పెద్దపల్లిరూరల్: రైలు ప్రయాణం సురక్షితంగా సాగేలా ఆ శాఖ నిబంధనలను కఠినతరం చేసింది. రైల్వేస్టేషన్ ఆవరణతోపాటు బోగీల్లో ప్రయాణిస్తూ సిగరెట్ కాల్చడం, మద్యం తాగడాన్ని నిషేధించింది. ఈ మేరకు పెద్దపల్లి రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులను అప్రమత్తం చేసేలా పెద్దఅక్షరాలతో కూడిన సైన్‌బోర్డులను ఏర్పాటు చేశారు. రైల్వే యాక్టు సెక్షన్ 167 ప్రకారం.. నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానాతోపాటు జైలు శిక్ష విధించేలా రైల్వేరక్షణదళం (ఆర్‌పీఎఫ్), ప్రభుత్వ రైల్వే పోలీసు (జీఆర్‌పీ)లు ప్రత్యేకంగా తనిఖీలు చేస్తున్నాయి. మద్యం మత్తులో ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసినా, సిగరెట్ కాల్చినా చర్యలు తప్పవని పేర్కొన్నారు. సీసీ కెమెరాల ద్వారా నిఘా పెంచామన్నారు. ఇలాంటి చర్యల గురించి తెలిస్తే రైల్వే హెల్ప్‌లైన్ 139నంబరుకు సమాచారం అందించాలని అందులో పొందుపర్చారు.
ఉరిపోసుకుని ఆత్మహత్య
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణంలోని తిలక్‌నగర్‌కు చెందిన వినయ్‌సింగ్ (32) ఆదివారం ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో భార్యాపిల్లలు, తల్లి ఉండగాపై అంతస్తుకు వెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఎస్సై నరేశ్ తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇద్దరు యువకులపై బీరు సీసాతో దాడి
రాయికల్: మద్యం మత్తులో ఇద్దరు యువకులపై.. ఓ యువకుడు బీరు సీసాతో దాడికి పాల్పడిన ఘటన పట్టణంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణంలోని ఓ బార్‌లో ముగ్గురు యువకులు మద్యం తాగేందుకు వచ్చారు. మాటల మధ్య గొడవ జరగడంతో హరీశ్ అనే యువకుడు బీరు సీసాతో రాజశేఖర్, సామ్రాట్ అనే యువకులపై దాడి చేయడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
బంగారు గొలుసు అప్పగింత
కరీంనగర్‌క్రైం: ఓ మహిళ పోగొట్టుకున్న 2.5 తులాల బంగారు మంగళసూత్రాన్ని టూటౌన్ పోలీసులు 48 గంటల్లో గుర్తించి బాధితురాలికి అప్పగించారు. కరీంనగర్‌లో సీడీపీవోగా విధులు నిర్వహిస్తున్న సిగిరి శ్రీలత ఇటీవల షాపింగ్‌కు వెళ్లి 2.5 తులాల బంగారు మంగళసూత్రాన్ని రోడ్డుపై పోగొట్టుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను నిశితంగా పరిశీలించారు. మంగళసూత్రాన్ని గుర్తించి బాధితురాలికి అప్పగించారు.


