'అంబానీ, అదానీ అందర్నీ కొన్నట్లు రాహుల్‌ను కొనలేరు.. నా అన్న వారియర్..'

Adani Ambani Bought Leaders Media Cant Buy Rahul Priyanka Gandhi - Sakshi

లక్నో: అంబానీ, అదానీ దేశంలోని రాజకీయ నాయకులు, ప్రభుత్వ సంస్థలు, మీడియాను కొన్నట్లుగా రాహుల్ గాంధీని కొనలేరని వ్యాఖ్యానించారు ప్రియాంక గాంధీ. తన సోదరుడు వారియర్ అని కొనియాడారు. భారత్ జోడో యాత్ర ఢిల్లీ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోకి అడుగుపెట్టిన సందర్భంగా లోని సరిహద్దులో ఘన స్వాగతం పలికారు ప్రియాంక. అక్కడ ఏర్పాటు చేసిన ర్యాలీలో ప్రసంగించారు.

దాదాపు 3,000 కిలోమీటర్ల యాత్ర పూర్తి చేసిన తన సోదరుడ్ని చూస్తే గర్వంగా  ఉందని ప్రియాంక అన్నారు. రాహుల్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ రూ.కోట్లు ఖర్చు పెట్టిందని, కానీ ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయిందని పేర్కొన్నారు. తన సోదరుడు యుద్ధవీరుడని ప్రశంసించారు.

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ తెలుపు రంగు టీషర్ట్‌లోనే కన్పిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలోనూ ఆయన టీషర్టే ధరించడం చూసి అందరూ షాక్ అయ్యారు. ఈ విషయంపై ప్రియాంక స్పందిస్తూ తన సోదరుడికి సత్యం అనే రక్షణ కవచం ఉందని, అందుకే చలికాలంలో టీషర్టులు ధరించినా అతనికి ఏమీ కాదని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌కు పునరుత్తేజం తీసుకురావడమే లక్ష‍్యంగా సెప్టెంబర్ 7న భారత్ జోడో యాత్రను కన్యాకుమారిలో ప్రారంభించారు  రాహుల్ గాంధీ. 150 రోజులు, 3,500 కిలోమీటర్లు కవర్ చేస్తూ కశ్మీర్ వరకు ఈ యాత్ర సాగనుంది. రాహుల్ పాదయత్రలో పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లో కొనసాగుతోంది.
చదవండి: 'మహిళలంటే పార్టీలో గౌరవం లేదు..' బీజేపీకి నటి గుడ్‌బై..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top