కొడుకుపై కేసు: ముగ్గురు పిల్లల జీవితాలను నాశనం చేయాలని సీఎం కుట్ర పన్నారు.. బండి సంజయ్‌ఫైర్‌

BJP Chief Bandi Sanjay Aggressive Comments On CM KCR - Sakshi

కేసీఆర్‌.... అసలు నువ్వు మనిషివేనా?

పిల్లలు కొట్టుకుంటారు.. కలుస్తారు

ముగ్గురు పిల్లల జీవితాలను నాశనం చేయాలని సీఎం కుట్ర పన్నారు

కొడుకు వీడియోపై స్పందించిన బండి

సాక్షి, న్యూఢిల్లీ: దమ్ముంటే తనతో రాజకీయం చేయాలి కానీ పిల్లల జీవితాలతో ఎలా ఆడుకుంటారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ప్రశ్నించారు. ‘కేసీఆర్‌... నీకు దమ్ముంటే, నువ్వు మొగోడివైతే నాతో రాజకీయం చెయ్‌... నాతో చేయడం చేతగాక, తట్టుకోలేక నా కొడుకును లాగుతావా?... నీ మనువడి విషయంలో తప్పుడు వ్యాఖ్యలు చేస్తే నేనే ఖండించిన.

చిన్న పిల్లలను రాజకీయాల్లోకి లాగొద్దనే సోయి కూడా లేదా? నా కొడుకు విషయంలో ఎప్పుడో జరిగిన దానిని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చి కేసు పెట్టిస్తవా? నేను తప్పు చేశానని ఆ అబ్బాయే (దెబ్బలు తిన్న విద్యార్థి) ఒప్పుకున్నడు. అయినా పిల్లలు పిల్లలు కొట్లాడుకుంటరు. మళ్లీ కలుస్తారు. మరి నీకేం నొచ్చింది? కేసు పెట్టియ్యాల్సిన అవ సరం ఏమొచ్చింది? కంప్లయింట్‌ ఎవరిచ్చారు? నీ రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతావా?

ఏదైనా చేస్తావా? నీ యాదాద్రి భాగోతాన్ని, నిజాం మనువడి అంత్యక్రియలపై ప్రజల దృష్టిని మళ్లించాలని ఇదంతా చేస్తావా?’  అంటూ బండి సంజయ్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ అమ్మాయి, నా కొడుకు, ఆ అబ్బాయి జీవితాలను నాశనం చేయాలని సీఎం కుట్ర చేస్తున్నారని విమర్శించారు. మంగళవారం రాత్రి ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌.మనోహర్‌ రెడ్డి, కోశాధికారి శాంతికుమార్‌ తదితరులతో కలిసి బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా తన కుమారుడిపై కేసీఆర్‌  ప్రభుత్వం కేసు నమోదు చేసిన విషయాన్ని మీడియా ప్రస్తావించగా బండి సంజయ్‌ తీవ్రంగా స్పందించారు. ‘నా కొడుకు చేసిన తప్పేమిటి? పిల్లలపై కేసు పెట్టిస్తారా? కేసీఆర్‌... నువ్వు మనిషివి కాదు... నీ పాపం పండింది. నా కొడుకును పోలీస్‌ స్టేషన్‌లో నేనే సరెండర్‌ చేస్తా... థర్డ్‌ డిగ్రీ ఉపయోగిస్తవా? లాఠీలతో కొట్టిస్తవా? చూద్దాం.’ అని బండి మండిపడ్డారు.

నయీం డైరీ ఆస్తుల కేసు ఎటు పోయింది?
యాదాద్రిపై కేసీఆర్‌ కుటుంబం పెట్టుబడి పెట్టి నట్లు, రోజుకు రూ.కోటి లాభం వస్తుందని చెప్ప డం.. ఆలయాలను, దేవుళ్లను కూడా వ్యాపారంగా మార్చడం  సిగ్గుచేటని బండి విమర్శించారు.  ‘ధార్మిక క్షేత్రాలను వ్యాపారం కోసం అభివృద్ధి చేస్తున్నట్లు నమ్మిస్తే... ఆ దేవుడు కూడా నిన్ను క్షమించబోరు. అసలు నయీం డైరీ ఆస్తుల కేసు ఎటు పోయింది? నయీం కబ్జా చేసుకున్న ఆస్తు లన్నీ నీ కుటుంబం కబ్జా చేసుకుంది.’  

అని ధ్వజ మెత్తారు.  ‘ఎక్కడో టర్కీలో చనిపోయిన నిజాం మనవడికి తెలంగాణకు ఏం సంబంధం? డెడ్‌ బాడీని ఇక్కడికి రప్పించి అత్యున్నత అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని ప్రభుత్వం ఎట్లా చెబుతుంది? తెలంగాణ ప్రజలను  రాచి రంపాన పెట్టి ఎంతో మందిని చంపిన నిజాంపై నీకెందుకు ప్రేమ..? నిజాం ఆస్తులపై నీ కన్ను పడింది. అందుకే వాళ్లను పొగుడుతున్నవ్‌. రజాకార్ల పార్టీ అయిన ఎంఐఎంతో కులుకు తున్నవ్‌’ అని సంజయ్‌ విమర్శించారు.

బండి కుమారుడిపై కేసు
కాగా, బండి సంజయ్‌ కుమారుడిపై దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం బహదూర్‌పల్లిలోని మహేంద్ర వర్సిటీలో బీటెక్‌ చదువుతున్న సంజయ్‌ కుమారుడు తోటి విద్యార్థిని అసభ్య పదజాలంతో తిట్టడమే కాకుండా, చంపేస్తానంటూ బెదిరిస్తూ తీవ్రంగా కొట్టాడు. వర్సిటీకి చెందిన స్టూడెంట్‌ అపెక్స్‌ కోఆర్డినేటర్‌ మంగళవారం దుండిగల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు సీఐ రమణారెడ్డి తెలిపారు. 

మరోవైపు సంజయ్‌ కుమారుడి చేతిలో దాడికి గురైన విద్యార్థి మంగళవారం రాత్రి 11 గంటలకు ఒక వీడియో విడుదల చేశాడు. బండి సంజయ్‌ కుమారుడి స్నేహితుడి చెల్లెల్ని తాను ఇబ్బంది పెట్టానని, ఆ కారణంతోనే తనపై చేయిచేసుకున్నాడని పేర్కొన్నాడు. ఇప్పుడు తామంతా కలిసిపోయామని చెప్పుకొచ్చాడు.

మరిన్ని వార్తలు :

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top