పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సూచించారు. జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్‌లో ఆదివారం నిర్వహించిన జిల్లాస్థాయి అండర్–11, 14 బాలురు, బాలికల 70వ ఎస్‌జీఎఫ్ కరాటే ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించారు. అనంతరం విప్ విజయరమణారావు మాట్లాడుతూ, గ్రామీణ క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ తదితర క్రీడల్లో పెద్దపల్లి ప్రాంత విద్యార్థులు, యువత మంచి ప్రతిభ కనబరుస్తున్నారని ప్రశంసించారు. దేహదారుఢ్యంతోపాటు మానసిక వికాసానికి క్రీడలు ఎంతోఅవసరమని, ఎస్‌జీఎఫ్ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లోనూ సత్తా చాటి జిల్లాకు పేరు తీసుకురావా లని ఆయన ఆకాంక్షించారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ సెక్రటరీ లక్ష్మణ్, ఉపాధ్యాయులు, క్రీడాకారులు, నిర్వాహకులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ విజయరమణారావు


