
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు కొత్త పార్టీపై ఎలాంటి ఆలోచన చేయలేదు. అలాగే, కాంగ్రెస్‌లో చేరాలనే ఆలోచనే లేదని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పెద్దలు ఎవరూ తనను సంప్రదించలేదన్నారు. ఇదే సమయంలో తనతో టచ్‌లో ఉన్న బీఆర్‌ఎస్ నేతల లిస్టు చాలా పెద్దది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జాగృతి ఆఫీసులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నాపై బీఆర్‌ఎస్ సోషల్ మీడియా దాడి చేస్తోంది. బీఆర్ఎస్‌లో అందరూ నన్ను ఇబ్బందులు పెట్టారని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. నా రాజీనామాను స్పీకర్ ఫార్మాట్‌లో ఇచ్చాను. స్పీకర్‌కు ఫోన్ చేసి కూడా ఆమోదించమని అడిగాను. అవసరమైతే మళ్ళీ రాజీనామా లేఖను పంపిస్తాను. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీలు వస్తే స్వాగతిస్తాను. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పార్టీలు పెట్టుకునే హక్కు ఉంది. నాకు కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన లేదు. తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన మొదటి కూతుర్ని నేనే.
కాళేశ్వరం విషయంలో తప్ప హరీష్ రావుపై వేరే కోపం లేదు. ఘోష్ కమిషన్ నివేదిక చూస్తే అన్నీ అర్థమవుతాయి. చాలా విషయాల్లో హరీష్ రావు తనకు సంబంధం లేదన్నారు. అంతా కేసీఆర్ నిర్ణయమే అన్ని హరీష్ చెప్పినట్టు నివేదికలో ఉంది. వివిధ శాఖల ఫైల్స్ నేరుగా కేసీఆర్‌కు వెళ్తున్నాయి.. ఇది చూసుకోవాలని 2016లోనే కేటీఆర్‌కు సూచించాను. రాజకీయాల్లో ఎవరూ స్పేస్ ఇవ్వరు.. తొక్కుకుంటూ వెళ్లాలి. నేను రాజీనామా చేసిన తర్వాత.. నాతో టచ్‌లో ఉన్న బీఆర్‌ఎస్ నేతల లిస్టు పెద్దదిగానే ఉంది. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తాయి.
మళ్లీ అధికారంలోకి వచ్చే అర్హత కాంగ్రెస్‌కు లేదు. నాకు కాంగ్రెస్‌లో చేరాలనే ఆలోచనే లేదు. కాంగ్రెస్ పెద్దలు ఎవరూ నన్ను సంప్రదించలేదు. అందరం కలిసి బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలి. బీసీ రిజర్వేషన్లను సాధించుకోవాలి. బీసీల కోసం కోట్లాడుతున్నాం.. ముందు రిజర్వేషన్లను సాధించుకుందాం. సుప్రీంకోర్టు స్టే ఉన్నప్పటికీ ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచేందుకు కర్ణాటక సిద్ధమైంది. ఆల్మట్టిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి. ప్రభుత్వం వెళ్లకుంటే జాగృతి తరఫున సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. మహారాష్ట్ర ఇప్పటికే స్పందించి కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించింది. ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణా నదిలో క్రికెట్ ఆడుకోవడం తప్ప ఏమీ ఉండదు’ అని ఘాటు విమర్శలు చేశారు.
