతిపదికన కాకుండా 1971 జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతమున్న నిష్పత్తిలో పునర్విభజన జరగాలి. పార్లమెంటులో దక్షిణ భారతదేశానికి 24శాతం ప్రాతినిథ్యం ఉంది. అదే నిష్పత్తిలో దక్షిణాదికి నష్టం జరగకుండా కేంద్రం చూడాలి. అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుదల ద్వారా ప్రభుత్వాలు ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం లభిస్తుంది. అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల సంఖ్యలో భారీ వ్యత్యాసం ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా, వాటి గొంతు కోయకుండా డీలిమిటేషన్‌ చేస్తే స్వాగతిస్తాం’అని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

టీడీఆర్‌ స్కామ్‌ 
‘‘ట్రాన్సఫరబుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌ (టీడీఆర్‌) పేరిట రేవంత్‌ రెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరులు భారీ కుంభకోణానికి పాల్పడుతున్నారు. రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు కచ్చితంగా టీడీఆర్‌లు కొనుగోలు చేసేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త నిబంధనలు తెచ్చింది. మా ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీఆర్‌ కుంభకోణంపై విచారణ జరిపిస్తాం. నిర్వాసితుల నుంచి అతి తక్కువ ధరకు టీడీఆర్‌ కొనుగోలు చేసి వాటిని అడ్డగోలు ధరలకు తిరిగి అమ్ముకుంటున్న రేవంత్‌ కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల పాత్రను బయటపెడతాం. రేవంత్‌ పాలనలో టీడీఆర్‌ అంటే ‘తిరుపతి రెడ్డి డెవలప్‌మెంట్‌ రైట్స్‌’గా మారిపోయాయి. త్వరలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి రేవంత్‌ కుటుంబం టీడీఆర్‌లను ఏటీఎంగా మార్చుకున్న తీరును బయటపెడతాం’అని కేటీఆర్‌ చెప్పారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement