ఈ నియోజకవర్గంలో గెలిచే పార్టీనే అధికారంలోకి..! | Erode West Assembly constituency history in Tamil nadu polls | Sakshi
Sakshi News home page

ఈ నియోజకవర్గంలో గెలిచే పార్టీనే అధికారంలోకి..!

Mar 24 2026 9:25 PM | Updated on Mar 24 2026 9:39 PM

Erode West Assembly constituency history in Tamil nadu polls

తమిళనాడులో స్టార్ నియోజకవర్గంగా పేరున్న ఈరోడ్ పశ్చిమంలో ఈ సారి అసెంబ్లీ ఎన్నికల పోరు ఉత్కంఠగా సాగుతోంది. తెలుగు ఓటర్లు కూడా ఓ మోస్తరుగా ఉండే ఈ నియోజకవర్గంలో విజయం సాధించేవారు క్యాబినెట్ మంత్రి అవుతారనే ఓ నమ్మకం కొనసాగుతోంది. అంటే.. ఈ నియోజకవర్గంలో విజయం సాధించే పార్టీనే అధికారాన్ని చేపడుతుందని ఓటర్లు విశ్వసిస్తుంటారు. అందుకే.. ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌ని స్టార్ నియోజకవర్గం అని పిలుస్తుంటారు. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో నెక్-టు-నెక్ ఫైట్ జరుగుతోంది.

ఈరోడ్ పశ్చిమ నియోజకవర్గంలో నగర ప్రాంతాలతోపాటు.. గ్రామాలు కూడా ఉన్నాయి. ఈరోడ్ మునిసిపల్ కార్పొరేషన్‌కు చెందిన 40కి పైగా డివిజన్లు, సింతోడు, నస్యనూర్ పట్టణ పంచాయతీలు, పెరుందురై తాలూకాలోని వడముఖం వెల్లోడు, పుంగంబాడి, కౌండాచ్చిపాళ్యం, తెన్ముఖం వెల్లోడు, ముగాసి పులవంపాళ్యం, ఈరోడ్ తాలూకాలోని కరైఎల్లపాళ్యం, ఎలవమలై, మెట్టునాసువంపాళ్యం, పేరోడు, నొచ్చిపాళ్యం, గంగాపురం, ఎల్లాపాళ్యం, విల్లరసంపట్టి, మేల్తిండల్, కీళ్తిండల్, కతిరంబట్టి, రాయపాళ్యం, మెట్టుకడై, కూరపాళ్యం, తొట్టాణి, పుత్తూర్ పుదుప్పాళ్యం, నంజనాపురం, పవళత్తాంపాళ్యం, వెప్పంపాళ్యం, ముత్తంపాళ్యం గ్రామాలు ఉన్నాయి. ఈరోడ్ జిల్లాలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా ఈరోడ్ పశ్చిమానికి పేరుంది.

స్వాతంత‍్య్రానంతరం వేగంగా అభివృద్ధి  
రైల్వే స్టేషన్ ఉండడం కారణంగా.. స్వాతంత‍్య్రానంతర కాలం నుంచే ఈరోడ్ పశ్చిమ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందడం మొదలుపెట్టాయి. ఈ నియోజకవర్గంలో 50% మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడగా.. మిగతా 50% పరిశ్రమలను నమ్ముకుంటున్నారు. ఈ ప్రాంతం డైయింగ్, తోలు, వస్త్ర పరిశ్రమలకు నిలయం. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఈరోడ్ పశ్చిమం ఏర్పడింది. 

ఈరోడ్ జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో.. ఈరోడ్ పశ్చిమంలోనే అత్యధిక ఓటర్లున్నారు. భారత ఎన్నికల సంఘం తాజా లెక్కల ప్రకారం ఇక్కడ 1,18,206 మంది పురుష ఓటర్లు, 1,27,246 మంది మహిళా ఓటర్లు, 41 మంది థర్డ్ జెండర్ ఓటర్లున్నారు. మొత్తం 2 లక్షల 46 వేల మంది ఓటర్లలో కొంగు వేళాల కౌండర్లు బలమైన సామాజికవర్గంగా ఉన్నారు. మొత్తం ఓటర్లలో వీరి వాటా 40%. అంటే.. ఈ సామాజికవర్గం అండదండలున్నవారే ఇక్కడ విజయం సాధిస్తారు. ఆ తర్వాతి స్థానాల్లో పట్టిక, ముదలియార్, నాదార్ వర్గాలున్నాయి.

ఈరోడ్ పశ్చిమంలో వ్యవసాయం, పరిశ్రమలకు సంబంధించి ఎన్నెన్నో అపరిష్కృత సమస్యలున్నాయి. ప్రధానంగా పసుపు పంటకు మద్దతు ధర లేకపోవడం తరచూ ఇక్కడి రైతుల ఆగ్రహాన్ని చవిచూస్తోంది. పసుపు ప్రాసెసింగ్ యూనిట్ల డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. పసుపు నిల్వకు కోల్డ్ స్టోరేజీలు లేవు. తోలు పరిశ్రమలకు సంబంధించి, శుద్ధి కేంద్రాలు లేకపోవడం ఇక్కడ ప్రధాన సమస్య. డైయింగ్ పరిశ్రమ కూడా ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటోంది. 

ప్రతికూల అంశాలు ఇవే.. 
పవర్‌లూమ్ పరిశ్రమకు సంబంధించి దారాల ధరలు పెరగడం ప్రతికూలంగా ఉంది. ప్రభుత్వ లా కాలేజీ, యూనివర్సిటీ ఏర్పాటు, గ్రామాల్లో రహదారుల నిర్మాణం, తాగునీటి సదుపాయాల కల్పన వంటివి ప్రజలకు తీరని కలలుగా మిగిలిపోతున్నాయి. గత ఎన్నికల్లో డీఎంకే ఈ అంశాలపై ప్రత్యేకంగా హామీలు ఇచ్చినా.. ఇక్కడి ఎమ్మెల్యే ముత్తుస్వామి క్యాబినెట్ మంత్రి అయినా.. వాగ్దానాలను నెరవేర్చలేదనే అపవాదు ఉంది.

ఈ నియోజకవర్గంలో ముత్తుస్వామి ఎక్కువసార్లు గెలిచారు. 1980, 1984 ఎన్నికల్లో ఆయన ఎంజీఆర్, వీఎన్ జానకి ప్రభుత్వాల్లో రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. 1991లో భవానీ నియోజకవర్గానికి మారి.. అక్కడి నుంచి విజయం సాధించి, జయలలిత ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా సేవలందించారు. 1996లో మళ్లీ ఈరోడ్‌కు వచ్చినా.. విజయం సాధించలేదు. 2001, 2006 ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 2010లో డీఎంకేలో చేరారు. అయినా.. 2011, 2016లో ఓటమిని మూటగట్టుకున్నారు. పాతికేళ్ల తర్వాత.. 2021లో విజయం సాధించి, మరోసారి మంత్రిపదవిని దక్కించుకున్నారు. ఇక్కడ గెలిచిన మిగతావారి విషయానికి వస్తే.. 2011లో అన్నాడీఎంకే నేత కేవీ రామలింగం ఈరోడ్‌లో విజయం సాధించి, జయలలిత క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2016లో కూడా ఆయనే గెలిచారు. అందుకే.. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే.. ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే ఓ విశ్వాసం ఈరోడ్ ప్రజల్లో ఉంది.  -వెబ్‌డెస్క్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement