విద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ తీర్థయాత్రల్లో భాగంగా కరీంనగర్ 1 డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సు ఈనెల 26న అరుణాచలం యాత్రకు బయలుదేరుతుందని కరీంనగర్ 1డిపో మేనేజర్ విజయమాధురి తెలిపారు. కరీంనగర్ బస్టాండ్ నుంచి సాయంత్రం 4 గంటలకు బస్సు బయలుదేరి కాణిపాకం, కంచి, అరుణాచలం, శ్రీరంగం, మదురై, రామేశ్వరం, జోగులాంబ దర్శనాలు చేసుకుని ఈనెల 31న సాయంత్రం వరకు కరీంనగర్ చేరుకుంటుందని ఆమె పేర్కొన్నారు. పెద్దలకు రూ.7,300, పిల్లలకు రూ.5,475గా టికెట్ ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 7382849352, 9959225920 నంబర్లలో సంప్రదించాలని ఆమె పేర్కొన్నారు.
ఏపీఏ గనిలో ప్రమాదం.. కాంట్రాక్ట్ కార్మికుడికి తీవ్ర గాయాలు
రామగిరి: ఏపీఏ గనిలో గురువారం ప్రమాదం చోటు చేసుకుంది. వెన్సర్ కాంట్రాక్ట్ కంపెనీకి చెందిన కాంట్రాక్ట్ కార్మికుడు గుంట మల్లేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. గనిలో 3వ సిమ్‌లో రూఫ్ బోల్ట్ ఏర్పాటు చేస్తున్న సమయంలో యంత్రానికి సంబంధించిన బిట్ విరిగి మల్లేశ్ తలపై పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మల్లేశ్‌ను ఆర్జీ–3 ఏరియా సెంటినరికాలనీ డీస్పెన్సరికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యచికిత్స కోసం కరీంనగర్‌లోని ప్రైవేట్ అసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం మల్లేశ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రమాదానికి గల కారణాలపై అదికారులు ఆరా తీస్తున్నారు.
సినీగాయని జానకి
సంతాప సభ
గోదావరిఖనిటౌన్: స్థానిక సింగరేణి ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం స్ఫూర్తి భవన్‌లో గోదావరి కళా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం సినీగాయని జానకి సంతాప సభ నిర్వహించారు. ముందుగా జానకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సమాఖ్య అధ్యక్షులు కనకం రమణయ్య, ప్రధాన కార్యదర్శి మాదరి శ్రీనివాస్, పానుగంటి అంజలి, మాధవి, వెంకటేశ్వరరావు, అంజిబాబు, లక్ష్మణ్, రాజేశ్వరరావు, మధునయ్య, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
ఎస్సీ విద్యార్థులకు
మెరుగైన వసతి
పెద్దపల్లి: ఇంటర్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఎం.రవీందర్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలో ఎస్సీ బాలుర, బాలికల వసతి గృహాలను ప్రారంభించారు. పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ కళాశాలల్లో చదువుతున్న అర్హులైన ఎస్సీ విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న వసతి సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యలో రాణించాలని సూచించారు. సహాయ సాంఘిక సంక్షేమ అధికారి శ్రావణ్ కుమార్, మంథని సహాయ సాంఘిక సంక్షేమ అధికారి వెంకటస్వామి, వసతి గృహ సంక్షేమ అధికారులు సంతోష్, శైలజ పాల్గొన్నారు.


