చుక్కలు చూపిస్తున్న చిన్న నియోజకవర్గం | Aravakurichi: A Small Seat with Big Demands | Sakshi
Sakshi News home page

చుక్కలు చూపిస్తున్న చిన్న నియోజకవర్గం

Mar 24 2026 9:00 PM | Updated on Mar 24 2026 9:35 PM

 Aravakurichi: A Small Seat with Big Demands

తమిళనాట ఎన్నికల సందడి మొదలైంది. అయితే.. కరూర్ - ఈరోడ్ జిల్లాల సరిహద్దులను పంచుకుంటున్న ఓ చిన్న నియోజకవర్గం మాత్రం అభ్యర్థులకు చుక్కలు చూపిస్తుంది. ఇక్కడ గెలవాలంటే.. సమస్యల పరిష్కారంపై అభ్యర్థులు నిర్దిష్టమైన ఎజెండాతో ముందుకు వెళ్లాల్సిందే..! ఎందుకంటే.. ఇక్కడి ఓటర్లు ఏకతాటిపై ఉంటూ.. అభ్యర్థుల గెలుపోటములను శాసిస్తారు. శబరిమలకు వెళ్లే తెలుగు భక్తులు పళని సుబ్రమణ్య స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ.. పళనికి సమీపంలో ఉండే ఆ చిన్న నియోజకవర్గం పేరే ‘అరవకురుచ్చి’. తెలుగు భక్తులు ఎంతో ఇష్టంగా ధరించే కరుగంళి మాలలకు నిలయమైన పాతాళ శంభు మురుగన్ ఆలయం కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. ఆ నియోజకవర్గ విశేషాలేంటో తెలుసుకుందామా?

అరవకురుచ్చి పరిసర ప్రాంతాలు మునగకు ప్రసిద్ధి. ఇక్కడి ఈసనత్తం మార్కెట్ మునక్కాయల విక్రయాలకు అడ్డాగా ఉంది. ఈ ప్రాంతం తీవ్రమైన ఎండలకు నిలయం. అంతేకాదు.. పశ్చిమ కనుమలు అడ్డుగా ఉండడంతో ఏర్పడ్డ వర్షాచ్ఛాయ ప్రాంతాల్లో ఉన్న అరవకురుచ్చిలో తీవ్ర వర్షాభావ పరిస్థితులుంటాయి. 

కేవలం లక్షా ఎనభై తొమ్మిది వేల మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గం పరిధిలో పళ్లపట్టి, అండిపెట్టికొట్టాయ్, వెట్టమంగళం, కొంబుపాళయం, తిరుక్కాడుతురై, నంజై పుగళూర్, పుంజై పుగళూర్, పుంజై తోటక్కురిచ్చి వంటి ప్రాంతాలుంటాయి. ఈ ప్రాంతాల్లోని నేషనల్ హైవేకు ఇరువైపులా ఉండే పల్లెల్లో తెలుగువారు కూడా ఉంటారు. అయితే.. వారు ఇక్కడ గెలుపోటములను శాసించే స్థాయిలో లేరు. ఇక్కడ 10% ముస్లిం ఓటర్లుండగా.. మిగతా వారిలో కొంగు వెల్లాళ కౌండర్లు, వెట్టువ కౌండర్లు, నాయగర్ వంటి అనేక సామాజిక వర్గాలున్నాయి.

అరవకురుచ్చిలో నీటి సమస్య అత్యంత ప్రధానమైనది. ప్రైవేటు వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్లు తాగేనీటి అవసరాలను తీరుస్తున్నప్పటికీ.. సాగు నీటికోసం రైతులు దీర్ఘకాలికంగా పోరాటాలు చేస్తున్నారు. నగాంజీ ఆనకట్ట నీటి పంపిణీలో సరైన హక్కులను పేర్కొనకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతుంటారు. తాదంపాళయం చెరువును అటవీశాఖ నుంచి ప్రజా పనుల శాఖ స్వాధీనం చేసుకున్నాక కొంత వరకు సాగునీటి అవసరాలు తీరుతున్నా.. ఆనకట్టలను నింపడం ఓ మహా క్రతువుగా మారుతోంది. రైతులకు సాగునీటిపై స్పష్టమైన హామీ ఇచ్చేవారే ఇక్కడ విజయం సాధిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

1952 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి రామస్వామి కౌండర్, 1967లో ఇండిపెండెంట్ అభ్యర్థి ఎస్.కందస్వామి కౌండర్ విజయం సాధించారు. ఆ తర్వాతి కాలంలో స్వతంత్రులకు ఇక్కడ విజయం అందని ద్రాక్షగా మారింది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే.. 1957, 1962, 1977 ఎన్నికల్లో మాత్రమే విజయాన్ని మూటగట్టుకుంది. 1980 నుంచి ఇక్కడ అయితే డీఎంకేకు.. లేకుంటే అన్నాడీఎంకేకు మాత్రమే పట్టం కడతామంటూ ఓటర్లు తీర్పునిస్తున్నారు. 

ఈ నియోజకవర్గానికి మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. ఎప్పుడూ కూడా ఏ పార్టీ కూడా హ్యాట్రిక్ కొట్టిన దాఖలాలు లేకపోవడమే. 2019, 2021 ఎన్నికల్లో ఇక్కడ డీఎంకే పాగా వేసింది. ఈసారి హ్యాట్రిక్ కోసం సిద్ధమవుతోంది. అయితే.. అతి చిన్న నియోజకవర్గం కావడం.. ఈసారి దళపతి విజయ్ పార్టీ టీవీకే ఇక్కడ బాగా పుంజుకుంటుండంతో ఓట్లు చీలిపోయే ప్రమాదముంది. ఈ ప్రమాదం డీఎంకే కొంప ముంచుతుందా? లేక అన్నాడీఎంకేను ఓడించి, డీఎంకేకు హ్యాట్రిక్ ఇస్తుందా? అనేది ఉత్కంఠగా మారుతోంది.

అరవకురుచ్చి నియోజకవర్గంలో మొత్తం 90,490 మంది పురుష ఓటర్లు, 99,203 మంది మహిళా ఓటర్లున్నారు. ఏ ఎన్నికల్లో అయినా.. మహిళల మద్దతున్న అభ్యర్థే గెలుస్తాడనేది ఇక్కడ సంప్రదాయంగా కొనసాగుతోంది. డీఎంకే, అన్నాడీఎంకే మధ్య హోరాహోరీ పోరు సాగే ఈ నియోజకవర్గం నుంచి టీవీకే తరఫున సతీశ్, నామ్ తమిళర్ పార్టీ నుంచి డాక్టర్ నరేన్ పోటీ చేస్తున్నారు.  -వెబ్‌డెస్క్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement