ఓదెల: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సర్కార్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచాయని ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యుడు చింతకుంట విజయరమణారావు అన్నారు. ఓదెల మండల కేంరశ్రీదంలో రూ.70 లక్షల వ్యయంతో నిర్మించిన తహసీల్దార్ కొత్త భవనాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి శనివారం విప్ విజయరమణారావు ప్రారంభించారు. అనతరం విప్ మాట్లాడుతూ, ఓదెలలోని కోర్టుకు త్వరలోనే పక్కాభవనం నిర్మిస్తామన్నారు. ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. వర్షాభావం అధిగమించేందుకు ఇదే సరైన ప్రత్యామ్నాయమని ఆయన అన్నారు. ఈసందర్భంగా లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. సర్పంచ్ కనికిరెడ్డి సతీశ్, తహసీల్దార్ వనజ నాయక్, అడిషనల్ కలెక్టర్ శ్రీరాములు, ఎంపీడీవో అనిల్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఓదెల మల్లికార్జునస్వామి ఆలయంలో చేపట్టిన అభివృద్ధి పనులను విప్ విజయరమణారావు పరిశీలించారు.


