ప్రమాదకరంగా గుంత
నిలిచిపోయిన మురుగు
కోల్‌సిటీ: ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) ఆవరణ అస్తవ్యస్తంగా మారింది. అధికారుల నిర్లక్ష్యంతో పేషెంట్ల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతోందని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 85 పడకల కొత్త బ్లాక్ సమీపంలోని ప్రధాన ద్వారం పక్కన మూడేళ్ల క్రితం ఎస్టీపీ నిర్మాణం కోసం తవ్విన భారీగుంతను ఇప్పటికీ పూడ్చకలేదు. పనులు అర్ధంతరంగా నిలిచిపోవడంతో గుంతలో వర్షపు నీరు, మురుగునీరు చేరిదోమల ఉత్పత్తి కేంద్రంగా మారింది. ప్రమాదకరమైన గుంతను అధికారులు నిర్లక్ష్యంగా వదిలేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాత భవనం వెనకాల తొలగించిన పరుపులు, వ్యర్థాలు కుప్పలుగా పోసి వదిలేయడంతో పరిసరాల్లో పారిశుధ్యం లోపిస్తోంది. వార్డుల మధ్య వర్షపునీరు, మురుగు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. మురుగునీరు భవనాల గోడల్లోకి చేరి దెబ్బతింటున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఆస్పత్రి భవనాల గోడలపై రావి మొక్కలు పెరిగినా తొలగించే చర్యలు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని అంటున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వ ఆస్పత్రిని సమస్యలకు నిలయంగా మార్చడం తగదని, వెంటనే ఎస్టీపీ గుంతను పూడ్చి, మురుగునీటి లీకేజీలను అరికట్టి, చెత్తను తొలగించి, దోమల నివారణ చర్యలు చేపట్టాలని స్థానికులు, పేషెంట్లు కోరుతున్నారు.
పారిశుధ్య లోపం.. చుట్టూ నీటిగుంతలు


