కేశినేని ట్రావెల్స్‌లో రెండు స్టీరింగ్‌లు..!

Article On Chandrababu Hand In Kesineni Brothers Bitter Political War - Sakshi

ఎంపీగా ఆయనేమో ఎవరినీ పట్టించుకోడు. ఎవరైనా ఏదైనా అంటే మాత్రం ఊరుకోడు. అందుకే పార్టీ నాయకత్వం చాపకింద నీరులా సొంత తమ్ముడినే ఆయన మీద ప్రయోగిస్తుందన్న టాక్ పార్టీలో నడుస్తోంది. ఇక ఎంపీగారి తమ్ముడు కూడా లేదు లేదంటూనే... క్యాడర్ నంతా తన వైపుకు తిప్పుకునేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇంతకీ సైకిల్ పార్టీలో అన్నకు ఎసరు పెడుతున్న ఆ తమ్ముడు ఎవరు? 

బ్రదర్ వర్సెస్ బ్రదర్‌
బెజవాడ తెలుగుదేశం పార్టీ నాయకత్వం నాయకుల కుటుంబాల్లో చిచ్చు పెడుతోందన్న చర్చ సాగుతోంది. ఇటీవల కాలంలో ఏ ఇద్దరు తెలుగు తమ్ముళ్లను కదిపినా కేశినేని సోదరుల ఇంటి పోరు గురించే చర్చించుకుంటున్నారట. కొంత కాలంగా ఎంపీ కేశినేని నాని పార్టీ అధినేతతో పాటు క్యాడర్ తోనూ టచ్ మి నాట్ అంటూ దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ ముఖ్య కార్యక్రమాలకు సైతం కేశినేని నాని డుమ్మా కొట్టేస్తున్నారు. ఐతే పార్టీకి తల్లో నాలుకలా ఉండాల్సిన పార్లమెంట్‌ సభ్యుడు తలనొప్పిగా మారడంతో అధినేతతో పాటు నాయకులు, క్యాడర్ అంతా నాని వ్యవహారశైలి పై గుర్రుగా ఉంటున్నారట.

ఇక నాని వైఖరితో విసిగిపోయిన చంద్రబాబు, చినబాబు కేశినేనికి సొంత ఇంటి నుంచే ఎసరు పెట్టాలని ఫిక్సయిపోయారట. అందుకే కేశినేని నాని సోదరుడు కేశినేని శివనాధ్‌ను తెరపైకి తెచ్చారు. ఇదిలా ఉంటే తనపై కిందస్థాయి నాయకులు ఫిర్యాదులు చేయడం... అధినేత సెటిల్ మెంట్లు చేయడం నచ్చక కేశినేని నాని తన పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలను పట్టించుకోవడం పూర్తిగా మానేశారు. తనకు గుర్తొచ్చినప్పుడు మాత్రమే ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ అటెండెన్స్ వేయించుకుంటున్నారు.  

తమ్ముడి వెనక బాబు
మొన్నటి వరకూ పార్టీ నేతలతోనే పొసగడం లేదంటే.. ఇప్పుడు పార్టీ అధినాయకత్వం కూడా నానికి పొగ పెడుతోందన్న ప్రచారం సాగుతోంది. నాయకత్వం సూచనల మేరకు నాని తమ్ముడు శివనాథ్ అలియాస్ చిన్ని చాపకింద నీరులా దూసుకుపోతున్నాడట. దీంతో సొంత కుటుంబం నుంచే పోటీ మొదలవ్వడం నానికి చిరాకు తెప్పిస్తోందంటున్నారు. చిన్ని కూడా తాను అన్నకు ఎలాంటి పోటీ కాందంటూనే పార్టీలో యాక్టివ్ రోల్ పోషిస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అన్ని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ తరచూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ శివనాధ్ అందరినీ కలుపుకుపోతున్నాడట. నియోజకవర్గం ఏదైనా నేనున్నాంటూ వాలిపోతున్నాడట. తిరువూరు నుంచి బెజవాడ తూర్పు నియోజకవర్గం వరకూ అన్ని నియోజకవర్గాల్లోనూ తన మార్క్ ఉండేలా కార్యక్రమాలు చేస్తున్నాడట. కేశినేని ఫౌండేషన్ పేరుతో మెడికల్ క్యాంప్ లు, సేవా కార్యక్రమాలు, అన్నా క్యాంటీన్లు ఇలా ఇటీవల కాలంలో తెగ హడావిడి చేస్తూ నాని కంటే ఇతనే బెటర్ అనేలా క్యాడర్ లో తన పరపతి పెంచుకుంటున్నాడట. 

సైకిల్‌కు సొంతింటి వెన్నుపోటు
మారుతున్న పరిణామాల నేపథ్యంలో పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని తెలుగు తమ్ముళ్ళు కూడా శివనాధ్ దూకుడుతో అతని వెంటే మేమూ అంటూ పార్టీ మార్చేస్తున్నారట. తనకు వ్యతిరేకంగా పార్టీలో, కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు నానికి మింగుడు పడటం లేదట. వెన్నంటి నిలవాల్సిని సొంత తమ్ముడే..వెన్నుపోటు పొడుస్తుండటంతో జీర్ణించుకోలేకపోతున్నారని టాక్‌. రాబోయే ఎన్నికల్లో తనకు ప్రత్యామ్నాయంగా శివనాధ్ ను పార్లమెంట్ బరిలోకి దించుతారని పార్టీలో నడుస్తున్న చర్చకు తాజా పరిస్థితులు మరింత బలం చేకూరేలా ఉండటంతో.. క్యాడర్ పైన సైతం కేశినేని గుర్రుగా ఉన్నారట. శివనాధ్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం అన్నదమ్ముల మధ్య మొన్నటి వరకూ ఉన్న గ్యాప్ మరింత పెరిగిందన్న టాక్ ఇప్పుడు బెజవాడలో జోరుగా చక్కర్లు కొడుతోంది. 

పార్టీ పై తీవ్ర అసంతృప్తితో ఉన్న నానికి తమ్ముడి రూపంలో ఎసరు పెట్టేందుకు పార్టీ పెద్దలే తెరవెనుక నుంచి కథ నడిపిస్తున్నారని.. క్యాడర్ కూడా బలంగా నమ్ముతోంది. అయితే పార్టీ హైకమాండ్‌లో వచ్చిన మార్పుతో పార్టీ శ్రేణులు కూడా క్రమంగా నానికి దూరమైపోతూ చిన్నికి దగ్గరవుతున్నారని బెజవాడలో చర్చ నడుస్తోంది.
పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top