‘విమోచనం’తో బలపడేందుకు బీజేపీ వ్యూహాలు

BJP Strategies To Gain Strength With Telangana Liberation Day - Sakshi

తెలంగాణలో బీజేపీ ఆధ్వర్యంలో ఏడాదిపాటు ఉత్సవాలు  

టీఆర్‌ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్‌లకు చెక్‌ పెట్టేలా వ్యూహాలు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ విమోచన అమృతోత్సవాల ద్వారా రాష్ట్రంలో రాజకీయంగా బలపడేందుకు బీజేపీ వ్యూహాలను రూపొందించింది. వచ్చే ఏడాది సెపె్టంబర్‌ 17 దాకా నిర్వహించే కార్యక్రమాలను పార్టీ విస్తరణకు ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బీజేపీ చాలా ఏళ్లుగా డిమాండ్‌ చేస్తోంది. ప్రభుత్వాలపై వివిధ రూపాల్లో ఒత్తిడి తీసుకొచ్చింది. తమ ప్రయత్నాల వల్లే ఈ ఉత్సవాలకు ప్రాధాన్యం ఏర్పడిందన్న విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. జాతీయ సమైక్యతా దినోత్సవం పేరిట కార్యక్రమం నిర్వహించేందుకు టీఆర్‌ఎస్‌ సర్కార్‌ను దిగివచ్చేలా చేశామన్న సందేశాన్ని ప్రజల్లో చాటాలని నిర్ణయించింది.  

ఏకతాటిపైకి హిందువులు!  
రాజకీయంగా అధికార టీఆర్‌ఎస్, ఎంఐఎం, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాలకు చెక్‌ పెట్టడమే కాకుండా ఆ మూడు పార్టీలూ ఒక్కటేనన్న సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు బీజేపీ పెద్దలు కార్యాచరణ సిద్ధం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. హైదరాబాద్‌ విమోచన అంశంలో టీఆర్‌ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్‌ల వైఖరిని ప్రజల్లో ఎండగట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. జాతీయవాదంతోపాటు తెలంగాణ సెంటిమెంట్‌ రగిల్చేందుకు, జనంలో బీజేపీ పట్ల సానుకూలత పెంచేందుకు ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు టీఆర్‌ఎస్‌–ఎంఐఎం, గతంలో కాంగ్రెస్‌–ఎంఐఎం రాజకీయ దోస్తీని, అవకాశవాదాన్ని బట్టబయలు చేయాలని నిర్ణయానికొచ్చారు. విమోచనం విషయంలో ఆ మూడు పారీ్టల బాగోతాన్ని బయటపెట్టడంతోపాటు టీఆర్‌ఎస్‌కు బీజేపీయే అసలైన రాజకీయ ప్రత్యామ్నాయమన్న సందేశాన్ని ఇచ్చేలా కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. రాష్ట్రంలో మెజారిటీ వర్గంగా ఉన్న హిందువులను ఏకతాటిపైకి తీసుకురావడానికి విమోచన ఉత్సవాలు దోహదపడతాయని బీజేపీ నాయకత్వం విశ్వసిస్తోంది. ఏడాది పాటు నిర్వహించే కార్యక్రమాలు బీజేపీకి రాజకీయంగా తప్పనిసరిగా ఉపకరిస్తాయన్న నమ్మకంతో ఆ పార్టీ నేతలున్నారు.

ఇదీ చదవండి: అభివృద్ధికి నిధులివ్వవు, కోర్టుకెళ్తేనే నీళ్లిస్తావా? 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top