
హైదరాబాద్: ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతు చనిపోతే రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదంటూ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతుల ప్రాణాలంటే తెలంగాణ ప్రభుత్వానికి లెక్కలేదని విమర్శించారు. ఈ రోజు(గురువారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ‘40 కేజీల వరి ధాన్యం బస్తా నుంచి 4 కేజీల తరుగు తీస్తున్నారు. 13 లక్షల క్వింటాళ్ల ధాన్యం తరుగు రూపంలో పక్కదారి పడుతుంది. 6 వేల కోట్ల రూపాయల తరుగు రూపంలో రైతుల నుంచే కొట్టేస్తున్నారు.
ఇది ఎవరి ఖాతాల్లో చేరుతోంది. బ్లాక్ లిస్ట్ లో పెట్టిన రైస్ మిల్లు లు ఎన్ని ?, బ్లాక్ లిస్ట్ లో పెట్టిన రైస్ మిల్లులకు మళ్ళీ ఎందుకు ధాన్యం పంపుతున్నారు ? ,గతంలో ధాన్యం తీసుకుని సీఎంఆర్(CMR)ఇవ్వని రైస్ మిల్లులకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ?, ధాన్యం కొనుగోలులో జరుగుతున్న అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం CBI తో దర్యాప్తు చేయించాలి. బీఆర్‌ఎస్ పాలనలో సివిల్ సప్లై శాఖలో అవినీతి జరిగిందని ఆరోపించిన రేవంత్, ఉత్తమ్... ఎందుకోసం విచారణ చేయడం లేదు ?’ అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.