వానొచ్చే.. జ్వరం తెచ్చే
వాతావరణంలో మార్పులు
ప్రబలుతున్న విషజ్వరాలు
గ్రామాల్లో పారిశుధ్య లోపం
మూలనపడిన ఫాగింగ్ యంత్రాలు
పేషెంట్లతో రద్దీగా మారుతున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు
జ్వరపిడీతులతో రద్దీగా మారిన ఈ చిత్రం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లోనిది. సీజనల్ వ్యాధులు, అనారోగ్య సమస్యలతో వచ్చిన పేషెంట్లతో వార్డులన్నీ ఇలా నిండిపోయాయి.
సాక్షి, పెద్దపల్లి/కోల్‌సిటీ/పెద్దపల్లి/మంథని:
వాతావరణంలో వచ్చిన మార్పులతో జిల్లాలో జ్వరాలు వేగంగా ప్రబలుతున్నాయి. ఓవైపు ఉక్కపోత.. మరోవైపు చిరుజల్లులు.. ఇలా భిన్నమైన వాతావరణానికి తోడు గ్రామాల్లో పారిశుధ్యం లోపించడంతో జ్వరాలు జనాలను కుదిపేస్తున్నాయి. పిల్లలు, పెద్దలు అనారోగ్యంతో వణికిపోతున్నారు. ఇళ్ల పరిసరాలు, నాలాల్లో నీరునిల్వ ఉండి దోమలు వ్యాప్తి చెందుతూ జనాలు వైరల్ జ్వరాల బారిన పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జ నరల్ ఆస్పత్రితోపాటు గోదవరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి, మంథని, సుల్తానాబాద్ సీహెచ్‌సీలు, ప్రైమరీ హెల్త్, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు పేషేంట్లతో రద్దీగా మారుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు, సింగరేణి ఆస్పత్రుల్లో వైద్యం పొందుతున్న వారిసంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తీవ్రమైన జ్వరం, తల, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరేచనాలు లాంటి లక్షణాలతో జిల్లావాసులు ఆస్పత్రుల పాలవుతున్నారు.
పెరుగుతున్న ఓపీ..
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజురోజుకూ ఓపీ పెరుగుతోంది. దగ్గు, జలుబు సమస్య పిల్లలను ఇబ్బందులకు గురిచేస్తోంది. వైరల్ జ్వరం నాలు గైదు రోజుల్లో తగ్గుముఖం పడుతున్నా.. దగ్గు, జ లుబు రెండు వారాలుపైగా తీవ్రత చూపిస్తోంది. ఈ క్రమంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కలిపి రోజూ 1,500 వరకు, ప్రైవేటు ఆస్పత్రుల్లో 1,500 నుంచి 2,000 వరకు ఓపీ కేసులు నమోదవుతున్నాయి. ఇందులో 150 నుంచి 200 వరకు జ్వరాలతో చిన్న పిల్లలు బాధపడుతున్నారు. నిత్యం 200 కుపైగా రక్తనమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. కొందరు ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు ఇష్టానుసారంగా వైద్యపరీక్షలు చే స్తూ, అవసరం లేకున్నా అడ్మిట్ చేసుకుంటూ రూ. వేలల్లో వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి.
పారిశుధ్య లోపం.. ముసురుతో ముప్పు..
ఇటీవల కురిసిన ముసురుతో జిల్లాలో దోమల ఉధృతి పెరిగి సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రధానంగా జలుబు, ముక్కునుంచి నీరు కారడం, దగ్గు, జ్వరం వంటివి జనాల్ని వేధిస్తున్నాయి. పల్లెలు, పట్టణాల్లో ఫాగింగ్ యంత్రాలు మూలనపడటంతో ఫాగింగ్ చేయక, డ్రైనేజీలు శుభ్రపరుచక దోమలు వృద్ధి చెందుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. గ్రామాల్లో డ్రైనేజీలు లేక మురుగు నిలిచిపోతోంది. ప్రతీ శుక్ర, మంగళవారం డ్రైడే పాటించాలని అధికారులు చెబుతున్నా స్పందన అంతంతగానే ఉంటోంది.
జిల్లాలో గత మూడేళ్లలో నమోదైన వ్యాధులు
ఏడాది డెంగీ చికున్‌గున్యా డయేరియా
2024 151 12 451
2025 105 1 386
2026 00 0 50
ఈనెలలో జీజీహెచ్‌లో ఓపీ వివరాలు
తేదీ ఓపీ
17 1,179
18 1,300
19 1,340
20 1,350
21 1,020
22 1,125
23 907
24 1,210
రామగుండం బల్దియా అధికారులు 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.4.70 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన 8 హ్యాండ్ ఫాగింగ్ యంత్రాలను గ తేడాది మార్చి 11న ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ ప్రారంభించారు. అధికారులు వాటిని వినియో గించకుండా నిర్లక్ష్యంతో మూలన పడేశారు.
ఈ చెత్తకుప్ప గోదావరిఖని విఠల్‌నగర్ సింగరేణి పార్క్ సమీపంలోని సింగరేణి క్వార్టర్స్ ఎదుట కొన్నినెలలుగా ఉంటోంది. సింగరేణి, నగరపాలక సంస్థ తొలగించడంలేదు. దుర్వాసన వెదజల్లడంతోపాటు దోమలకు ఆవాసంగా మారింది.


