రాజకీయాల్లో కల్లోలం.. తెరపైకి కిమ్‌ సోదరి, కిమ్‌ సపోర్ట్‌ మాత్రం ఆయనకే!

Alternate Leadership In North Korea Kim Jong Un Versus Kim Yo Jong - Sakshi

దేశంలో ఓవైపు కరోనా, మరోవైపు ఆకలి కేకలు, ఇంకోవైపు వ్యక్తిగత అనారోగ్యం .. ఈ కారణాలు నార్త్‌ కొరియా నియంతాధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ను బాధ్యతల నుంచి వైదొలిగేలా చేయబోతున్నాయా?. క్షిపణి పరీక్షలు, సామూహిక పరేడ్‌లతో దర్పం ప్రదర్శిస్తున్న కిమ్‌.. తన తర్వాతి నాయకత్వ బాధ్యతల విషయంలో మాత్రం కీలక సమాలోచనలు జరుపుతున్నాడా?.. ఉత్తర కొరియా, దాయాది దక్షిణ కొరియా ప్రధాన పత్రికల కథనాలు ‘అవుననే’ ఊహాగానాలకు తెరలేపుతున్నాయి ఇప్పుడు.  

 

గత కొంతకాలం కిమ్‌ జోంగ్‌ ఉన్‌(38).. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. అయితే అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేస్తూ వస్తున్న నార్త్‌ కొరియా ప్రభుత్వం.. కిమ్‌ కీలక చర్చల్లో పాల్గొంటున్న ఫొటోలు, వీడియో ఫుటేజీలను స్థానిక మీడియా ఛానెళ్ల ద్వారా బయటి ప్రపంచానికి విడుదల చేస్తూ వస్తోంది.  అయినప్పటికీ సన్నబడిన కిమ్‌ రూపం ఆధారంగా ఆయన అనారోగ్యం నిజమేనన్న అనుమానాలు వ్యక్తం చేస్తోంది దక్షిణ కొరియా. కిమ్‌ గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు చెబుతోంది. ఈ పరిణామాలతోనే నాయకత్వ మార్పు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాడని, ఈ తరుణంలో నార్త్‌ కొరియాలో రాజకీయ కల్లోలం చెలరేగుతోందని ఇప్పుడు  వరుస కథనాలు ప్రచురిస్తోంది.

 

కిమ్‌ చెల్లికి కీలక పదవి!
కిమ్‌ యో జోంగ్‌..  కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు స్వయానా సోదరి.  మొన్నటిదాకా కిమ్‌కు ప్రధాన సలహాదారుగా ఉందీమె. అయితే ఇప్పుడు ఆమెను నార్త్‌ కొరియా స్టేట్‌ ఎఫైర్స్‌ కమిషన్‌లో కీలక పదవి దక్కించుకుంది. కేసీఎన్‌ఏ న్యూస్‌ ఏజెన్సీ కథనం ప్రకారం.. కమిషన్‌లో ఇంతకు ముందున్న తొమ్మిది మంది సభ్యుల్ని అర్థాంతరంగా తొలగించింది నార్త్‌ కొరియా స్టేట్‌ అసెంబ్లీ. ఇందులో పాక్‌ పోంగ్‌ జు, అమెరికాతో గతంలో దౌత్యం కోసం ప్రయత్నించిన చోయి సన్‌ హుయి కూడా ఉన్నారు. ఇక గురువారం ఎనిమిది మందితో కూడిన లిస్ట్‌ ప్రకటించగా.. అందులో యంగ్‌ అండ్‌ ఓన్లీ ఉమెన్‌గా చోటు సంపాదించుకుంది కిమ్‌ యో జోంగ్‌.  ఈమె నియామకానికి సుప్రీం పీపుల్స్‌ అసెంబ్లీ సైతం ఆమోద ముద్ర వేసింది.  

డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, దక్షిణ కొరియా మూన్‌ జాయ్‌ ఇన్‌తో కిమ్‌ జోంగ్‌ భేటీ అయినప్పుడు కిమ్‌ యో ఇంటర్నేషనల్‌ మీడియా ఛానెల్స్‌లో హైలెట్‌ అయ్యింది.  ఆటైంలోనే ఆమె అన్న తర్వాతి వారసురాలంటూ కథనాలు వెలువడ్డాయి. ఆ వెంటనే పార్టీ సెంట్రల్‌ కమిటీకి వైస్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌గా ఆమెను నియమించడంతో దాదాపుగా ఈ అనుమానాల్ని నిజమని భావించారంతా.  అయితే అనూహ్యంగా ఆమెను ఆ పదవి నుంచి తొలగించిన కిమ్‌, ఆ పదవిని అలాగే ఖాళీగా ఉంచేశాడు.  దీంతో ఆమె సైడ్‌ అయ్యిందని అంతా అనుకున్నారు.  తాజాగా 34 ఏళ్ల కిమ్‌ యో జోంగ్‌కు స్టేట్‌ ఎఫైర్స్‌ లాంటి కీలక విభాగంలో.. అదీ సినియర్‌ పోస్ట్‌ కట్టబెట్టడంతో ప్రెసిడెంట్‌ రేసులో నిలిచినట్లయ్యింది.

 

కిమ్‌ మాత్రం అతనికే..
అయితే కిమ్‌ జోంగ్‌ఉన్‌ మాత్రం నాయకత్వ బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే దానిపై కీలక నిర్ణయం తీసుకోవచ్చని దక్షిణ కొరియాకు చెందిన ఓ ప్రముఖ న్యూస్‌ ఏజెన్సీ ఒక ఎడిటోరియల్‌ను ప్రచురించింది. అంతేకాదు సోదరి కిమ్‌ యో జోంగ్‌కు బాధ్యతలు అప్పగించే విషయంలో సుముఖంగా లేడని పేర్కొంది. అందుకు కారణం లేకపోలేదు. ఈ జూన్‌లో ‘వర్కర్స్‌ పార్టీ ఆఫ్‌ కొరియా’ పొలిట్‌బ్యూరో​ సభ్యుల ఎంపిక నిబంధనలను కఠినతరం చేసింది. ఇందులో వారసత్వ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అంతేకాదు పార్టీ వైస్‌ ప్రెసిడెంట్‌ థాయ్‌ హ్యోంగ్‌ చోల్‌ను తర్వాతి అధ్యక్షుడిగా పేర్కొంటూ ఓ కథనం సైతం ప్రచురించింది.

కిమ్‌కు నమ్మినబంటుగా, రాజకీయ సలహాదారుడిగా ఉన్న హ్యోంగ్‌ చోల్‌ను..  తర్వాతి అధ్యక్షుడిగా ఎంపిక చేసే ప్రయత్నాలు కిమ్‌ చేస్తున్నాడని, ఈ మేరకు సెప్టెంబర్‌ మొదటివారంలో పొలిట్‌బ్యూరో సమావేశంలో చర్చించినట్లు సౌత్‌ కొరియాకు చెందిన ది స్ఫై న్యూస్‌ ఏజెన్సీ కథనం ప్రచురించింది. మరోవైపు అడిటింగ్‌ కమిషనర్‌ యూ సంగ్‌ చోల్‌ పేరు తర్వాత ప్రెసిడెంట్‌ రేసులో ఉన్నట్లు మరో పత్రిక కథనం వెలువరించింది. కిమ్‌ యో జోంగ్‌ ‍గ్రూప్‌ రాజకీయాలకు తెర లేపుతోందని.. అందుకు చెక్‌ పెట్టేందుకు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రయత్నిస్తున్నాడని, ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వైరం మొదలైందన్నది మరో కథన సారాంశం. అయితే దక్షిణ కొరియా కథనాల సంగతి పక్కనపెడితే..  వారసత్వ రాజకీయాల వ్యతిరేక నిబంధనను ఉల్లంఘిస్తూ  సుప్రీం పీపుల్స్‌ అసెంబ్లీ కిమ్‌ సోదరికి కీలక పదవి కట్టబెట్టిందంటూ నార్త్‌ కొరియాకే చెందిన కేసీఎన్‌ఏ న్యూస్‌ ఏజెన్సీలో కథనం రావడం ఆసక్తికర చర్చకు దారితీసింది.

చదవండి:  కిమ్‌ సోదరి అనూహ్య ప్రకటన

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top