ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత: కేసీఆర్‌ | BRS chief KCR fires on CM Revanth Reddy Govt | Sakshi
Sakshi News home page

ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత: కేసీఆర్‌

May 13 2026 2:13 AM | Updated on May 13 2026 2:13 AM

BRS chief KCR fires on CM Revanth Reddy Govt

పాలన చేతకాక కాంగ్రెస్‌ క్రమంగా కనుమరుగవుతోంది

బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం ఖాయం 

పార్టీ ముఖ్యులతో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 

ఇంట్లో కూర్చోకుండా ప్రజలతో మమేకమై పనిచేయాలని పిలుపు  

డిజిటల్‌ పద్ధతిలో పార్టీ సభ్యత్వ నమోదుకు ఆదేశం 

జిల్లాల వారీగా ఇన్‌చార్జీల నియామకం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. రేవంత్‌రెడ్డి రెండున్నరేళ్ల పాలనపై జనంలో తీవ్ర అసంతృప్తి ఉందని చెప్పారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్‌ వైపు చూస్తున్నారని, పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో వంద శాతం తిరిగి బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని, పార్టీ నేతలు ఇంటికి పరిమితం కాకుండా నిరంతరం ప్రజాక్షేత్రంలో జనంతో మమేకమవ్వాలని పిలుపునిచ్చారు. మంగళవా రం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్‌ అధ్యక్ష తన పార్టీ కీలక సమావేశం జరిగింది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు, మాజీమంత్రి హరీశ్‌రావుతో పాటు శాసనసభ, శాసన మండలిలో బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్లు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. సుమారు 7 గంటల పాటు సాగిన సమావేశంలో కేసీఆర్‌ కేంద్ర, రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులను విశ్లేషించారు. పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణానికి సంబంధించి నేతలకు దిశా నిర్దేశం చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం భేటీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

నేతల పనితీరును గమనిస్తున్నాం     
‘క్షేత్ర స్థాయిలో బీఆర్‌ఎస్‌ పార్టీకి మంచి ఆదరణ లభిస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిల పనితీరును నిశితంగా గమనిస్తున్నాం. పనిచేయని వారిని పక్కన పెడతాం. ప్రజా సమస్యలపై స్పందిస్తూ కష్టపడి పనిచేసే వారికే భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయి. సీఎం రేవంత్‌ గుజరాత్‌ మోడల్‌ను పదే పదే వల్లె వేస్తున్నాడు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో గుజరాత్‌ మోడల్‌ను మించి ఫలితాలు సాధించాం. జాతీయ స్థాయిలో అనేక సూచీల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ప్రభుత్వానికి నిధుల సమీకరణ, వనరుల వినియోగం వంటి అంశాలపై ఏ మాత్రం అవగాహన లేదు. పాలన చేతకాక కాంగ్రెస్‌ క్రమంగా కనుమరుగవుతోంది..’ అని కేసీఆర్‌ చెప్పారు. 

ప్రతి నియోజకవర్గానికి సమన్వయకర్త 
రాజకీయ విమర్శల జోలికి వెళ్లకుండా పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం, కార్యకర్తలకు శిక్షణ వంటి అంశాలపైనే కేసీఆర్‌ ఎక్కువగా మాట్లాడినట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. ఆయా అంశాలపై నేతల అభిప్రాయాలు ఆయన అడిగి తెలుసుకున్నారు. డిజిటల్‌ పద్ధతిలోనే పార్టీ సభ్యత్వ నమోదు చేయాలని ఆదేశించారు. ‘ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా చేపట్టిన ‘సర్‌’ ప్రక్రియతో పాటు, ఓటర్‌ లిస్టు సవరణ తదితర కార్యాచరణ మొత్తం డిజిటల్‌ ప్రక్రియలో జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ సభ్యత్వం కూడా డిజిటల్‌ పద్ధతిలోనే జరపాలి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి, రాష్ట్ర కమిటీ నుండి సభ్యత్వ నమోదు సమన్వయకర్తను నియమించాలి. 

కార్యకర్తలకు శిక్షణ 
అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం సజావుగా నిర్వహిచేందుకు ‘సభ్యత్వ సమన్వయ కమిటీ’లను రెండుమూడు రోజుల్లో నియమించాలి. డిజిటల్‌ పద్ధతిలో సభ్యత్వ నమోదు చేస్తున్నందున రాష్ట్రంలో ఉన్న 35,655 పోలింగ్‌ బూత్‌లకు బూత్‌కు ఇద్దరు కార్యకర్తల చొప్పున మొత్తం 71,310 మంది పార్టీ కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించాలి. పార్టీ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో ఈ శిక్షణా శిబిరాలు కొనసాగుతాయి..’ అని కేసీఆర్‌ తెలిపారు. సభ్యత నమోదు కోసం ఇన్‌చార్జిలను ప్రకటించారు.  సమావేశంలో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలు పలువురు కూడా పాల్గొన్నారు. 


 

Advertisement
 
Advertisement
Advertisement