బిహార్‌ సీఎం పదవికి నితీశ్‌ కుమార్ రాజీనామా | Bihar new CM announcement Nitish Kumar submits resignation to Governor | Sakshi
Sakshi News home page

బిహార్‌ సీఎం పదవికి నితీశ్‌ కుమార్ రాజీనామా

Apr 14 2026 3:27 PM | Updated on Apr 15 2026 4:31 PM

 Bihar new CM announcement Nitish Kumar submits resignation to Governor

పట్నా: బిహార్‌ సీఎం పదవికి నితీశ్‌ కుమార్ మంగళవారం రాజీనామా చేశారు. బిహార్ గవర్నర్‌కు ఆయన రాజీనామా సమర్పించారు. క్యాబినెట్‌ను రద్దు చేస్తూ నితీశ్‌ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 21 ఏళ్ల పాటు సీఎం పదవిలో కొనసాగారు నితీశ్‌. ఇటీవలే ఆయన రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. 

అన్ని వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పని చేసిందని నితీశ్‌ కుమార్‌ రాజీనామా తర్వాత ఎక్స్‌లో తెలిపారు. “హిందువులు, ముస్లింలు, ఉన్నత వర్ణాలు, వెనుకబడిన వర్గాలు, అత్యంత వెనుకబడిన వర్గాలు, దళితులు, మహాదళితులు.. ఇలా ప్రతి ఒక్కరి కోసం మా ప్రభుత్వం పనిచేసింది. విద్య, ఆరోగ్యం, రహదారులు, విద్యుత్, వ్యవసాయం వంటి ప్రతి రంగంలో అభివృద్ధి పనులు జరిగాయి. మహిళలు, యువత కోసం ఎంతో చేశాం” అని నితీశ్ చెప్పారు. కాగా, నితీశ్‌ కుమార్ మంగళవారం క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. నితీశ్‌ కుమార్‌ క్యాబినెట్‌కు ఇదే చివరి సమావేశం. 

సీఎంగా సామ్రాట్‌ చౌదరి? 
బిహార్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్‌ చౌదరి బుధవారం (ఏప్రిల్ 15న) బాధ్యతలు చేపట్టే ఛాన్స్‌ ఉంది. నితీశ్‌ శాసన మండలి సభ్యత్వానికి గత నెల 30న రాజీనామా చేశారు. ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయం ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది. కేంద్ర మంత్రి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను బిహార్‌లో శాసనసభ పక్ష నాయకుడిని ఎన్నుకునేందుకు కేంద్ర పరిశీలకుడిగా నియమించినట్లు తెలిపింది.

జేడీయూ సీనియర్ నేత విజయ్ కుమార్ చౌదరి మాట్లాడుతూ.. “బీజేపీ సిఫారసుపై ఎన్డీఏ కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుంటుంది, ఇందులో బీజేపీకి పెద్ద పాత్ర ఉంది” అని అన్నారు. జేడీయూ వర్కింగ్ ప‍్రెసిడెంట్‌, రాజ్యసభ సభ్యుడు సంజయ్ కుమార్ ఝా ఇటీవల మాట్లాడుతూ.. నితీశ్‌ కుమార్ ముఖ్యమంత్రి పదవిలో లేకపోయినా, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన కృషి కొనసాగుతుందని తెలిపారు. గత బిహార్ ఎన్నికల్లో నితీశ్‌ కుమార్ నాయకత్వంలో, ఎన్డీఏ మద్దతుతో పార్టీ పోటీ చేసిందని తెలిపారు. కొత్త ప్రభుత్వం నితీశ్‌ విధానాలను, పాలనా మోడల్‌ను కొనసాగిస్తుందని అన్నారు.  

సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement