
సాక్షి, హైదరాబాద్: మూసీ పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ వేశారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. హైడ్రా పేరుతో బిల్డర్లను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారని కామెంట్స్ చేశారు. అలాగే, బీఆర్‌ఎస్ చేసిన పనులకు రేవంత్ రిబ్బన్ కట్ చేస్తున్నారని సెటైర్లు వేశారు.
నాగోల్ మూసీ పరివాహక ప్రాంతంలో కేటీఆర్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..‘హైదరాబాద్‌కు మూసీ నది ఓ వరం. కాంగ్రెస్ హయాంలోనే మూసీ మురికి కూపంగా మారింది. మూసీ బాధితుల తరఫున న్యాయపోరాటం చేస్తాం. మూసీ బాధితులకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుంది. మూసీని పునరుజ్జీవనం చేసేందుకు ఎన్టీపీ ప్లాంట్ నిర్మాణం చేశాం. ఎన్టీపీ లాంటి ప్లాంట్ దేశంలో ఎక్కడా లేదు. నాగోల్‌లో దేశంలోనే అతిపెద్ద మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించాం. ఇక్కడ శుద్ధి చేసిన నీళ్లు నల్లగొండ జిల్లాకు పోతున్నాయి. రేవంత్ రెడ్డి కొత్తగా చేసేదేమీ లేదు. ఈ ఎస్టీపీలను సక్రమంగా నడుపుకుంటే చాలు.
బీఆర్‌ఎస్ చేసిన పనులకు రేవంత్ రిబ్బన్ కట్ చేస్తున్నారు. హైదరాబాద్‌కు రేవంత్ కొత్తగా చేసిందేమీ లేదు. మూసీ గురించి నాకు తెలుసు. మూడు నెలలు కాదు.. మూడేళ్లు ఉంటాను. నేను గతంలో మూసీ నిబోలి అడ్డాలోనే ఉన్నా. ఢిల్లీ పెద్దలకు నువ్వు డబ్బులు పంపాలంటే చందాలు వేసుకుని ఇస్తాం. మూసీ ప్రజలను ఇబ్బంది పెట్టకండి అంటూ కామెంట్స్ చేశారు.