‘ఎన్నికల కేలండర్‌’ రెడీ

BJP To Release Charge Sheet Against CM KCR Govt Says K Laxman - Sakshi

జనవరి 20 నుంచి ఏప్రిల్‌ దాకా గ్రామస్థాయి నుంచి కార్యక్రమాల ఖరారు 

ప్రజాకోర్టులో కేసీఆర్‌ సర్కార్‌ను దోషిగా నిలబెడతాం.. 

ఏప్రిల్‌లో జరిగే బహిరంగసభలో కేసీఆర్‌ సర్కార్‌పై చార్జిషీట్‌ విడుదల: లక్ష్మణ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కేలండర్‌ను బీజేపీ సిద్ధం చేసింది. ‘కేసీఆర్‌ హటావో.. తెలంగాణ బచావో’నినాదంతో భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించినట్లు బీజేపీ పార్లమెంటరీబోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్‌ వెల్లడించారు. ప్రజాకోర్టులో కేసీఆర్‌ సర్కార్‌ను దోషిగా నిలబెడతామన్నారు. ఇందులో భాగంగా జనవరి 20 నుంచి ఫిబ్రవరి 5 వరకు గ్రామ స్థాయిలో పదివేల వీధి సభలు, ఫిబ్రవరి 15 నుంచి మార్చి 5 వరకు అసెంబ్లీ స్థాయిలో సభలు, ఫిబ్రవరిలోనే తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో తెలియ జేసేందుకు మేధావులతో సమావేశాలు.

ప్రజలను చైతన్య పరిచేందుకు మార్చిలో పది ఉమ్మడి జిల్లాల స్థాయిలో సభలు నిర్వహిస్తామన్నారు. శుక్రవారం పార్టీనేతలు ఎన్‌.రామచంద్రరావు, డా.ఎస్‌.మల్లారెడ్డి, ఎన్వీసుభాష్‌లతో కలసి లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఏప్రిల్‌లో నిర్వహించే బహిరంగ సభలో కేసీఆర్‌ సర్కార్‌పై కేంద్రమంత్రి అమిత్‌ షా లేదా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ద్వారా చార్జిషీట్‌ విడుదలచేస్తామని ప్రకటించారు.

రాష్ట్రంలోని 119 సీట్లలో సంస్థాగతంగా, రాజకీయంగా కార్యకర్తలను సమాయత్తం చేయడానికి నాలుగంచెల వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. వచ్చే పదినెలల కాలానికి రోడ్‌మ్యాప్‌లో భాగంగా ముందుగా మూడునెలల కార్యక్రమాలు ఖరారయ్యాయని చెప్పారు.   ‘మిషన్‌ 90’లో భాగంగా 90 అసెంబ్లీ సీట్లలో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు.

తాము ఉన్నది ఉన్నట్లు చెబుతామని, బీఆర్‌ఎస్‌ పార్టీ, నేతల మాదిరిగా కట్టుకథలు చెప్పమని లక్ష్మణ్‌ అన్నారు. కాగా, కేంద్రం ఇచ్చిన నిధుల దారిమళ్లింపుపై చిట్టా విప్పుతామని, వివిధ అంశాలపై బీఆర్‌ఎస్‌ నేతల నోళ్లు మూయిస్తామని చెప్పారు. కేంద్రం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై బుక్‌లెట్‌లు విడుదల చేస్తామని ఆయన తెలిపారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top