నిర్వాసితులకు అందని పరిహారం | - | Sakshi
Sakshi News home page

నిర్వాసితులకు అందని పరిహారం

Jul 27 2026 2:18 AM | Updated on Jul 27 2026 2:18 AM

● 40ఏళ్ల క్రితం ఎన్టీపీసీకి భూములు అప్పగింత ● మొగల్‌పహాడ్‌ గ్రామంలో నివాసం ఉంటున్నవారే అర్హులు!

రామగుండం: తెలంగాణ పునర్విభజన చట్టంలో ఇప్పటికే స్థాపించిన యూనిట్లలో విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభించారు. ఫేజ్‌–2లో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మరో 3 యూనిట్ల స్థాపనకు అవసరమైన బూడిద చెరువు తవ్వకానికి మొగల్‌పహాడ్‌లోని మిగులు భూముల సేకరణకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం గతమే 11న ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది.

భూములు 1,274 ఎకరాలు

మొగల్‌పహాడ్‌లో మొత్తం 1,274 ఎకరాలు ఉండగా.. 1982లో ఎన్టీపీసీ తొలివిద్యుత్‌ కేంద్రం స్థాపన కోసం 553 ఎకరాలు సేకరించింది. 1950లో జమీందారీ వ్యవస్థ రద్దయింది. అయినా, అంతర్గాం మండలంలోని మొగల్‌పహాడ్‌లోని భూములు వెంకటమురళీ మనోహర్‌రావు పేరిట ఉన్నాయి. 1973లో వచ్చిన ల్యాండ్‌ సీలింగ్‌ యాక్ట్‌ ప్రకారం మొత్తం భూమి ఒకే పేరుతో ఉండకూడదు. దీంతో స్థానిక రైతులకు ఆ భూములు విక్రయించినట్లు 1975లో రెవెన్యూ యంత్రాంగానికి డిక్లరేషన్‌ ఇచ్చారు. ఆనాటి అధికారుల నిర్లక్ష్యంతో కాస్తులో ఉన్న రైతుల పేర్లు రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాలేదు. ఫలితంగా సేకరించిన భూములకు అసలైన వారసులెవరో గుర్తించలేదు. దీంతో ఇప్పటికీ తొలివిడత సేకరించిన నిర్వాసితులకు పరిహారం పంపిణీ కాలేదు. మిగులు భూములను గ్రామస్తులు సాగు చేసుకుంటున్నా.. ధరణి పోర్టల్‌లో రెండేళ్ల క్రితం వరకు భూస్వామి పేరు కొనసాగించిన అధికారులు.. తర్వాత తొలగించారు. మూడుతరాలు గడిచినా ఇప్పటికే తొలివిద్యుత్‌ కేంద్రానికి అప్పగించిన భూముల పరిహారం అందక నష్టపోయామని, ప్రస్తుత భూసేకరణలో అర్హులు తామేనని మొగల్‌పహాడ్‌ గ్రామస్తులు అంటున్నారు.

అర్హులమంటున్న అనర్హులు!

తొలివిడదలో ఎన్టీపీసీ సేకరించిన భూములు పోగా మిగులు భూముల్లోని సుమారు 200 ఎకరాల్లో 70 మంది గ్రామస్తులు సాగు చేసుకుంటున్నారు. ఇంకా మిగిలిన భూమిలో కొందరు దళారులు ఆనాటి భూస్వామి రాజావెంకట మురళీమనోహర్‌రావు కుటుంబసభ్యుల నుంచి కొనుగోలు చేసినట్లు సాదాబైనామా రాసుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి వారు సైతం ఆ భూముల హక్కుదారులమని ఇటీవల ప్రకటించిన రెవెన్యూ రికార్డుల్లో పేర్లు ప్రచురితం కావడంపై అసలైన అర్హుల్లో ఆందోళన నెలకొంది. ఈ విషయమై భూస్వామి కుటుంబసభ్యుల మధ్య కోర్టు వివాదం ఉండడంతో అందుకు అనుగుణంగా భూసేకరణ అధికారి నిర్ణయం మేరకు అసలైన అర్హులను ప్రకటించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

అర్హులుగా ప్రకటించాలి

మా తాతలు, తండ్రులు, ఇప్పుడు మేము కాస్తులో ఉన్నా రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాలేదు. నాలుగు దశాబ్దాల క్రితం అప్పగించి న భూములకు పరిహారం అందలేదు. జాబితాలో అనర్హుల పేర్లు ఎక్కువగా ఉన్నాయి. విచారణ జరిపి అర్హుల పేర్లు ప్రకటించాలి.

– చిలుక ప్రసాద్‌, నిర్వాసితుడు

అవార్డు ఎంక్వయిరీ కీలకం

ఎన్టీపీసీ విద్యుత్‌ కేంద్రం స్థాపనకు మొగల్‌పహాడ్‌లో భూసేకరణ చేయనుంది. లబ్ధిదారుల ఎంపికకు ముందు ప్రిలిమినరీ డిక్లరేషన్‌ ఉంటుంది. అనంతరం ప్రకటించే అవార్డు ఎంక్వయిరీలో అర్హుల జాబితా వెల్లడిస్తారు. భూసేరణ అధికారి ఆర్డీవో పరిధిలో ఈ ప్రక్రియ ఉంటుంది.

– ప్రసాదరావు, తహసీల్దార్‌, అంతర్గాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement