జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ 13 వేల దొంగ ఓట్లు నమోదు చేయించింది
మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు నమోదు చేయించినట్లు తెలిసిందని, ప్రజలు ఎలాగూ ఓటు వేయరని తెలిసి, దొంగ ఓట్లతో గెలవాలని చూస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. ఈ నియోజకవర్గంలో 13 వేల దొంగ ఓట్లు సృష్టించారని, ప్రజలు అప్రమత్తంగా లేకపోతే కాంగ్రెస్‌కు చెందిన వారు ఎవరో ఒకరు ఓటు వేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడికే మూడు ఓట్లు ఉన్న విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.
తెలంగాణ భవన్‌లో బుధవారం జరిగిన ‘మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం’లో కేటీఆర్ మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో మంత్రులు కొత్త వేషాలు వేసుకుని అభివృద్ధి చేస్తామని గల్లీ లీడర్లలా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలను అంగట్లో సరుకులా కొని ఉప ఎన్నికలో గెలిచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి స్వయంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఆయన గెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఓటర్లు ఆలోచించాలని అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే రూ.వెయ్యి కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క పని చేయలేదన్నారు. అభివృద్ధి నిధుల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ఒక్కరూ సంతోషంగా లేరు
‘కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించడంతో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదు. ఇందిరమ్మ రాజ్యం అంటూ.. పేదల కోసం ఒక్క ఇల్లు కట్టకున్నా హైడ్రా పేరిట బుల్డోజర్లతో పేదల ఇళ్లు కూల్చారు. యూసుఫ్‌గూడలో సన్మానం పేరిట ముఖ్యమంత్రే వెళ్లి సినీ కార్మికులతో శాలువాలు కప్పించుకున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరిట మోసగించారు.
బడ్జెట్‌లో ఏటా బీసీలకు రూ.20 వేల కోట్లు పెడతామని, ఆ దిశగా రేవంత్ ప్రయత్నం చేయలేదు’అని కేటీఆర్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, కోరుకంటి చందర్ తదితరులు పాల్గొన్నారు.


