వాళ్లు పెట్టారు.. వీళ్లు తీశారు | BRS Leader Harish Rao Fires On CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

వాళ్లు పెట్టారు.. వీళ్లు తీశారు

Apr 5 2026 4:49 AM | Updated on Apr 5 2026 4:49 AM

BRS Leader Harish Rao Fires On CM Revanth Reddy

గజ్వేల్‌లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ముట్టడి 

ఆగ్రహించిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు

రేవంత్‌ ఆదేశాలతోనే దాడి: హరీశ్‌రావు

గజ్వేల్‌/సాక్షి, హైదరాబాద్‌: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో మాజీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్‌ కార్యాలయాన్ని కాంగ్రెస్‌ నేతలు ముట్టడించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటో పెట్టడంపై వివా దం రేగింది. ఆగ్రహించిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టారు. దీంతో శనివారం పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ప్రధాన రహదారి గుండా కేసీఆర్‌ క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి లోపలికి ప్రవేశించారు. ఈ సందర్భంగా కార్యాలయం ప్రధాన ద్వారం అద్దాలు పగిలిపోయాయి. కాంగ్రెస్‌ శ్రేణులు వారి వెంట తెచ్చుకున్న రేవంత్‌రెడ్డి చిత్రపటాన్ని అక్కడ పెట్టి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

గజ్వేల్‌ సమస్యలను పట్టించుకోని కేసీఆర్‌కు ఒక్క నిమిషం కూడా పదవిలో కొనసాగే అర్హత లేదంటూ ఆంక్షారెడ్డి ధ్వజమెత్తారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని కాంగ్రెస్‌ శ్రేణులను అక్కడి నుంచి పంపించారు. సమాచారం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ గజ్వేల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అక్కడికి చేరుకొని కాంగ్రెస్‌ వైఖరిపై విరుచుకుపడ్డారు. అనంతరం బీఆర్‌ఎస్‌ శ్రేణులతో ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్‌ నేతలపై ఫిర్యాదు చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలు క్యాంపు కార్యాలయంలో రేవంత్‌రెడ్డి ఫొటోను తొలగించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ కార్యాలయం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  

అధికార మదంతోనే దాడి: హరీశ్‌రావు 
సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకే గజ్వేల్‌లోని కేసీఆర్‌ క్యాంప్‌ కార్యాలయంపై కాంగ్రెస్‌ గూండాలు దాడి చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మదంతో విర్రవీగుతూ ప్రజాస్వామ్యంపై దాడి చేస్తూ కాంగ్రెస్‌ నాయకులు బిహార్‌ గ్యాంగ్‌ను తలపిస్తున్నారన్నారు. ఓ వైపు విద్వేష ప్రసంగాల బిల్లు పేరిట ప్రజలు, ప్రతిపక్షాల నోర్లు మూయిస్తూ మరోవైపు గూండా రాజ్యం నడుపుతున్నారని మండిపడ్డారు. ‘సీఎం, మంత్రులు పొలిటికల్‌ టూర్లు చేస్తూ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కానీ తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కార్యాలయాలపై దాడులు చేస్తూ ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నారు. దాడులు ఆపకపోతే ప్రజలే వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుంది’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ దాడిని బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ ఖండించారు. 

Advertisement
 
Advertisement
Advertisement