నాకు 3 నెలలు ఇరిగేషన్‌ శాఖను అప్పగించు! | BRS Leader Harish Rao challenges CM Revanth | Sakshi
Sakshi News home page

నాకు 3 నెలలు ఇరిగేషన్‌ శాఖను అప్పగించు!

Jul 9 2026 5:35 AM | Updated on Jul 9 2026 5:35 AM

BRS Leader Harish Rao challenges CM Revanth

ఫ్యాను వద్దు.. ఫ్యూను వద్దు.. కారు, జీతం ఏదీ వద్దు 

కన్నెపల్లి నుంచి నీళ్లు తేకపోతే 

రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా 

తుమ్మిడిహెట్టి అనుమతులపై ఆధారాలు చూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా 

సీఎం రేవంత్‌కు మాజీ మంత్రి హరీశ్‌ రావు సవాలు

సాక్షి, హైదరాబాద్‌: ‘నీ సవాలుకు స్పందించడానికి కేసీఆర్‌ అవసరం లేదు.. నేను చాలు.. నాకు ఫ్యాను వద్దు, ఫ్యూను వద్దు, కారు, జీతం కూడా వద్దు. నాకు మూడు నెలలు ఇరిగేషన్‌ శాఖను అప్పగించి చూడు. మూడు నెలల్లో కన్నెపల్లి పంప్‌హౌస్‌ నుంచి నీళ్లు తెచ్చి పారించి చూపిస్తా. ఒకవేళ చేయలేకపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా. నా సవాలుకు సిద్దమేనా..?’అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు సీఎం రేవంత్‌ రెడ్డికి సవాలు విసిరారు. తెలంగాణ భవన్‌లో బుధవారం పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తూ రేవంత్, నీటి పారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన ఆరోపణలపై మండిపడ్డారు. అబద్ధాలకు నోబెల్‌ బహుమతి ఉంటే అది రేవంత్‌ రెడ్డికే వస్తుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వం గోదావరి జలాలను వృథాగా కిందికి వదిలేస్తోందని ఆరోపించారు. సమ్మక్క బ్యారేజి వద్ద లక్ష క్యూసెక్కుల వరద ప్రవహిస్తుంటే దేవాదుల ద్వారా కేవలం 2,542 క్యూసెక్కుల నీటినే ఎత్తిపోస్తున్నారన్నారు. 71 మీటర్ల నీటిమట్టం వద్దే మోటార్లు నడిచే అవకాశం ఉన్నా ప్రభుత్వం కావాలనే వాటిని ఆన్‌ చేయడం లేదని విమర్శించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 75 నుంచి 80 శాతం చెరువులు ఎండిపోయినా ప్రభుత్వం స్పందించకపోవడం రైతుల పట్ల ‘నేర పూరిత నిర్లక్ష్యం’కిందకు వస్తుందన్నారు. సమ్మక్క బరాజ్‌పై అసెంబ్లీలో చర్చ పెడితే తాను సిద్ధంగా ఉన్నట్లు హరీశ్‌ ప్రకటించారు. 

ఆధారాలు చూపకపోతే క్షమాపణ చెప్పాలి 
‘తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర అనుమతి ఇచ్చిందని రేవంత్‌ రెడ్డి చెబితే ఒక్క అధికారిక లేఖ చూపించినా వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. సీడబ్ల్యూసీ స్వయంగా అక్కడ 160 టీఎంసీల నీటి లభ్యత లేదని, కేవలం 102 టీఎంసీలే ఉన్నాయని స్పష్టం చేసింది. తుమ్మిడిహెట్టికి కాంగ్రెస్‌ పాలనలో రూ.6 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్తూ సర్వేలు, మొబిలైజేషన్‌ అడ్వాన్సుల పేరుతో రూ.2,328 కోట్లు మెక్కారు. 2014లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే మహారాష్ట్రతో అనేకసార్లు చర్చించినా 152 మీటర్ల ఎత్తున బరాజ్‌ నిర్మాణానికి అనుమతి రాలేదు. మూడేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రస్తుతం ఎన్నిసార్లు మహారాష్ట్రతో చర్చించిందో చెప్పాలి. ఆధారాలు చూపించలేకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం మేడిగడ్డ బ్యారేజికి పరిమితం చేసి చూపించడం రాజకీయ దురుద్దేశం మాత్రమే. ఈ ప్రాజెక్టు ద్వారా నీటి వినియోగాన్ని 160 టీఎంసీల నుంచి 240 టీఎంసీలకు, ఆయకట్టును 16 లక్షల ఎకరాల నుంచి 37 లక్షల ఎకరాలకు పెంచాం. నష్టపరిహారం పెరగడం, రిజర్వాయర్ల సామర్థ్యం పెరగడం వల్లే వ్యయం పెరిగిందని, దానిని అవినీతి అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదు. కాళేశ్వరం లేకపోతే మూసీ పునరుజ్జీవానికి నీళ్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు’అని రేవంత్‌ను హరీశ్‌రావు ప్రశ్నించారు. 

పోలవరం నుంచి మేడిగడ్డ వరకు రాజకీయ కుట్ర 
‘పోలవరం అథారిటీ సీఈఓగా ఉన్న సమయంలో పదిసార్లు డ్యామ్‌ కొట్టుకుపోయి రూ.7 వేల కోట్ల భారీ నష్టానికి కారణమైన వ్యక్తే ఎన్‌డీఎస్‌ఏ చైర్మన్‌గా మేడిగడ్డపై నివేదిక ఇచ్చాడు. పోలవరం పదేపదే దెబ్బతిన్నా అక్కడికి వెళ్లని ఎన్డీఎస్‌ఏ, ఎన్నికలకు ముందు మేడిగడ్డపై నివేదిక ఇవ్వడానికి రావడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల కుమ్మక్కునకు నిదర్శనం. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రెండు పిల్లర్లు మాత్రమే దెబ్బతిన్నాయి. కానీ కాంగ్రెస్‌ రెండున్నరేళ్ల పాలనలోనే సుంకిశాల గోడలు కూలడం, వట్టెం పంప్‌హౌస్‌ మునిగిపోవడం, పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోవడం, చెక్‌డ్యాంలను పేలి్చవేయడం వంటి ఘటనలు జరిగాయి. ప్రస్తుతం మేడిగడ్డ వద్ద 7.5 టీఎంసీల నీరు వృథాగా పోతున్నా కన్నెపల్లి మోటార్లు ఎందుకు ఆన్‌ చేయడం లేదో ప్రభుత్వం చెప్పాలి’అని హరీశ్‌రావు మండిపడ్డారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement