Mamata Banerjee: బెంగాల్‌లో బీజేపీకి మరో షాక్‌!

 Defectors Who Joined BJP Queue Up To Return toTMC - Sakshi

టీఎంసీలో రివర్స్ మైగ్రేషన్ ట్రెండ్‌

పార్టీని వీడిన  నేతలు మళ్లీ టీఎంసీలోకి క్యూ

కోలకతా: బెంగాల్‌ కోటలో పాగా వేయాలనే లక్ష్యంతో  బీజేపీ పన్నిన వ్యూహాలపై  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కోలుకోలేని దెబ్బ కొట్టారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా అఖండ విజయాన్ని సొంతం చేసుకుని విశ్లేషకులను సైతం ఆశ్యర్యంలో ముంచెత్తారు. 292 అసెంబ్లీ స్థానాల్లో టీఎంసీ 213 స్థానాలను కైవసం చేసుకోగా, బీజేపీ 77 స్థానాలతో సరిపెట్టుకుంది. అయితే ఈ విజయం అంత అలవోకగా వచ్చిందేమీ కాదు.  రాష్ట్ర ఎన్నికలకు ముందు మమతా అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు సహా, కీలక నేతలు, సన్నిహితులు పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకోవడం పెనుసవాల్‌గా మారింది. అయితే కేవలం నెల రోజుల్లోనే ఇపుడు సీన్‌ రివర్స్‌ అవుతుండటం విశేషం.

తృణమూల్ కాంగ్రెస్‌లోకి రివర్స్ మైగ్రేషన్ ట్రెండ్‌ నెలకొంది. టీఎంసీ ఘన విజయం నేపథ్యంలో పార్టీ ఫిరాయింపుదారులంతా మళ్లీ  వెనక్కి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 2017లో మమతకు తొలి షాక్‌ ఇచ్చి పార్టీని విడిచి పెట్టిన  బీజేపీ నేత ముకుల్ రాయ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే గత మార్చిలో బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సోనాలి గుహా,  ఫుట్‌బాల్ క్రీడాకారుడు, రాజకీయ నాయకుడు దీపేందు బిస్వాస్ టీఎంసీ జెండా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం.  వీరితోపాటు సరాలా ముర్ము , అమల్ ఆచార్య తదితరులుకూడా ఇదే బాటలో ఉన్నట్టు పీటీఐ సమాచారం.

అంతేకాదు ఏడు నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు లేదా నలుగురు బీజేపీ సిట్టింగ్ ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్‌లో చేరాలనే కోరికను వ్యక్తం చేశారని తృణమూల్ ప్రతినిధి కునాల్ ఘోష్  మీడియాకు వెల్లడించారు. అయితే దీనిపై పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. ఈ నాయకులు ఎన్నికలకు ముందే పార్టీని విడిచిపెట్టిన క్రమంలో కార్యకర్తల కృషితో మమతా  నాయకత్వంలో విజయం సాధించాం కనుక వారి మనోభావాలను కూడా గౌరవించాల్సి ఉందన్నారు. అయితే ముకుల్‌ రాయ్‌ మళ్లీ టీఎంసీలో చేరనున్నారన్న వార్తలను బీజేపీ కొట్టి పారేసింది. 

మరోవైపు ప్రధాన కార్యదర్శి అలపన్ బందోపాధ్యాయ విషయంలో కేంద్రం, మమత సర్కార్‌ మధ్య కోల్డ్‌ వార్‌ ముదురుతోంది. రాష్ట్రంలో ఓటమిని జీర్ణించుకోలేని కేంద్రం తమ పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తోందని మమత మండి పడ్డారు. ఈ సందర్భంగా 70 వ దశకంనాటి హిందీ సినిమా  షోలే లోని పాపులర్‌ డైలాగ్‌ ‘జో డరతే హై..వో మరతే హై’ అనే డైలాగును గుర్తు చేసిన దీదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష పార్టీలు, స్వచ్ఛంద  సంస్థలు కేంద్ర వైఖరికి వ్యతిరేకంగా ఉద్యమించాలని  విజ్ఞప్తి చేశారు. 

చదవండి: కేంద్రానిక్‌ షాక్‌.. పంతం నెగ్గించుకున్న మమత

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top